ETV Bharat / state

గంజాయి ముఠా కొత్త ఎత్తులు.. ఆట కట్టించిన పోలీసులు

author img

By

Published : Mar 24, 2023, 5:46 PM IST

Etv Bharat
Etv Bharat

Ganja Smugglers: గంజాయి స్మగ్లర్​లకు ఎన్నిసార్లు సంకేళ్లు వేసిన వాళ్ల తీరు మారడం లేదు. మత్తు ముఠా కొత్త ఎత్తులతో వైఎస్సార్ జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. తాజాగా 11 మంది స్మగ్లర్​లను పోలీసులు అరెస్టు చేశారు. త్వరలో ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేయబోతున్నామని ఎస్పీ అన్బురాజన్ చెప్పారు.

Ganja Smugglers : వైయస్సార్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు ఎన్ని అడ్డుకట్టలు వేసినప్పటికీ స్మగ్లర్ యథేచ్చగా జిల్లాల్లోకి ప్రవేశించి గంజాయి విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. సెబ్​ అధికారులు, పోలీసులు సంయుక్తంగా గంజాయి స్మగ్లర్లపై నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నారు. వైజాగ్ నుంచి గంజాయి అక్రమ మార్గంలో జిల్లాలోకి ప్రవేశిస్తుందని స్మగ్లర్ల ద్వారా సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అన్బురాజన్.. తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు.

23 కిలోల గంజాయి.. 11 మంది అరెస్టు : మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, అట్లూరు మండలాల్లోని పోలీసులు గంజాయి స్మగ్లర్లపై దాడులు చేశారు. ఈ దాడుల్లో 11 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 23 కిలోల గంజాయి, ఏడు సెల్ ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీన పరుచుకున్నారు. పది రోజుల కిందట ఏడుగురు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారిని విచారించగా.. వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు నిఘా ఉంచి 11 మందిని అరెస్టు చేశారు.

గంజాయి విక్రయించడం.. తాగడం కూడా నేరమే : అరెస్ట్ చేసిన వారిని ఎస్పీ అన్బురాజన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో​ మీడియా ఎదుట హాజరు పరిచారు. అరెస్ట్ అయిన వారిలో ఓ మహిళ కూడా ఉంది. గంజాయి ఎక్కడి నుంచైతే రవాణా అవుతుందో.. ఆ ప్రాంతం నుంచి గంజాయి విక్రయించే వరకు గట్టిగా నిఘూ ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. గంజాయి విక్రయించిన, తాగిన కూడా నేరమేనని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న వారిపై గట్టిగా నిఘా ఉంచామని, గంజాయికి బానిసైన వారిని గుర్తించి.. వారిని మానసిక కేంద్రాలకు పంపిస్తున్నామని ఆయన చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో ఈ ఏడాదిలో 33 మంది స్మగ్లర్లను అరెస్టు చేశామని ఎస్పీ పేర్కొన్నారు.

గంజాయి ఉపయోగిస్తున్న విద్యార్థులు.. పీడీ యాక్ట్ ప్రయోగం : గంజాయి ఎక్కువగా కళాశాల విద్యార్థులు ఉపయోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అక్కడ ప్రత్యేకమైన పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేశామని, మహిళా పోలీసులను మఫ్టీలో ఉంచామని ఎస్పీ చెప్పారు. ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్న, ఎవరైనా తాగుతున్నారని తెలిసినా 100 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. గంజాయి వల్ల యువత చెడు మార్గంలో పయనిస్తూ నేరాలకు పాల్పడుతున్నారని, నేరాలను కట్టడి చేసేందుకు గంజాయిపై ప్రత్యేక దృష్టి ఉంచామని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని, త్వరలో ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేయబోతున్నామని ఎస్పీ అన్బురాజన్ చెప్పారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.