ETV Bharat / state

Pawan kalyan on CM Jagan: 'పోలవరం కాదు​.. కనీసం కాలువల పూడికలైనా తీయించగలవా..?'

author img

By

Published : Jul 14, 2023, 10:53 PM IST

Updated : Jul 15, 2023, 6:26 AM IST

pawan
pawan

Pawan Kalyan Sensational comments on CM Jagan: తణుకు వేదికగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జగన్‌ కొంపలంటిస్తారు.. పవన్‌ గుండెలంటిస్తారు' అంటూ వ్యాఖ్యానించారు. జగన్.. చెత్తపాలన వచ్చాకే చెత్త పన్ను వచ్చిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan Sensational comments on CM Jagan: 'జగన్‌.. నువ్వు కొంపలంటిస్తావు. నేను.. గుండెలంటిస్తాను' అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వేలాది మంది కార్యకర్తల మధ్య భారీ ర్యాలీతో వెళ్లిన పవన్.. తణుకులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్సీపీ పాలనపై, సీఎం జగన్ చేసిన దారుణాలపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

జగన్‌ పాలనపై నిశితంగా విశ్లేషించుకుందాం.. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తణుకులో పుట్టిన దేవరకొండ బాలగంగాధర తిలక్‌ తనకు ప్రేరణ అంటూ ఆయన రాసిన అమృతం కురిసిన రాత్రితో పవన్​ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జనసేన ఆవిర్భావ సభలో తన తొలి పలుకులు తిలక్‌ కవిత్వంతోనే ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. క్షమాపణలతో తణుకులో సభను ప్రారంభిస్తున్నానని అన్నారు. విడివాడ రామచంద్రరావుకు క్షమాపణలు చెప్తున్నానన్న పవన్‌ కల్యాణ్‌.. ఇక్కడ సీటు ఇచ్చిన వ్యక్తి పార్టీ వదిలి వెళ్లిపోయారన్నారు. సీటు ఇవ్వకపోయినా రామచంద్రరావు పార్టీ కోసమే ఉన్నారన్నారు. గుణం లేని వాడే కులం గొడుగుపడతాడని జాషువా ఆనాడే చెప్పాడని పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నేటి సభలో జగన్‌ పాలనపై నిశితంగా విశ్లేషిద్దామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

'జగన్‌..నువ్వు కొంపలంటిస్తావు.. నేను.. గుండెలంటిస్తాను': పవన్ కల్యాణ్

అందుకేనా పరదాలు కట్టుకుని తిరుగుతున్నావు..?.. ''జగన్‌ కొంపలంటిస్తారు.. పవన్‌ గుండెలంటిస్తారు. జగన్‌.. 32 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కొంపలు కూల్చారు. జగన్ రాగానే 32 మంది భవన కార్మికులు చనిపోయారు. ఈ జగన్ భవన కార్మికుల సెస్‌ నిధులు దోచుకున్నాడు. జగన్.. నువ్వు ఇంటి పన్ను రూ.650 పెంచావు. జగన్.. నీ చెత్తపాలన వచ్చాకే చెత్త పన్ను వచ్చింది. జగన్‌.. మద్యపాన ప్రియుల పొట్టకొట్టి రూ.30 వేల కోట్లు కొట్టేశావు. జగన్.. రేట్లు పెంచావు కాబట్టే.. పరదాలు కట్టుకుని తిరుగుతున్నావా..? జగన్‌.. నీ పాలన ఏమాత్రం బాగా లేదు. జగన్‌.. నువ్వు నొక్కని బటన్‌ల సంగతి ఏంటి..?'' అంటూ పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు.

రాజకీయ అవినీతిపై జనసేన పోరాటం ఆపదు.. అనంతరం సీఎం జగన్ వేల కోట్లు రుణాలు తీసుకుని బడ్జెట్‌ లెక్కల్లో చెప్పలేదంటూ పవన్‌ కల్యాణ్ నిలదీశారు. తణుకు టీడీఆర్‌ స్కామ్‌ రూ.309 కోట్లు, ఇసుక ధరను రూ.10 వేల నుంచి రూ.40 వేలకు పెంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ పాలన ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్న జగన్‌.. పాలనలో రూ.60 మద్యాన్ని రూ.160కు పెంచారని, రాజకీయ అవినీతిని అందరం కలిసి ఆపాలని పిలుపునిచ్చారు. మొదటి నుంచి రాజకీయ అవినీతిపై జనసేన పోరాటం చేస్తూనే ఉందన్నారు. తణుకుకు ఒక డంపింగ్‌ యార్డు కూడా సరిగ్గా లేదు గానీ చెత్త పన్ను వేస్తారా..?, మద్దతు ధర కావాలన్న రైతులపై కేసులు పెడతారా..? అని పవన్‌ కల్యాణ్ మండిపడ్డారు.

