ETV Bharat / state

Government No Steps on Kadapa Steel Plant: సీఎం గారూ.. రెండు సార్లు శంకుస్థాపన చేసిన కడప స్టీల్ ప్లాంట్​ని ఎలా మరిచారు..?

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2023, 11:00 AM IST

Government No Steps on Kadapa Steel Plant: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడపజిల్లాకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే అంశం కలగానే మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రం స్టీల్ ప్లాంట్ నిర్మించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే ప్రైవేటు భాగస్వామ్యంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని రెండు సార్లు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి.. ఇపుడు వాటి ఊసే ఎత్తడం లేదు. 30 నెలల్లో మొదటిదశ పనులు పూర్తి చేస్తామని ప్రకటించినా పనులు పునాదిరాయి దాటడం లేదు. రెండుసార్లు టెంకాయి కొట్టిన జగన్‌ చిత్తుశుద్ధి ఇదేనా..? మీది తుప్పు సంకల్పమేనా సీఎం గారూ అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Government No Steps on Kadapa Steel Plant
Government No Steps on Kadapa Steel Plant

Government No Steps on Kadapa Steel Plant: 2019 డిసెంబరు 23న ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన సందర్భంగా కన్యతీర్థం బహిరంగ సభలో మూడేళ్లలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేస్తానని సీఎం జగన్‌ చెప్పారు. ముఖ్యమంత్రి అయిన ఆర్నెళ్లకే టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారని సీఎం సెలవిచ్చారు. మరీ ఈ ఉక్కు ఫ్యాక్టరీ కల సాకారం చేయడంలో మీ చిత్తశుద్ధి టెంకాయ కొట్టడం వరకేనా? ఫ్యాక్టరీని వాస్తవ రూపంలోకి తేవడం కాదా? సొంత జిల్లా ప్రజలను ఇలా మోసం చేసిన మీరు రాష్ట్ర ప్రజలకు ఎలా మేలు చేస్తారు?

జన్మనిచ్చిన జమ్మలమడుగుకు ‘సున్నం’ పెట్టడమేనా రుణం తీర్చుకోవడమంటే..? ముఖ్యమంత్రి హోదాలో ఆర్నెళ్లకు ఒకసారి, మూడేళ్లకు మరోసారి టెంకాయ కొట్టడమేనా మీ చిత్తశుద్ధి అంటే..? ‘ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడ స్టీల్‌ప్లాంట్‌ రావాలని నాన్న కలలు కన్నారు.. వాటిని మీ బిడ్డగా పరిశ్రమలు తెస్తున్నా’ అంటూ మీరు చెప్పిన మాటలు నీటి మూటలేనా సీఎం గారూ..! కడప ఉక్కు ఫ్యాక్టరీ కల ఇంకెన్నాళ్లకు.. ఇంకెన్నేళ్లకు సాకారం అవుతుందో.. అసలు అవుతుందా..?

కడప ఉక్కుకు నాలుగోసారి శంకుస్థాపన.. మూడేళ్ల తర్వాత అదే స్థలంలోనే..

కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన సందర్భంగా నాటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో 9 మంది సభ్యుల బలం ఉన్న వైసీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సొంత జిల్లా కడప. అందులోనూ కడప లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఆయన సోదరుడు అవినాష్‌రెడ్డే. పార్లమెంటులో ఎంపీల సంఖ్యాబలం పరంగా నాలుగో అతిపెద్ద పార్టీ అధినేతగా, సీఎం జగన్‌ తన సొంత జిల్లాకు కేంద్రం ఇచ్చిన హామీని ఎందుకు సాధించలేకపోతున్నారు?

రెండోసారి జగన్ శంకుస్థాపన: పరిశ్రమలను మూడేళ్లకు పూర్తి చేస్తామని చెప్పిన మూడు సంవత్సరాల మూడు నెలలకు జగన్‌ మళ్లీ వచ్చారు.. అయితే వచ్చింది పరిశ్రమను ప్రారంభించేందుకు కాదు.. మళ్లీ శంకుస్థాపనకే.. 2023 ఫిబ్రవరి 15న సున్నపురాళ్లపల్లెలో ఉక్కు పరిశ్రమకు రెండోసారి జగన్‌ భూమి పూజ చేశారు. 700 కోట్లతో మౌలిక వసతులను కల్పిస్తామన్న ముఖ్యమంత్రి ప్రగల్భాలకు.. వాస్తవ కేటాయింపులకు అసలు పొంతనే లేదు. ఇప్పటివరకూ కేటాయించింది కేవలం 250 కోట్లు. ఇందులో పనులు చేసింది 50 కోట్ల మేరకే అని సంబంధిత శాఖ అధికారులే చెబుతున్నారు. అలాగే ‘ప్రొద్దుటూరు-ఎర్రగుంట్ల రైల్వేలైన్‌ కోసం కొత్తగా 10 కిలోమీటర్ల లైన్‌ నిర్మాణం కూడా జరుగుతుంది’ అని మీరే స్వయంగా ప్రకటించారు కదా ముఖ్యమంత్రి గారూ..? ఇప్పటివరకూ కనీసం ప్రతిపాదన దశ కూడా పూర్తి కాలేదెందుకు?

