భళా బాబూరావ్! ఇంట్లో చోరీకి యత్నించిన దుండగుల్ని అడ్డుకున్న వృద్ధుడు - చివరికి ఏమైందంటే!

భళా బాబూరావ్! ఇంట్లో చోరీకి యత్నించిన దుండగుల్ని అడ్డుకున్న వృద్ధుడు - చివరికి ఏమైందంటే!
Robbery Attempt in Velpur Village: ఇంట్లో ఎవరైనా చోరీకి వచ్చారని తెలిస్తే.. ఆందోళన మొదలవుతుంది. అసలు ఏం చేయాలో తెలియదు. దుండగులు కత్తులు, తుపాకీతో చంపుతామని బెదిరిస్తే అంతే సంగతి. చివరికి పోలీసులకు సమాచారం అందిస్తాం. కానీ, ఈ వృద్ధ దంపతులు చోరీకి యత్నించిన దుండగులను అడ్డుకుని వార్తల్లోకెక్కారు.
Robbery Attempt in Velpur Village: దొంగతనానికి పాల్పడేందుకు ఇంట్లోకి చొరబడిన దుండగుల ఆగడాలను ఆట కట్టించాడు ఓ వృద్ధుడు. కత్తితో చంపుతామని బెదిరించినా సరే వెనుకాడలేదు. వయస్సు పైబడింది కదా అని నిస్సహాయతకు గురి కాలేదు. వృద్ధుడు అతని భార్య చేసిన పనికి దొంగలు అక్కడి నుంచి తోక ముడిచారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దోపిడీకి పాల్పడిన దుండగులను అరెస్టు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా జిల్లా తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో బండా బాబురావు వృద్ధ దంపతులు నివసిస్తున్నారు. రాత్రి సమయంలో ముగ్గురు యువకులు వృద్ధుల ఇంట్లో చోరికి ప్రయత్నించారు. కాలింగ్ మోగడంతో.. ఎవరో వచ్చారని బాబురావు తలుపు తీశాడు. అంతలోనే ముగ్గురు యువకులు కత్తులు, బొమ్మ తుపాకీతో బాబురావుని చంపుతామని బెదిరించగా.. అతను ఏ మాత్రం గుండె ధైర్యాన్ని కొల్పోలేదు. చంపుతామని బెదిరించినా సరే వారిని అడ్డుకున్నాడు.
చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసిన అతని భార్య: ఈ సమయంలో భార్యని అప్రమత్తం చేశాడు. ఆమె గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు నిద్రలేచారు. దాంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దుండగులను బాబురావు అడ్డుకునే క్రమంలో పెనుగులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో బాబురావుకు స్వల్ప గాయాలయ్యాయి.
అసలు నిజం వెలుగులోకి: ఘటనపై బాబురావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో తేలిన అంశాలు అందర్నీ ఒక్కసారిగా ఆలోచింపజేశాయి. తణుకు మండలంలోని దువ్వ గ్రామంలో ఓ ఫర్నిచర్ తయారు చేసే కార్ఖానా ఉంది. ఆ కార్ఖానాలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొందరు యువకులు పనిచేస్తున్నారు. సంవత్సరం క్రితం బాబురావు తన ఇంట్లో చెక్క పనులకై ఆ ఫర్నిచర్ కార్ఖానాను సంప్రదించాడు. బాబురావు ఇంట్లో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు పనిచేశారు.
ఆ యువకులు బాబురావు ఇంట్లో పనిచేస్తున్న సమయంలో ఇద్దరు వృద్ధ దంపతులే ఉంటారనే విషయాన్ని పసిగట్టారు. దీంతో ఆ ఇద్దరు యువకులు వారితో పనిచేసే మరో ముగ్గుర్ని తీసుకుని దొంగతనానికి బాబురావు ఇంటికి వచ్చారు. అప్పుడు పని చేసిన యువకుల్ని బాబురావు గుర్తుపడతాడని భావించి.. వారు బయటే ఉండగా.. ముగ్గురు మాత్రమే ఇంట్లోకి చొరబడ్డారు.
బాబురావు ఇంటిచుట్టూ పెన్షింగ్, సీసీ కెమేరాల పర్యవేక్షణ వంటి సౌకర్యాలు ఉన్నాయి. బాబురావు ఇంటినుంచి పరారైన యువకులు.. దువ్వలోని ఓ ఇంట్లో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిలో ఓ వ్యక్తి మైనర్ కావడంతో అతడ్ని జువెనైల్ హోం తరలించినట్లు పోలీసులు వివరించారు.