జగన్‌..అర్థమైందా ఎందుకు జగ్గూభాయ్‌ అంటున్నానో.. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ను జగన్ పూర్తి చేయలేరంటూ పవన్‌ కల్యాణ్ దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్‌.. కనీసం కాలువల పూడికలైనా తీయించగలవా..? అంటూ ఎద్దేవా చేశారు. రైతులు గిట్టుబాటు ధర అడిగితే వ్యవసాయ మంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని పవన్‌ కల్యాణ్ వాపోయారు. జగన్ రెడ్డి విపత్తు నిర్వహణ నిధులు కూడా దారి మళ్లించారంటూ పవన్‌ మండిపడ్డారు. 'జగన్‌.. అర్థమైందా.. నిన్ను ఎందుకు జగ్గూభాయ్‌ అని అంటున్నానో. నువ్వు ప్రజల డబ్బు దోచేస్తున్నావు. జగన్‌ పథకాలు అన్నీ 70-30 పథకాలు. జగన్‌ దోపిడీని కాగ్‌ సవివరంగా బయటపెట్టింది. జగన్‌.. తాను దోచేసిన డబ్బు గురించి ఎప్పుడూ చెప్పరు. ఎప్పట్నుంచో ఉన్న పథకాలకు నవరత్నాలు అని పేరెందుకు పెట్టావు..? జగన్‌ కొత్త పథకాలు ఏమీ అమలు చేయట్లేదు. జగన్‌ ఉద్యోగులకు సీపీఎస్‌ రద్దు చేస్తానని చేయలేకపోయారు. జగన్‌.. డిజిటల్‌ దొంగలా తయారయ్యారు. జగన్‌.. డిజిటల్‌ గ్లిచ్‌ పేరుతో ఉద్యోగుల సొమ్ము మళ్లించారు. జగ్గూ భాయ్‌ అంటున్నానని వైసీపీ వాళ్లు బాధపడుతున్నారు కదా. మరి.. నన్ను ఏదైనా అనొచ్చా. నేను అనకూడదా..?. శివశివాని స్కూళ్లో పేపర్లెత్తుకొచ్చిన వాడికి మర్యాద ఎలా తెలుస్తుంది.' అంటూ పవన్ వ్యాఖ్యానించారు.

అర్చకులను వేలం వేయడం రాజ్యాంగ విరుద్ధం.. దేశంలో దోపిడీ జరుగుతుంటే రాళ్లు, నదులు, అడవులు ఏడుస్తున్నాయి కాని పిరికితనంతో ఈ మనిషి మాత్రం అరవడు అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. పథకాల పేరుతో జగన్‌ అడ్డగోలుగా అబద్ధాలు చెప్పారని, అమ్మఒడి అందరికీ ఇస్తామని రకరకాల కారణాలతో పథకాలు తొలగించారని ఆగ్రహించారు. మద్యపాన నిషేధం విధిస్తామని రూ.1.35 లక్షల కోట్ల మద్యం అమ్మారని పవన్ ఆరోపించారు. జగన్‌ మోహన్ రెడ్డి హయాంలో 219 ఆలయాలపై దుర్ఘటనలు జరిగాయని, విగ్రహాల ధ్వంసం కేసులో దోషులను ఇప్పటికీ పట్టుకోలేదని గుర్తు చేశారు. అన్నవరంలో పురోహితులను వేలం పెట్టారన్న పవన్..పురోహితులను వేలం పెట్టడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వేలం వేయడానికి రాజ్యాంగపరమైన హక్కు ఉందా..? అని నిలదీశారు. హిందూ ధర్మానికేనా..? ఇతర మతాలకు అలాగే చేస్తారా..? అని ప్రశ్నించారు. అన్ని మతాలకు సమదూరంలో ఉండాలని రాజ్యాంగం చెబుతోందన్నారు. వస్తువులు, ప్రసాదాలు, కేశాలపైన వేలం వేయవచ్చు కాని అర్చకులను వేలం వేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఈ విషయాన్ని జనసేన తరఫున కోర్టులో ఛాలెంజ్‌ చేస్తామన్నారు.

మహిళా వాలంటీర్‌ ఇబ్బందుల వల్లే జనవాణి కార్యక్రమం చేపట్టా. వైఎస్‌ఆర్‌ హయాంలో ఉన్నతాధికారులు వైఎస్‌ ఏది చెబితే అదే చేశారు. ఏం నేరాలు చేయిస్తున్నారో వాలంటీర్లకు తెలియట్లేదు. ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించడం ప్రైవసీ చట్టం కింద నేరం. వాలంటీర్లకు తెలియకుండా వారిచేతే తప్పు చేయిస్తున్నారు. వాలంటీర్‌ వ్యవస్థకు ఎవరు హెడ్‌గా ఉన్నారో చెప్పాలి..?, మీరు జవాబు చెప్పకపోతే మిమ్మల్ని జవాబుదారీ చేస్తాం. ప్రజలను ఎల్లవేళలా అందరినీ మోసం చేయలేరు. రోజుకు మీకు వచ్చే రూ.164.33 కోసం భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు.- పవన్ కల్యాణ్, జనసేన అధినేత

Last Updated :Jul 15, 2023, 6:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.