కడప స్టీల్​ ప్లాంట్.. మూడేళ్లయినా ఫలితం సున్నా

స్టీల్‌ప్లాంట్​కి రైలు, రోడ్డు అనుసంధానం కోసం 67వ జాతీయ రహదారిని కలుపుతూ ఏడున్నర కిలోమీటర్ల రోడ్డును రూ. 22.50 కోట్లతో నిర్మిస్తామన్నారే.. ఎన్నేళ్లకు ఆ రోడ్డు పూర్తవుతుంది? గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా పైప్​లైన్‌ వేస్తామని అన్నారు. ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడంతో 29.67 ఎకరాలను సేకరించారు. అంతే.. అక్కడితోనే పైపులైను పనులు ఆగిపోయాయి. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు తలమంచిపట్నం సబ్‌ స్టేషన్‌ నుంచి ప్రత్యేకంగా 220 కేవీలైన్‌ నిర్మిస్తున్నామన్నారు. కానీ, ఆ సబ్‌స్టేషన్‌కు ‘పవర్‌’ ఇచ్చే పనులు చేపట్టలేదు.

సిరిగేపల్లె సబ్‌స్టేషన్‌ నుంచి తాత్కాలికంగా కనెక్షన్‌ ఇచ్చారు. జమ్మలమడుగులోని 220-130 కేవీ నుంచి ఇవ్వాల్సి ఉంది. కనీసం పది కిలోమీటర్లకు పైగా దూరమున్నందున టవర్లు, లైన్‌ కోసం మరో కోటిన్నర రూపాయల ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఫ్యాక్టరీకి కేటాయించిన భూమిలో 2 కిలో మీటర్లు మేర ప్రహరీ పనులు జరిగాయి. ఇంకా 22 కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ పరిశ్రమ కోసం భూములిచ్చిన వారిలో 93 మందికి ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదు.

సీఎం పునాది వేసిన మూడేళ్ల తర్వాత కూడా అతీగతి లేని కడప ఉక్కు

ఏప్రిల్‌ ఆఖరులోగా ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు కదా జగన్‌గారూ..? కానీ, ఆగస్టు పూర్తవుతున్నా ఇప్పటికీ ఎందుకు మొదలవలేదు? సీఎం గారు టెంకాయ కొట్టి వెళ్లాక హడావుడిగా యంత్రాలను తెచ్చి మట్టిని చదును చేయడం తప్ప అక్కడ జరిగిందేమిటి? ఇలా చేస్తే మీరు చెప్పే స్టీల్‌ సిటీ ఎప్పటికి అవుతుందో.. వైఎస్సార్‌ జిల్లా ముఖ చిత్రం ఎప్పటికి మారుతుందో?. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటైతే 25 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది.

మీరు చెబుతున్నట్లుగా స్థానికులకే 75 శాతం ఉద్యోగాలిస్తే 18,750 మందికి అవకాశం లభిస్తుంది కదా. మరి వీరి కుటుంబాలు ఇంకెన్నాళ్లు పడిగాపులు కాయాలి? ఈ కర్మాగారంతో మరో లక్ష మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంటుంది. ‘ఇప్పుడు మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నందున ఈ ప్రాంతానికి ఒక్కొక్కటిగా పరిశ్రమలు రావడంతో మంచి రోజులు వస్తున్నాయి’ అని మీరు చెప్పిన మంచి రోజుల కోసం జమ్మలమడుగు జనం, నిరుద్యోగ యువత ఎదురు చూస్తూనే ఉన్నారు ముఖ్యమంత్రి గారూ.

Dharna For Kadapa Steel Plant: కడప ఉక్కు కర్మాగారం కోసం అఖిలపక్ష నేతల ధర్నా

పార్లమెంటులో జులై 25న టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ సమాధానమిచ్చారు . ‘వైఎస్సార్‌ జిల్లాలో సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధ్యయనం చేసిందని.. అక్కడ పరిశ్రమ ఏర్పాటు సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకం కాదన్నదని చెప్పారు. ఏపీలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి వీలుగా ఒక మార్గసూచీని రూపొందించేందుకు 2017లోనే ఉక్కుశాఖ ఆధ్వర్యంలో ఒక సంయుక్త టాస్క్‌ఫోర్సుని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఆ కమిటీ ఏం తేల్చిందన్న విషయాన్ని కేంద్రం బయటపెట్టలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రాన్ని నిలదీసిందీ లేదు.

ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో సీఎం మరోసారి మోసం చేస్తున్నారు: అఖిలపక్ష నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.