ETV Bharat / state

త్వరగా పీహెచ్​సీ భవనాలు నిర్మించండి సారూ.. అనారోగ్యంతో బాధపడుతున్నాం..

author img

By

Published : Apr 1, 2023, 8:59 AM IST

Updated : Apr 1, 2023, 10:34 AM IST

Construct PHC Buildings In Vizianagaram District: నాడు - నేడులో భాగంగా.. విజయనగరం జిల్లాలో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కొత్త భవనాలు, మరమ్మతుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాదిలోగా పూర్తికావాల్సిన పనులు రెండేళ్లు దాటినా సాగుతూనే ఉన్నాయి. కారణాలేవైనా పనుల్లో జాప్యం వల్ల రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కనీస వసతులు లేక వైద్యసిబ్బందికీ అగచాట్లు తప్పడం లేదు.

సీహెచ్​సీ భవనాలు నిర్మించండి
సీహెచ్​సీ భవనాలు నిర్మించండి

త్వరగా పీహెచ్​సీ భవనాలు నిర్మించండి సారూ.. అనారోగ్యంతో బాధపడుతున్నాం..

Construct PHC Buildings In Vizianagaram District : నాడు - నేడు పథకం కింద విజయనగరం జిల్లాలో 42 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. 2020లో 16 కోట్ల రూపాయలతో పనులు మొదలు పెట్టారు. శృంగవరపుకోట నియోజకవర్గంలో అత్యధికంగా 8.63 కోట్లతో చేప్టటిన 5 పీహెచ్‌సీల్లో ఏ ఒక్కటీ ఇప్పటికీ పూర్తి కాలేదు. 2020 ఆగస్టులోనే స్థలాలు అప్పగించినా కొవిడ్ ప్రభావంతో కొన్నిరోజులు, ఇసుక కొరత వల్ల మరికొన్నాళ్లు, బిల్లులు మంజూరు కాక ఇంకొన్నాళ్లు పనులు నిలిచాయి.

ఆపై ఒప్పంద గడువు తీరడం, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వంటి కారణాలతో గుత్తేదారులు చేతులెత్తేశారు. ఆ తర్వాత కొత్త వారికి పనులు అప్పగించినా సకాలంలో బిల్లులు రాక పనులు నెమ్మదించాయి. ఇంతవరకు కొత్తవలసలో ఆసుపత్రి నిర్మాణ పనులు మొదలేకాలేదు.
పాత భవనాల్లోనే వైద్యసేవలు : జామి మండలం అలమండలో పీహెచ్‌సీ భవనం నిర్మాణానికి 2020 సెప్టెంబరులో శంకుస్థాపన జరిగినా పాత గుత్తేదారు విరమించుకోవడంతో కొత్త వారికి అప్పగించారు. ఇటీవల శ్లాబ్‌ పని పూర్తయింది. ఇప్పటికీ పాత భవనాల్లోనే వైద్యసేవలు కొనసాగుతున్నాయి. జామిలో పీహెచ్‌సీ భవనం నిర్మాణానికి 2021 జనవరిలో శంకుస్థాపన చేయగా దాదాపు పూర్తికావచ్చింది. ఇక్కడా పాత భవనంలోనే వైద్యం కొనసాగించడంపై రోగులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పునాది స్థాయిలోనే పనులు ఆపేసిన గుత్తేదారు : లక్కవరపుకోట పీహెచ్‌సీ కొత్త భవనం నిర్మాణానికి 2020 సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేయగా శ్లాబ్ పూర్తయింది. కొత్తవలస మండలం వియ్యంపేటలో పునాది స్థాయిలోనే పనులు ఆపేసి పాత గుత్తేదారు తప్పుకున్నారు. మళ్లీ టెండర్‌ పిలిచి కొత్తవారికి అప్పగించగా ఇటీవలే శ్లాబ్ పనులు పూర్తయ్యాయి. బిల్లులు రాలేదని పనులు ఆపేశారు.

పాత భవనం పునఃనిర్మాణం : స్థానిక బాలుర వసతి గృహంలో ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. కొత్తవలస పీహెచ్‌సీ కొత్త భవనం నిర్మాణం అగమ్యగోచరంగా మారింది. దీనికి అందుబాటులో ప్రభుత్వ స్థలాలు లేకపోవడంతో పాత భవనం ఉన్నచోటనే పునః నిర్మించాలని నిర్ణయించారు. పాత భవనాల కూల్చివేతకు నాడు-నేడులో నిధులు లేవని రోడ్లు-భవనాల శాఖ అధికారులు తేల్చిచెప్పారు.

హాలులో ఉద్యోగుల విధులు : పంచాయతీ నిధుల నుంచి 5లక్షల రూపాయలు కేటాయించారు. భవనాల తొలగింపులో తీవ్ర జాప్యం అనంతరం ఎట్టకేలకు గత నెల 10న శంకుస్థాపన చేసినా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. ప్రస్తుతం స్థానిక ఎన్జీవో భవనంలో అరకొర వసతుల మధ్యే పీహెచ్‌సీని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒకే హాలు ఉండటంతో అక్కడే ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. అందులోనే మరో పక్కన హోమియో సేవలు అందిస్తున్నారు.

నూతన భవనాలను పూర్తి చేయండి : ప్రసవాలు, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలకు ఎస్​.కోట సామాజిక ఆసుపత్రికి పంపాల్సి వస్తోంది. గ్రామీణ పేదల ఇబ్బందుల దృష్ట్యా ఆసుపత్రుల నూతన భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడం వల్ల పీహెచ్‌సీ భవనాల పనులు నెమ్మదించాయని, రోడ్లు-భవనాల శాఖ అధికారులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా పూర్తి చేస్తామంటున్నారు.

పీహెచ్‌సీల నిర్మాణం, మరమ్మతుల్లో జాప్యం రోగుల ఇబ్బందులను రెట్టింపు చేసింది. వీలైనంత తొందరగా భవనాలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 1, 2023, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.