ETV Bharat / state

Young Austronaut Jahnavi: 'చంద్రుడిపైకి వెళ్లాలని కల'... వ్యోమగామి శిక్షణ పూర్తి చేసుకున్నపాలకొల్లు యువతి

author img

By

Published : Jul 19, 2023, 5:47 PM IST

young Astronaut jahnavi
యువ వ్యోమగామి జాహ్నవి

Young Astronaut Jahnavi: కలలు అందరూ కంటారు.. కానీ వాటిని సాకారం చేసుకునే వారు మాత్రం కొందరే ఉంటారు. ఈ కోవకు చెందిందే పాలకొల్లుకు చెందిన యువతి దంగేటి జాహ్నవి. చిన్నప్పుడు ఆరుబయట పడుకుని అమ్మమ్మ చెప్పిన చందమామ కథలు విన్న ఆ యువతి.. అప్పుడే అంతరిక్షంపై ఆశలు పెంచుకుంది. రోదసిలో అడుగుపెట్టాలన్న అభిలాషను తన మనో ఫలంకంపై బలంగా రాసుకుంది. ఈ క్రమంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంది. ఫలితంగా చిన్న వయసులోనే అది కూడా మన దేశం నుంచి వ్యోమగామి శిక్షణ పూర్తి చేసుకున్న యువతిగా చరిత్ర సృష్టించింది.

Young Astronaut Jahnavi: ఈ యువతి పేరు దంగేటి జాహ్నవి. ఊరు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏడాది వయసున్నప్పుడే జాహ్నవి తల్లిదండ్రులు కువైట్​కు వెళ్లిపోగా.. అప్పటి నుంచీ ఆమె ఆలనా పాలనా అంతా అమ్మమ్మే చూసింది. అలా అమ్మమ్మతో జాహ్నవికి అనుబంధం ఎక్కువ. చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన చందమామ కథల్లో అందరూ చందమామను చూస్తే.. జాహ్నవి మాత్రం జాబిలిపై అడుగుపెట్టడం ఎలా అని ప్రశ్నించుకుంది. ఇంటర్ వరకూ స్థానికంగా పాలకొల్లులోనే చదువుకున్న జాహ్నవి.. చదువులో సాధారణమే అయినా ఆటల్లో బాగా రాణించేంది. పాఠశాల స్థాయిలో నిర్వహించే విజ్ఞాన ప్రదర్శనలు అంటే జాహ్నవికి పిచ్చి. అలా ఎనిమిదో తరగతిలోనే తాను రూపొందించిన ఓ ప్రాజెక్టుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్​లో చోటు లభించింది.

యువ వ్యోమగామి జాహ్నవి

ఏ రంగంలో రాణించాలన్నా దానిపై ఎంతో కొంత అవగాహన తప్పనిసరి. లేదా అందులో ప్రావీణ్యత సాధించిన వారి అడుగుజాడల్లోనైనా నడవాలి. కానీ రోదసిలో అడుగుపెట్టాలి, వ్యోమగామిగా రాణించాలన్న అభిలాష, ఆసక్తి ఉన్నా.. ఆ దిశగా నడిపించేవారు కానీ, మార్గనిర్దేశం చేసే వారు జాహ్నవికి లేరు. సరిగ్గా అదే సమయంలో.. చీరాలలో ఇస్రో వరల్డ్ స్పేస్ వీక్ పేరుతో నిర్వహించిన కార్యక్రమం జాహ్నవి కేరీర్​ను మలుపు తిప్పిందని చెప్పాలి. అక్కడే ఆమెకు తాను ఎంచుకున్న వృత్తిలో రాణించేందుకు బలమైన అడుగులుపడ్డాయి.

