ETV Bharat / state

జిల్లాలో తగ్గిన వర్షాలు.. ఊపిరి పీల్చుకుంటున్న అన్నదాత

author img

By

Published : Jul 30, 2020, 4:58 PM IST

west godavari district
మొలకెత్తుతున్న ఆశలు..!

పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడి.. వరినాట్లు నీటమునిగాయి. కానీ, మళ్లీ వర్షాభావం తగ్గిటంతో రైతులలో ఆశలు మొలకెత్తుతున్నాయి. ముంపు నీటిని డ్రెయిన్లతో బయటకు పంపుతున్నారు. ఖరీఫ్‌ సాగుకు రైతన్న ఉపక్రమిస్తున్నారు.

జిల్లాలో వర్షాలు వెలసినందున రైతులు నూతన ఉత్తేజంతో పొలంలో అడుపెడుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల నాట్లు మునిగిపోయినా.. నిరాశ పడకుండా నీటి తొడి ఖరీఫా సాగు చేస్తున్నారు.

కోలమూరులో చేలో కొత్తగా చల్లిన విత్తనాలు

నాలుగైదు రోజుల కిందటి వరకు జిల్లాలో కురిసిన అధిక వర్షాలతో వేలాది ఎకరాల్లోని వరిచేలు ముంపుబారిన పడ్డాయి. డెల్టాలో పలుచోట్ల నారుమళ్లు దెబ్బతినడంతో అన్నదాత కుదేలయ్యాడు. గత నాలుగైదు రోజుల నుంచి పొడి వాతావరణం నెలకొనడంతో ముంపు నీటిని బయటకు పంపించే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రధానంగా 21 మేజర్‌ డ్రెయిన్లలో మురుగునీటి ప్రవాహం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. దీంతో 59 మీడియం, 579 మైనర్‌ డ్రెయిన్లలోని అధికనీరు బయటకు లాగుతోంది. ఇదే రకమైన పొడి వాతావరణం మరో నాలుగైదు రోజుల పాటు కొనసాగితే ముంపుబెడద నుంచి అన్ని ప్రాంతాలు గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ పనులు తిరిగి ప్రారంభించేందుకు అన్నదాత సన్నద్ధమవుతున్నాడు.

చేలల్లో తిరిగి చల్లుతున్న విత్తనాలు

జిల్లాలో 5.55 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడతాయని అంచనా వేశారు. అధిక వర్షాలకు 3,775 ఎకరాల్లోని వరి నారుమళ్లు ముంపుబారిన పడ్డాయని అధికారులు ప్రాథమిక నివేదికలో తేల్చారు. ఆ నారుమళ్లు సుమారు 75,500 ఎకరాల్లో నాట్లు వేసుకునేందుకు సరిపోతాయి. దాదాపు 15 రోజుల నుంచి ముంపునీటిలోనే అవి ఉండిపోవడంతో అత్యధికచోట్ల కుళ్లిపోయాయని రైతులు వాపోతున్నారు. నీరు తగ్గుతున్నచోట్ల నారుమళ్లకు జరిగిన నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో ఒక అంచనాకొస్తున్నారు. ఖరీఫ్‌ పంట సాగు కాలం ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయింది. ఈ దశలో ఏమాత్రం ఆలస్యం చేసినా రెండో పంట సకాలంలో పూర్తి కాదనే పరిస్థితి కనిపిస్తోంది. వర్షపునీరు తగ్గుతున్న ప్రాంతాల్లో రైతులు చదును చేసిన చేలల్లో తిరిగి విత్తనాలు చల్లుతున్నారు. నాణ్యమైన విత్తనాలు ఎక్కడ దొరికితే అక్కడకు వెళ్లి రైతులు కొనుగోలు చేస్తున్నారు.

పాందువ్వలో ముంపుబారిన పడిన వరి నారుమడి

వేలిముద్ర వేసి.. నగదు చెల్లించిన రైతుకే విత్తనాలు

ప్రభుత్వం ప్రకటించిన రాయితీ విత్తనాలు పొందాలంటే ఈ దఫా కొత్త విధానం అమల్లోకి వచ్చింది. పంట దెబ్బతిన్న సాగుదారుడు తన దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికెళ్లి ఆ వివరాలు అందించి వేలిముద్ర వేయాలి. అతను సాగు చేసే విస్తీర్ణం ఆధారంగా విత్తనాల ధరలో రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని డిజిటల్‌ అసిస్టెంట్‌ ద్వారా ఏపీ సీడ్స్‌కు చలానా తీసి పంపించాలి. ఆ తర్వాతే రైతుకు ప్రభుత్వం ద్వారా విత్తనాలు సరఫరా అవుతాయి. చాలాచోట్ల ఈ ప్రక్రియ బాగా ఆలస్యమవుతున్నట్లు రైతులు వాపోతున్నారు. ప్రధానంగా ఎంటీయూ 1121 (శ్రీధృతి) రకం విత్తనాలు అందుతున్నాయి. ఇది రబీ రకం కావడంతో పలువురు రైతులు ఎంటీయూ 7029 (స్వర్ణ) విత్తనాలు సరఫరా చేయాలని కోరుతున్నారు. కౌలు రైతుల్లో ఎక్కువ మంది మార్కెట్‌లో దొరుకుతున్న విత్తనాలతోనే మరోసారి నారుమళ్లు పోసుకుంటున్నారు. డెల్టాలో ముంపునీటి బెడద తగ్గుతున్న ప్రాంతాల్లో నారు లభ్యత ఫర్వాలేదనే ప్రాంతాల్లో నాట్లు వేసేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. అదే సమయంలో రెండు రోజుల నుంచి వరినాట్లు అక్కడక్కడా మొదలవుతున్నాయి.

ఇదీ చదవండి ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే 'మోనిటర్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.