Union Minister Amit Shah Dried up CM Jagan Anarchies: జగన్ నాలుగు సంవత్సరాల పాలనలో అన్నీ అవినీతి, కుంభకోణాలేనని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. జగన్ పాలనలో విశాఖ.. అరాచకశక్తులకు అడ్డాగా మారిందంటూ దుయ్యబట్టారు. భూదందాలకు, అక్రమాలకు కల్తీ మందులకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మూడోస్థానంలో ఉందన్న అమిత్ షా.. ఏపీ మూడో స్థానంలో ఉన్నందుకు జగన్ సిగ్గుపడాలని విశాఖ సభలో విమర్శించారు. కేంద్రంలో మరోసారి మోదీ సర్కారు రావడం ఖాయమని అమిత్‌షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో 20 లోక్‌సభ స్థానాలలో ఎన్డీయేను గెలిపించాలని అభ్యర్థించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తొమ్మిదేళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో.. విశాఖ రైల్వే మైదానంలో నిర్వహించిన.. 'మహాజన్ సంపర్క్ అభియాన్' సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లలో అనేక రంగాల్లో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించిందని వివరించారు. ఈ ప్రసంగంలో రాష్ట్రంలో జగన్ పాలన వైఫల్యాలను కూడా తీవ్రస్థాయిలో ఎండగట్టారు. నాలుగు సంవత్సరాల జగన్ పాలన అవినీతి, కుంభ కోణాలమయమైందని ఆరోపించారు. విశాఖలో వైసీపీ నాయకులు భూ దందాలు, అక్రమ మైనింగ్, నకిలీ మందుల వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు.
యూపీఏ ప్రభుత్వం పదేళ్లలో 12 లక్షల కోట్ల రూపాయల అవినీతి, కుంభకోణాలకు పాల్పడిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కారు నాలుగేళ్లలో.. అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో విశాఖ అరాచక శక్తులకు అడ్డాగా మారిపోయిందని దుయ్యబట్టారు. భూ కుంభకోణాలు, ఇసుక దందాలు, నకిలీ మందుల వ్యాపారాలను.. అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా చేస్తున్నారన్నారు.
కేంద్రమిచ్చిన వాటికి జగన్ ఫోటోలా..: రైతు సంక్షేమ ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకునే జగన్ పాలనలో.. రైతు ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో నిలిచిందని దుయ్యబట్టారు. దీనికి జగన్ సిగ్గుపడాలని.. దేశంలోని 11 కోట్ల రైతులకు ఏటా 6 వేల రూపాయలను కేంద్రం ఇస్తోందని అన్నారు. ఇదే డబ్బును రైతు భరోసా పేరిట రాష్ట్రంలో జగన్ పంచుతున్నారని విమర్శించారు. కరోనా విపత్తు సమయం నుంచి.. దేశంలోని 70 కోట్ల మంది పేదలకు ప్రతి నెలా 5 కిలోల ఉచిత బియ్యాన్ని కేంద్రం అందిస్తోందని పేర్కొన్నారు. జగన్ ఆ బియ్యంపైన కూడా తన ఫోటో వేసుకుని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
యూపీఏ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి 2009-14 మధ్య 78 వేల కోట్ల రూపాయలు ఇచ్చింది. మోదీ హయాంలో దీనిని 2.30 లక్షల కోట్ల రూపాయలకు పెంచినట్లు వెల్లడించారు. ఈ లెక్కన ఈ రూ.5 లక్షల కోట్లు రాష్ట్రానికి మోదీ కేటాయించారని అన్నారు. మరి ఆ డబ్బంతా ఎక్కడికెళ్లిందని.. ఏపీలో అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు. ఆ నగదును జగన్ అవినీతి క్యాడర్ స్వాహా చేసిందని ఆరోపించారు.
ఏపీకి సికింద్రాబాద్-విశాఖ, సికింద్రాబాద్-తిరుపతి మధ్య రెండు వందేభారత్ రైళ్లను కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు 450 కోట్ల రూపాయలను కేటాయించినట్లు పేర్కొన్నారు. కడప విమానాశ్రయం పునఃనిర్మాణం, కర్నూలు కొత్త విమానాశ్రయంతోపాటు, భోగాపురం విమానాశ్రయానికీ అన్ని అనుమతులూ మంజూరు చేశామని వెల్లడించారు. విశాఖ, అనంతపురంలో బహుళ వినియోగ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాకినాడలో బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సింహాద్రి అప్పన్న, కనకమహాలక్ష్మికి ప్రణామం చేస్తూ అమిత్ షా ప్రసంగాన్ని ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు, తెన్నేటి విశ్వనాథం, విజయనగర రాజు పీవీజీ రాజును స్మరించారు.