ఈ 'బ్యాంకాక్ పిల్ల' చెప్పే కబుర్లను విజయనగరం యాసలో వినేద్దామా..!

author img

By

Published : Feb 5, 2023, 11:17 AM IST

Sravani Samanthapudi

Sravani Samanthapudi: ‘అల్ల.. అక్కడ కనిపించేది మా ఇల్లు’ అంటూ అద్భుతమైన బ్యాంకాక్‌ విశేషాలని ఆకట్టుకొనేలా విజయనగరం యాసలో చెప్పే ఈ తెలుగమ్మాయి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. రెండు జడలతో, అడుగడుగునా చక్కని మాట విరుపులతో మాయచేసే ‘బ్యాంకాక్‌ పిల్ల’ శ్రావణి సామంత పూడి విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి మరి.

Sravani Samanthapudi: ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలన్నదే ఆమె తత్వం. అదే ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టింది. ‘బ్యాంకాక్‌ పిల్ల’ అనే యూట్యూబ్​ ఛానెల్‌ ప్రారంభించి సంవత్సరం పూర్తి కాకముందే.. లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే, ఈ విజయం ఒక్కరోజుది కాదు.. ఎన్నో ఏళ్ల కష్టముంది. ఆమె పుట్టి పెరిగిందంతా విజయనగరంలో. వాళ్ల నాన్న శ్రీనివాసరాజు, అమ్మ పార్వతి. ఆమెకు బీటెక్‌ చివరి సంవత్సరంలో పెళ్లయ్యింది. ఆమె భర్త పేరు నాగేంద్రవర్మ.. అతను ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేసేవారు. ఆమె చదుపు పూర్తైన తర్వాత.. హైదరాబాద్‌లో వాళ్ల ఆయన దగ్గరకు వెళ్లి పోయారు.

అప్పటివరకూ ఆడుతూ, పాడుతూ గడిపేసిన ఆమెకు.. ఒక్కసారిగా కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. ఈ సమయంలో ఈటీవీ ‘స్టార్‌ మహిళ’ ఆడిషన్స్‌కి వెళ్లి విజయం సాధించారు. తర్వాత వీరికి కుతూరు జన్మించింది. ఆ పాప పుట్టిన కొద్ది రోజులకే.. ఆమె భర్తకు థాయ్​లాండ్​లో పని చేసే అవకాశం రావటంతో అక్కడికి వెళ్లారు.

మొదట వ్యూస్​ పెరగలేదు : ఆమె థాయ్‌లాండ్‌కి డిపెండెంట్‌ వీసా మీద వెళ్లడటంతో.. ఆమె అక్కడ ఉద్యోగం చేయటానికి వీలు కాలేదు. రోజు మొత్తంలో చాలా ఖాళీ సమయం దొరికేది. ఈ సమయంలో పిల్లలతో గడిపే ప్రతి సందర్భాన్నీ వీడియోలు తీయటం ప్రారంబించారు. ఆమెకు వీడియోలు ఎడిటింగ్​ చేయటమంటే మహా ఇష్టం.. ఆ ఆసక్తే ఆమెను యూట్యూబ్‌ ఛానెల్‌ వైపు మళ్లించింది. ప్రారంభంలో ఆమె పాప వీడియోలూ, తర్వాత ఫ్యామిలీ వ్లాగ్స్‌.. అంటూ వరుసగా నాలుగు ఛానెళ్లను ప్రారంభించారు. అయితే, ఇవన్నీ ఏదో సంపాదిద్దామని కాదు.. నేనేం చేయగలనో చూద్దామని మాత్రమే ప్రారంభించనని ఆమె అంటున్నారు. కానీ సబ్‌స్క్రైబర్లూ, వ్యూస్‌ పెరగలేదని.. ఆమె కష్టం చూసిన స్నేహితులు బ్యాంకాక్‌లో ఉంటున్నావు.. కొత్తగా ప్రయత్నించమనటంతో ఆమెను ఆలోచనలో పడేసిందంటున్నారు. ఈలోపు ఆమెకు బాబు ఇషాన్‌ పుట్టాడు.

ఒక్క వీడియోతోనే పెరిగిన వ్యూస్​ : ఆమె అనుభవాలూ, ఆమెకు ఆ దేశంలో కళ్లకు కనిపించిన చిత్ర విచిత్ర అనుభూతులూ, విదేశంలో భారతీయుల జీవనశైలి.. అన్నింటినీ వీడియోల్లో చూపించాలనుకున్నారు. అందుకోసం 2022 ఆగస్టులో ‘బ్యాంకాక్‌ పిల్ల’ పేరుతో ఛానెల్‌ని ప్రారంభించారు. ఆమె ఉంటున్న ప్రదేశాన్ని గుర్తుపెట్టుకోవాలని.. తెలుగమ్మాయినని అర్థమవ్వాలనే రెండు అంశాలు ఆలోచించి ఈ పేరు నిర్ణయించామని ఆమె తెలిపారు. వీడియోల నాణ్యతకోసం ఆమె భర్తతో చాలా పరికరాలనే కొనిపించారు. ప్రస్తుతం ఐఫోన్‌తోనే వీడియోలు తీస్తున్నారు. ఎడిటింగ్‌ దగ్గర్నుంచీ ప్రతిది ఆమె చేసుకుంటారు. టుక్‌ టుక్‌ (ఆటో)ల గురించి చేసిన షార్ట్‌ వీడియో వన్‌ మిలియన్‌కి చేరుకోవడంతో ఆమెకు ప్రచారం లభించింది. అప్పటివరకూ పదివేలమంది మాత్రమే ఉన్న సబ్‌ స్క్రైబర్ల సంఖ్య, ముప్పై, ఆపై లక్షకు చేరుకుంది. అలా పెరుగుతూ ఏడాది తిరగకుండానే ఎనిమిది లక్షలయ్యింది.

ఆమె వీడియోలతోనే ఫేక్​ ఛానళ్లు : సామాజిక మాధ్యమాల్లోకి అడుగు పెట్టామంటేనే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాలని ఆమె అంటున్నారు. ముందే అవన్నీ ఆలోచించుకుని నెగెటివ్‌ కామెంట్లను మనసుకి తీసుకోనని తెలిపారు. ఇంట్లో అమ్మాయిలా ఉన్నావని పొగిడేవాళ్లెంత మంది ఉంటారో వంకలు పెట్టేవాళ్లూ అంతేమంది ఉంటారని.. ఎక్కువమంది ఆమె యాస, భాషని బాగుందని చెబుతుంటే తెలుగమ్మాయిగా ఎంతో గర్వంగా అనిపించేదాని సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. ఇబ్బందుల్లో పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. గత కొంత కాలం క్రితం ఆమె వీడియోలతోనే ఫేక్​ ఛానల్​ ప్రారంభించారు. మరికొంత ఆమె పేరుతో ఖాతా తెరిచి మరి డబ్బులు అడగటం వంటివి ఆమెను బాధించాయని అంటున్నారు. కానీ, ఏ పని చేసినా మనమీద మనం నమ్మకంతో ముందడుగేస్తే.. కాస్త ఆలస్యమయినా అనుకున్నది సాధించొచ్చని ఆమె వివరించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.