నత్తనడకన సాగుతున్న పోలవరం నిర్మాణం..

author img

By

Published : Nov 18, 2022, 7:08 AM IST

Updated : Nov 18, 2022, 8:42 AM IST

Polavaram

Polavaram: రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్టుగా చెప్పుకునే పోలవరం నిర్మాణం నత్తనడకను తలపిస్తోంది. ప్రాజెక్టు పనులు తాము వచ్చాకే వేగంగా జరిగాయని వైకాపా ప్రభుత్వం చెబుతుంటే.. వాస్తవం మాత్రం మరోలా ఉంది. ఏడాది కాలంలో హెడ్‌వర్క్స్‌ పనులు జరిగింది కేవలం 0.99 శాతం మాత్రమే. ఇక భూసేకరణ, పునరావాసం పనులు జరిగింది రెండు శాతం లోపే. మొత్తంగా ఇప్పటికి ప్రాజెక్టు నిర్మాణం సగమైనా పూర్తి కాలేదు. ఇటీవల జరిగిన పీపీఏ సమావేశంలో ఇంజినీర్లు చెప్పినవే..

నత్తనడకన సాగుతున్న పోలవరం నిర్మాణం

Polavaram: తాము అధికారంలోకి వచ్చిన తర్వాత.. పోలవరం ప్రాజెక్టు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని.. గడువులోగానే పూర్తి చేసి తీరతామని వైకాపా ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా.. ఆచరణలో పూర్తి భిన్నంగా ఉంది. గత ఏడాది కాలంలో కీలకమైన భూసేకరణ, పునరావాసం 1.97 శాతమే పూర్తయ్యాయి. మొత్తం పనుల్లో.. ఏడాదిలో జరిగినవి 5.4 శాతమే. ప్రధానమైన హెడ్‌వర్క్స్‌లో పురోగతి 0.99 శాతమే. భూసేకరణ, పునరావాస పనులు 2021 అక్టోబరు 31 నాటికి 20.19 శాతం జరిగితే 2022 అక్టోబరు 31నాటికి 22.16 శాతమే పూర్తయ్యాయి. మొత్తంగా ప్రాజెక్టులో హెడ్‌వర్క్స్, కాలువలు అన్నీ కలిపి నిరుడు అక్టోబరు 31 నాటికి 42.56 శాతం పూర్తైతే.. ఈ ఏడాది అక్టోబరు నాటికి అది అతి కష్టం మీద 47.96 శాతానికి చేరింది.

ఈ నెల 16న జరిగిన పోలవరం ప్రాజెక్టుఅథారిటీ పీపీఏ.. సమావేశంలో సంబంధిత ఇంజినీర్లు ఇచ్చిన ప్రజెంటేషన్ ప్రకారమే ప్రాజెక్టులో 50శాతం పనులు పూర్తి కాలేదు. ప్రాజెక్టులో.. కొన్ని పనులు చేసే గుత్తేదారులను తొలగించారు. ఆ స్థానంలో కొత్త గుత్తేదారులను... నేటికీ ఎంపిక చేయలేదు. హెడ్‌వర్క్స్‌లో ఎడమవైపు నావిగేషన్‌ కాలువ, లాక్‌కు సంబంధించిన పనిని ముందుగానే ముగిస్తూ 2020 జులై 8న ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఈ పనిని ఇప్పటి వరకు మరొకరికి అప్పగించలేదు. ఎడమ కాలువకు సంబంధించి మిగిలిన 5 ప్యాకేజీల పనుల గుత్తేదారులను రెండేళ్ల క్రితం తొలగించినా ఇప్పటి వరకు కొత్తవారిని ఎంపిక చేయలేదు. డిస్ట్రిబ్యూటరీ పనులైతే ఎప్పుడు చేపడతారో.. ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి..

2017-18వ సంవత్సరం ధరల ప్రకారం 55,657 కోట్లకు సవరించిన అంచనాను.. కేంద్రానికి పంపారు. ఆర్థికశాఖ ఆధ్వర్యంలోని కమిటీ 47,726 కోట్లకు.. సిఫారసు చేసింది. దీనికి కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించలేదు. 2013-14 ధరల ప్రకారమే.. చెల్లిస్తామని స్పష్టంచేసింది. అదే జరిగితే.. తాజా అంచనాలో సగం కూడా రాదు. ఈ నేపథ్యంలో తాజా వ్యయాన్ని ఆమోదించాలంటూ.. రాష్ట్రం పంపిన దస్త్రం రెండేళ్లుగా అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. తుది ఆమోదంతో సంబంధం లేకుండా.. మొదట 41.15 మీటర్ల వరకు నీటి నిల్వకు వీలుగా 10వేల కోట్లు అడహక్‌గా విడుదల చేయాలని కోరినా.. అతీగతీ లేదు. తాగునీటి సరఫరాకు అయ్యే మొత్తాన్ని ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో భాగంగా చూడాలన్న రాష్ట్ర వినతిపైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీపీఏ మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూనే ఉన్నాయి.

మొదట 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసి పాక్షిక ప్రయోజనాలు కల్పించేందుకు 10,485 కోట్ల రూపాయలు అవసరమవుతుందని అంచనా వేసి ఆరు నెలలు దాటింది. కానీ ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. తాజా నివేదిక ప్రకారం 2022 అక్టోబరు వరకు 20,174 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 2014లో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత 15,970 కోట్ల పనులు చేశారు. దీనిలో కేంద్రం 13,097 కోట్లు తిరిగి ఇచ్చిందని, మరో 2,873 కోట్లు రావాల్సి ఉందని తాజాగా రాష్ట్రం.. పీపీఏకు ఇచ్చిన నివేదిక పేర్కొంది..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో లక్షా ఆరు వేల ఆరు కుటుంబాలు నిర్వాసితులవుతాయని అంచనా వేశారు. వీరందరినీ తరలించి, మౌలిక సదుపాయాలు కల్పించడానికి.. ఎక్కువ సమయం పడుతుందని గుర్తించారు. మొదట 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయడానికి వీలుగా..మొదటి దశలో పునరావాసం పూర్తి చేయాలని.. ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశకు సామాజిక ఆర్థిక సర్వేలో 20,946 కుటుంబాలను గుర్తించగా.. ఇప్పటి వరకు 11,021 కుటుంబాలనే తరలించినట్లు పీపీఏ సమావేశంలో సమర్పించిన నివేదికలో.. రాష్ట్రం పేర్కొంది.

రెండో దశ సామాజిక ఆర్థిక సర్వేలో.. ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 14,703 కుటుంబాలను, అల్లూరి జిల్లాలోని చింతూరు, ఎటపాక మండలాల్లో.. 69,921 కుటుంబాలను గుర్తించింది. మొత్తంగా మరో 94,985 కుటుంబాలను తరలించి పునరావాసం కల్పించాలి. ఏడాదికి నాలుగైదు వేల కుటుంబాలకు పునరావాసం కల్పించి తరలిస్తే.. మొత్తం పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేని పరిస్థితి. పూర్తి స్థాయిలో.. పునరావాసానికి కనీసం మరో 20 వేల కోట్లు అవసరంకానున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated :Nov 18, 2022, 8:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.