ETV Bharat / state

పులివెందులను గెలిచి అధినేతకు అంకితమిస్తాం.. ప్రమాణస్వీకారం అనంతరం టీడీపీ ఎమ్మెల్సీలు

author img

By

Published : Mar 31, 2023, 7:32 PM IST

Updated : Mar 31, 2023, 7:44 PM IST

MLCs met Chandrababu : నూతనంగా ఎన్నికైన నలుగురు టీడీపీ ఎమ్మెల్సీలు శాసన మండలి సభ్యులుగా ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పంచుమర్తి అనురాధ, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలుగా కె. శ్రీకాంత్, రాంగోపాల్ రెడ్డి, చిరంజీవిరావు ప్రమాణం చేశారు. అంతకు ముందు వారంతా తమ అధినేత చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు

MLCs met Chandrababu : తెలుగుదేశం ఎమ్మెల్సీలు పార్టీ అధినేత చంద్రబాబుని ఆయన నివాసంలో కలిశారు. వేపాడ చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి, పంచుమర్తి అనురాధ ఆయనను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రజా సమస్యలపై గట్టి పోరాటాలు చేసి... మంచి ప్రజా ప్రతినిధులుగా పేరు తెచ్చుకోవాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అధినేత చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమం నిర్వహణపై క్లస్టర్ ఇంచార్జ్ లు, నియోజకవర్గ ఇంచార్జ్ లతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి ఇదేం ఖర్మ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయాలని.., దీనికి అనుగుణంగా ప్రణాళికతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఇదేం ఖర్మ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రజలను చైతన్య వంతులను చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత... వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎంత తీవ్రంగా ఉందో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టమైందని తెలిపారు. 108 నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేశారని కార్యకర్తలు, నేతలను అభినందించారు. ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలను ఎదిరించడంలో పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కి పోరాటాలు చేశారని ప్రశంసించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నిర్వహణలో ముందున్న ఆయా నియోజవకర్గాల నేతలను అభినందించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి కొంత విరామం ఇచ్చామని.. త్వరితగతిన అన్ని చోట్లా ప్రారంభించాలని సూచించారు. ఏప్రిల్ మొదటి వారంలో మూడు జోనల్ సమావేశాలు పూర్తి చేసి.., తాను కూడా ఇదేం ఖర్మ కార్యక్రమంలో పలు జిల్లాల్లో పాల్గొంటానని చంద్రబాబు నేతలకు తెలిపారు.

ప్రమాణ స్వీకారం.. చంద్రబాబు నాయుడును కలవడానికి ముందు.. నలుగురు టీడీపీ ఎమ్మెల్సీలు శాసన మండలి సభ్యులుగా ప్రమాణం చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గా పంచుమర్తి అనురాధ, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీలుగా కె. శ్రీకాంత్, రాంగోపాల్ రెడ్డి, చిరంజీవిరావు ప్రమాణం చేశారు. వారి చేత శాసన మండలి అధ్యక్షుడు మోషేన్ రాజు ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో ఎన్టీఆర్ విగ్రహానికి నలుగురు ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. వీరిని టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, అశోక్ బాబు, నేతలు, కార్యకర్తలు సన్మానించారు. నలుగురు ఎమ్మెల్సీలను అభినందించేందుకు వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు భారీగా తరలి వచ్చారు.

అమరావతే రాజధాని... వైనాట్ 175 అని సీఎం చేస్తున్న వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయిని టీడీపీ ఎమ్మెల్సీలు ఆక్షేపించారు. వచ్చే ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ సీటు సైతం గెలిచి చంద్రబాబుకు అంకితమిస్తామని వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 108 నియోజకవర్గాల పరిధిలో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిందని.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తే టీడీపీ విజయానికి కారమైందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. టీడీపీతోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందనే టీడీపీకి ఓటు వేసి ఎమ్మెల్సీలను గెలిపించారని అభిప్రాయపడ్డారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా అమరావతే రాజధాని అని ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు.

2024లో టీడీపీ జైత్ర యాత్ర ఈ ఎన్నికల నుంచే ప్రారంభమైందన్నారు. రాయలసీమ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అధికార పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. రాయలసీమ ప్రాంతంలో అభివృద్ధి జరగకుండా టీడీపీ అడ్డుకుంటున్నదని అనేక విధాలుగా రెచ్చగొట్టాలని చూసినా ప్రజలు నమ్మలేదని తెలిపారు. రాయలసీమ ప్రాంతానికి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ధ్వజమెత్తారు.

2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పులివెందులలో అదనంగా ఒక్క ఎకరాకి కూడా నీరు ఇవ్వలేదు. పులివెందులలో హార్టికల్చర్, డ్రిప్ ఇరిగేషన్ ఎక్కువగా ఉంటుంది.. కానీ, నాలుగు సంవత్సరాల నుంచి సంబంధిత పరికరాలు అందించడం లేదు.. పులివెందుల రైతాంగాన్ని జగన్ మోహన్ రెడ్డి నట్టేట ముంచాడు. 2024లో తెలుగుదేశం అధికారంలోకి రాగానే రైతాంగ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. - భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ

ఇవీ చదవండి :

Last Updated :Mar 31, 2023, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.