ETV Bharat / state

కడప స్టీల్​ ప్లాంట్.. మూడేళ్లయినా ఫలితం సున్నా

author img

By

Published : Dec 14, 2022, 8:23 AM IST

Kadapa Steel Plant : గత ప్రభుత్వం చేయలేదన్నారు. ఎన్నికలైన 6 నెలల్లోనే శంకుస్థాపన చేస్తున్నా అన్నారు. 15వేల కోట్ల పెట్టుబడితో 25వేల మందికి ఉపాధి కల్పిస్తానని ఊదరగొట్టారు. పైగా 3ఏళ్లలోనే పూర్తిచేసి తీరుతామని బీరాలు పలికారు. సీన్​ కట్​చేస్తే మూడేళ్లు పూర్తయ్యేసరికి ఇటుక కూడా పడలేదు. ఇప్పుడేమో పూర్తిగా ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఉత్పత్తితో పాటు ఉపాధిని తగ్గించారు. అంతిమంగా ఇచ్చిన మాటపై మరోసారి మాటతప్పారు ముఖ్యమంత్రి జగన్.

Kadapa Steel Plant
కడప స్టీల్​ ప్లాంట్​

కడప స్టీల్​ ప్లాంట్​పై మడమ తిప్పిన ముఖ్యమంత్రి

Kadapa Steel Plant : "ముప్పై లక్షల టన్నుల ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తున్న. మూడేళ్ల కాలంలో ఈ పరిశ్రమను పూర్తి చేసి.. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో 25వేల మందికి ఉద్యోగావకాశాలు దీని ద్వారా ఉంటాయని తెలియజేస్తున్నాను." 2019 డిసెంబరు 23 కడప ఉక్కుపరిశ్రమకు సున్నపురాళ్లపల్లె దగ్గర శంకుస్థాపన చేశాక సీఎం చెప్పిన మాటలివి. "వైఎస్సార్​ జిల్లా సున్నపురాళ్లపల్లిలో జేఎస్​డబ్లూ స్టీల్​ లిమిటెడ్​ అధ్వర్యంలో ఇంటిగ్రేటేడ్​ స్టీల్​ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సుమారుగా రెండు మిలియన్​ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో.. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరువేల మందికి ఉపాధి ఈ పరిశ్రమలో లభిస్తుంది." ఇవీ మంత్రి చెల్లుబోయిన గోపాల కృష్ణ నిన్న వెల్లడించిన వివరాలు. ఇవి మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అదే కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణంపై తీసుకున్న నిర్ణయం.

ప్రభుత్వ భాగస్వామ్యంలో కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో చెప్పిన ప్రభుత్వం.. ఏటా 5 మిలియన్ టన్నుల ముడి ఇనుము సరఫరా చేసేలా ఎన్ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. 3,285 ఎకరాలను సేకరించింది. భాగసామ్య సంస్థ కోసం ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన జారీ చేసి.. పలు సంస్థలతో సంప్రదింపులు జరిపింది.ఆ తర్వాత 2020 అక్టోబరు 27న పరిశ్రమపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కర్మాగారం ఏర్పాటుకు ఏడు ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని.. ఏడు వారాల వ్యవధిలో ఒకదాన్ని ఎంపిక చేస్తామని సమీక్షలో చెప్పారు.

ప్రక్రియ పూర్తయ్యాక 3, 4 వారాల్లో పనులు ప్రారం భించే అవకాశముందనీ చెప్పారు. అయితే ప్రభుత్వం వివిధ సంస్థలను సంప్రదించాక పరిశ్రమ ఏర్పాటుకు లిబర్టీ స్టీల్స్​నీ ఎంపిక చేసింది. అది ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో ఒప్పందం నుంచి వైదొలిగింది. తర్వాత ఎస్సార్ స్టీల్​తో అవగాహనకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అవసరమైతే పరిశ్రమ ఏర్పాటుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి.. 2019-20 బడ్జెట్ లో రూ.250 కోట్ల కేటాయించింది. చివరకు జిందాల్ సంస్థ ముందు వచ్చింది. ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందం ప్రకారం మొదటి దశలో జిందాల్ సంస్థ 3,300 కోట్లతో పనులను ప్రారంభించనుంది. మొదటి ఏడాది ఒక మిలియన్ టన్నులు, రెండో ఏడాది అదనంగా మరో రెండు మిలియన్ టన్నుల స్టీలు ఉత్పత్తి చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించిన 15 వేల కోట్ల పెట్టుబడి కాస్తా.. 8,800 కోట్లకు తగ్గడంతో పాటు 25వేల మంది ఉపాధి కాస్తా.. 6,500 మందికి తగ్గిపోయింది .

ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. సీమ వెనకబాటు గురించి పదేపదే మాట్లాడే సీఎం జగన్ ఇప్పుడు చేస్తోంది ఏంటని తెలుగుదేశం నేత శ్రీనివాసులరెడ్డి ప్రశ్నించారు. జిందాల్తో పాటు ప్రభుత్వం కూడా మరో 10వేల కోట్ల పెట్టుబడి పెట్టి జాయింట్వెంచర్లో పరిశ్రమను నిర్మించాలని.. వామపక్షాల నేతలు డిమాండ్​ చేస్తున్నారు. ఇచ్చిన విధంగా పరిశ్రమను నిర్మించి ఉపాధి కల్పించకపోతే సీఎం జగన్.. సీమకు అన్యాయం చేశారని భావిస్తామని విపక్షాలు స్పష్టంచేశాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.