ETV Bharat / state

ROADS: నరకప్రాయంగా 'కడప' రహదారులు.. ఏ రోడ్డు చూసినా గతుకులు.. గుంతలే..!

author img

By

Published : Jun 12, 2022, 11:51 AM IST

Updated : Jun 12, 2022, 8:37 PM IST

ROADS IN KADAPA: కడప ముఖ్యమంత్రి జగన్ సొంత గడ్డ.. ఇక అభివృద్ధికి అడ్డేముంది అనుకుంటే మాత్రం పొరబడినట్టే. మిగిలిన పనుల సంగతి దేవుడెరుగు.. కనీసం రోడ్లు కూడా సరిగా లేవని ప్రజలు మొత్తుకుంటున్నారు. గుంతల రోడ్లపై ప్రయాణంతో ఒళ్లు గుళ్లవుతోందని వాపోతున్నారు. ఏడాది కిందట ఎంతో ఆర్భాటంగా సీఎం శంకుస్థాపన చేసిన రోడ్లు ఇప్పటికీ టెండర్లకు నోచుకోలేదంటే.. మిగిలిన వాటి పరిస్థితి ఎంత దుర్భరమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని అంటున్నారు. నగరాల్లో నరకప్రాయంగా మారిన రహదారుల దుస్థితిని పరిశీలిస్తున్న "ఈటీవీ- ఈటీవీ భారత్" కడప రోడ్ల దైన్యంపై అందిస్తున్న ప్రత్యేక కథనం..

ROADS
నరకప్రాయంగా కడప రహదారులు

నరకప్రాయంగా కడప రహదారులు

ROADS IN KADAPA: కడప నగరంలో రహదారుల పరిస్థితి.. నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ఏ రోడ్డు చూసినా.. గతుకులు, గుంతలే దర్శనమిస్తున్నాయి. ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులు మాత్రం చేయడం లేదు. వీటికి తోడు.. పైపులైన్లు, భూగర్భ డ్రైనేజీ పేరిట అడ్డగోలుగా తవ్వేస్తుండటం.. పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. చిన్నపాటి వర్షానికే రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు చేరి.. తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయి.

ప్రధానమైన రాజీవ్ మార్గ్‌... కడపలో రోడ్ల దుస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. 750 మీటర్ల పొడవైన రెండు వరుసల సిమెంట్ రోడ్డు పనుల్ని ఏడాది కిందట ఆర్భాటంగా ప్రారంభించినా.. ఇప్పటికి సగం కూడా పూర్తికాలేదు. ఆక్రమణల తొలగింపు పట్ల నిర్లక్ష్యం, కమీషన్ల వ్యవహారమే జాప్యానికి కారణమనే ఆరోపణలు ఉన్నాయి. ఈ రోడ్డు నిర్మాణం పేరిట.. అందరికీ ఆహ్లాదం పంచే రాజీవ్ పార్కును మూసేశారు.

కడప​లో అత్యంత రద్దీగా ఉండే క్రిస్టియన్ లైన్.. నగర ప్రజలకు నరకం చూపుతోంది. ఈ మార్గాన్ని ఎక్కడపడితే అక్కడ ఇష్టారాజ్యంగా తవ్వేశారు. కొన్నిచోట్ల గుంతలను అలాగే వదిలేయగా.. మరికొన్ని చోట్ల కంకర పోసి సరిపెట్టారు. సగం సగం పనులతో.. ఇటీవల ఓ ప్రైవేట్ కళాశాల బస్సు కంకర పోసిన గుంతలో ఇరుక్కుపోయింది. దీనివల్ల దాదాపు 2 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. క్రేన్ సాయంతో బస్సును బయటికి తీసి.. ట్రాఫిక్ పునరుద్ధరించాల్సి వచ్చింది. ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ ఈ క్రిస్టియల్ లైన్‌లోనే ఉన్నాయి. ఇక్కడికి వచ్చే రోగులు, వారి బంధువులు.. గుంతల రోడ్డుతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

ఇక కడపలో దాదాపు ఏడాది కిందట స్వయంగా సీఎం శంకుస్థాపన చేసిన రోడ్లకూ అతీగతీ లేదు. మాసాపేట నుంచి బైపాస్ రోడ్డు వరకు తలపెట్టిన రహదారిని రద్దు చేసి.. ఆ నిధుల్ని వరద కాల్వల ఆధునికీకరణకు మళ్లించారు. కడప బస్టాండ్ నుంచి Y-జంక్షన్ వరకు ఒకటి, పొట్టిశ్రీరాములు సర్కిల్ నుంచి అన్నమయ్య కూడలి వరకు మరొకటి, కృష్ణా సర్కిల్ నుంచి దేవునికడపకు ఇంకో రోడ్డు.. 251 కోట్లతో పూర్తిచేస్తామని ఘనంగా ప్రకటించారు. అయితే.. నిధులు విడుదలవ్వక.. కనీసం టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టలేదు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 12, 2022, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.