కరోనా లాక్ డౌన్ అందరికీ అవరోధంగా మారితే.. జాహ్నవికి మాత్రం ఆ సమయం బాగా అక్కరకు వచ్చింది. గడప దాటి అడుగుబయట పెట్టలేని ఆరోజుల్లో.. ఇంటర్నెట్ ద్వారా అంతరిక్ష ప్రయోగాలు, వ్యోమగామి శిక్షణలు ఇచ్చే ప్రొఫెసర్లు, శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో తరచూ సంభాషించడం, వారి అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా తాను ఎంచుకున్న మార్గానికి సంబంధించి సమాచారాన్ని సేకరించింది. అలా నాసా ఆధ్వర్యంలో అందించే ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగామ్(ఐఏఎస్​పీ)​కు ఎంపికయ్యింది. మన దేశం నుంచి చిన్న వయసులోనే ఈ శిక్షణకు ఎంపికైన యువతిగా జాహ్నవి రికార్డు సృష్టించింది. అలా నాసా లూనార్ ఛాలెంజ్, నాసా స్పేస్ హ్యాకథాన్ లాంటి ఈవెంట్స్​లో పాల్గొని మంచి అనుభవం సాధించింది. ఈ క్రమంలో ఓ రోవర్​ని సైతం తన బృందంతో కలిసి నిర్మించింది. ఆస్టరాయిడ్ సెర్చ్ క్యాంపెయిన్ లోనూ పాల్గొన్న జాహ్నవి.. ఓ గ్రహశకలాన్ని సైతం కనుగొంది.

వ్యోమగామి శిక్షణ పూర్తి చేసుకోవాంటే మాటలు కాదు. అందుకు ఎంతో గుండె ధైర్యం కావాలి. అంతరిక్షంలో ఎదురయ్యే ప్రతీ సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. నాసా శిక్షణ అనంతరం ఏఏటీసీ(అనలాగ్ ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ సెంటర్) పోలాండ్ నుంచి ఆహ్వానం అందుకున్న జాహ్నవి అక్కడ మలిదశ శిక్షణ పూర్తి చేసుకుంది. ఇక్కడే వ్యోమగామిగా రాణించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. శిక్షణలో భాగంగా 12 రోజుల పాటు ఓ గదిలో రోదసిలోని వాతావరణాన్ని సృష్టించి.. అందులో ఓ బృందాన్ని ఉంచగా.. ఆ టాస్క్​ను జాహ్నవి విజయవంతంగా పూర్తి చేసుకుంది.

అనంతరం ఐస్ ల్యాండ్ జియో స్పేస్ నిర్వహించే ఎక్స్ ప్లోర్ ఏ ఫెస్టివల్​కు ఎంపికైన జాహ్నవి.. భారతదేశం నుంచి ఈ శిక్షణకు ఎంపికైన ఏకైక యువతిగా గుర్తింపు తెచ్చుకుంది. వివిధ దేశాల నుంచి రోదసిలోకి వెళ్లి వ్యోమగాములుగా రాణిస్తున్న ఎంతో మంది ఈ సంస్థ ధృవీకరించిన వారే. ఇక్కడ వ్యక్తిగత శిక్షణలన్నీ పూర్తి చేసుకున్న జాహ్నవి తొలిసారిగా సిల్వర్ వింగ్స్ బ్యాడ్జ్ సాధించిన యువతిగా రికార్డు సృష్టించింది. తమ కుమార్తె ఎదుగుదలను దగ్గరుండి చూడలేకపోయామన్న బాధ.. జాహ్నవి తల్లిదండ్రుల కళ్లలో స్పష్టంగా కనిపిస్తున్నా.. ఆమె సాధించిన విజయాలు ఆ బాధను మరిచిపోయేలా చేస్తున్నాయి.

తల్లిదండ్రుల తోడు బిడ్డకు అవసరమ్యే సమయంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎక్కడో దూరంగా ఉన్నా.. జాహ్నవి దేశం గర్వించే స్థాయికి ఎదగడంపై ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లకు పెళ్లి చేయకుండా దేశాలు తిప్పడం ఏంటని ఇరుగుపొరుగు, బంధువుల నుంచి సూటిపోటి మాటలు ఎదురైనా.. వారు మాత్రం తమ బిడ్డకు స్వేచ్ఛనిచ్చి అనుకున్న రంగంలో రాణించేందుకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్న జాహ్నవి.. వ్యోమగామి శిక్షణలో భాగంగా కమర్షియల్ పైలట్ గానూ తర్ఫీదు పొందుతోంది. కేవలం ఆసక్తి ఒక్కటే ఉంటే సరిపోదు.. ఆసక్తి ఉన్న రంగం కంటే అనుభవం ఉన్న రంగాన్ని ఎంచుకుంటే అందులో బాగా రాణించవచ్చనేది జాహ్నవి చెప్పే సూత్రం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.