ETV Bharat / state

గిరిజన మహిళల జూట్ బ్యాగులు.. అటు ఉపాధి.. ఇటు పర్యావరణ పరిరక్షణ

author img

By

Published : Jul 31, 2020, 12:25 PM IST

Updated : Jul 31, 2020, 10:52 PM IST

కొండకోనల్లో పుట్టి పెరిగి, నాగరికతలో వెనుకబడిన గిరిజనులు వారు. అయితేనేం పర్యావరణ పరిరక్షణలో ముందుంటున్నారు. ప్లాస్టిక్ బ్యాగుల వాడకాన్ని తగ్గించడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. జ్యూట్ బ్యాగులు తయారుచేస్తూ ఉపాధి పొందడమే కాక పర్యావరణ పరిరక్షణలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. జూట్ బ్యాగుల తయారీ, మార్కెటింగ్​లో ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆ బ్యాగులను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

tribal women made jute bags in west godavari district
పశ్చిమగోదావరి జిల్లాలో జూట్ బ్యాగ్ యూనిట్లు

పశ్చిమగోదావరి జిల్లాలో జూట్ బ్యాగ్ యూనిట్లు

పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన మహిళలు జూట్ బ్యాగుల తయారీలో పురోగతి సాధిస్తున్నారు. ప్లాస్టిగ్ బ్యాగులను సమాజానికి దూరం చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ జూట్ బ్యాగుల తయారీ అనేకమంది గిరిజన మహిళలకు వరంగా మారింది. వారంతా సంఘాలుగా ఏర్పడి బ్యాగులు తయారుచేస్తూ ఉపాధి పొందడమే కాక.. పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తున్నారు.

పశ్చిమగోదావరిజిల్లా బుట్టాయగూడెం మండలం కేఆర్ పురం ప్రాంతంలో గిరిజన మహిళలు జూట్ బ్యాగుల తయారీ యూనిట్లు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఐటీడీఏ( గిరిజన అభివృద్ధి సాధికార సంస్థ) ఆధ్వర్యంలో ఈ యూనిట్లు నెలకొల్పారు. గిరిజన గ్రామాల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేసి.. వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్లాస్టిగ్ వాడకాన్ని తగ్గించడమే లక్ష్యంగా జూట్ బ్యాగుల తయారీ యూనిట్లు పుట్టుకొచ్చాయి. 5 నుంచి 10 మంది మహిళలు సంఘాలుగా ఏర్పడి బ్యాగులు తయారుచేస్తారు. ఐటీడీఏకు చెందిన గిరిజన యువత శిక్షణ సంస్థ ఈ యూనిట్లను పర్యవేక్షిస్తోంది. యూనిట్ నెలకొల్పాలనుకొన్న మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. జూట్ బ్యాగుల తయారీ, మార్కెటింగ్ అంశాల్లో మెళకువలు నేర్పిస్తారు. కుట్టుమిషన్లు, యంత్రాలు, ముడిసరకు ఐటీడీఏ అందిస్తుంది. ముడిసరకు నగదు మహిళల నుంచి తీసుకుని.. బ్యాగులు మార్కెటింగ్ చేశాక ఖర్చులు తీసివేసి లాభాలను వారికి అందిస్తారు. వీటివల్ల తమ కుటుంబాలను పోషించుకోగలుగుతున్నామని మహిళలు ఆనందం వ్యక్తంచేశారు.

సొంతంగా మార్కెటింగ్

జూట్ బ్యాగులకు వినియోగించే ముడిసరకు విజయవాడ, ఏలూరు ప్రాంతాల నుంచి తీసుకొస్తారు. వివిధ రంగుల్లోని జూట్​ను బ్యాగుల తయారీకి వినియోగిస్తున్నారు. ఆకర్షించేలా అనేక రకాల డిజైన్లలో బ్యాగులు తయారు చేస్తున్నారు. వివాహ శుభకార్యాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, షోరూములు నుంచి బల్క్​గా ఆర్డర్లు సైతం తీసుకొంటున్నారు. వారికి అవసరమైన ఆకృతి, డిజైన్ల మేరకు బ్యాగులను తయారు చేసి ఇస్తున్నారు. అవసరమైతే ఆయా వ్యాపార సంస్థల లేబుళ్లు ముద్రించి ఇస్తున్నారు. బల్క్​గా ఆర్డర్లు లేకపోతే సొంతంగాను మార్కెటింగ్ చేసుకొంటున్నారు. రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో దుకాణాలకు విక్రయిస్తున్నారు. ఈ బ్యాగుల ప్రాధాన్యత వినియోగదారులకు వివరించి మరీ కొనేలా చేస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. బ్యాగుల తయారీతో రోజుకు 500 వరకు సంపాదిస్తున్నామని చెప్తున్నారు

తాము ఎంచుకొన్న పనిలో ఉపాధి పొందడమే కాకుండా.. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ గిరిజన మహిళలు.

ఇవీ చదవండి...

కువైట్​లో శ్రీకాకుళం జిల్లావాసులు.. స్వదేశానికి రప్పించాల్సిందిగా వేడుకోలు

Last Updated :Jul 31, 2020, 10:52 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.