ETV Bharat / state

పోలీసు వలయంలో విశాఖ... తెదేపా నేతల అరెస్టులు... గృహనిర్బంధాలు

author img

By

Published : Oct 28, 2022, 12:41 PM IST

Updated : Oct 28, 2022, 7:52 PM IST

TDP
రుషికొండ అక్రమాలపై తెదేపా నిరసన

TDP Porubata: ఉత్తరాంధ్ర సమస్యలపై తెలుగుదేశం తలపెట్టిన పోరుబాట ఉద్రిక్తతలకు దారితీసింది. విశాఖ రుషికొండ అక్రమాలపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. కీలక నేతలు బయటకు రాకుండా.. గృహ నిర్భంధం చేశారు. విశాఖను పోలీసుల వలయంగా మార్చేశారు. రుషికొండ పరిసర ప్రాంతాలన్నీ పోలీసులతో ముట్టడించారు. పర్యాటకులు సైతం రాకుండా పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించారు.

TDP Porubata: విశాఖలో తెలుగుదేశం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు ఉక్కుపాదంతో అణగదొక్కారు. ఎక్కడికక్కడ పోలీసులను మోహరించి నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు . రుషికొండ పరిసరాల్లోకి ఏ ఒక్కరినీ అనుమంతించలేదు, ఉత్తరాంధ్ర సమస్యలపై తెలుగుదేశం పోరుబాటలో భాగంగా..రుషికొండకు ఆ పార్టీ నేతలు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. తెలుగుదేశం నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకున్నారు. విశాఖలోని తెదేపా కార్యాలయంతోపాటు ఆపార్టీ నేతల ఇళ్ల వద్ద నిఘా పెంచారు. నేతలు బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ రామారావు, తెదేపా నేత పల్లా శ్రీనివాస్ ను హౌస్ అరెస్ట్ చేశారు. తెలుగుదేశం నాయకుడు బండారు అప్పలనాయుడును పోలీసులు స్టేషన్ కు తరలించారు. మేనత్త ఆస్పత్రిలో ఉందని చెప్పినా వినకుండా తీసుకెళ్లారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు అనితను పోలీసులు అరెస్టు చేశారు.

రుషికొండ అక్రమాలపై తెదేపా నిరసన

విశాఖలోకి వచ్చే అన్ని రహదారుల్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. భీమిలి నుంచి విశాఖకు వచ్చేవారిని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా తెదేపా నేతలు విశాఖ తరలిరాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. విజయనగరం జిల్లా రాజాంలో మాజీ మంత్రి కళ వెంకటరావును గృహ నిర్బంధం చేశారు. ఉదయం 5గంటల నుంచే రాజాంలో అయన నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. కళా వెంకట్రావు ఇంటి వద్దకు చేరుకున్న తెదేపా నాయకులు... పోలీసుల తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. విశాఖ వస్తున్న తెదేపా నేత కూన రవికుమార్‌ను భీమిలిలో అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. సొంత పనులుపై వెళ్తున్న కార్యకర్తలను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. సాలూరులో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంద్యారాణిని పోలీసులు నిర్బంధించారు.

విశాఖలోని తెలుగుదేశం కార్యాలయం వద్ద సాయంత్రం మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ కార్యాలయం నుంచి రుషికొండకు ర్యాలీగా వెళ్లేందుకు నేతలు బయలుదేరగా పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వెలగపూడి, ఎమ్మెల్సీ రామారావు, పల్లా శ్రీనివాస్‌, ఇతర నేతలను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, తెలుగుదేశం నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

తీవ్రంగా ఖండించిన తెదేపా నేతలు: ఉత్తరాంధ్ర సమస్యలపై తెలుగుదేశం తలపెట్టిన పోరుబాట కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎవరు ఎంత అడ్డుకున్నా 'సేవ్ ఉత్తరాంధ్ర' నినాదం ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు. రుషికొండ విధ్వంసం, దసపల్లా భూముల దోపిడీలు, ఆస్తుల ఆక్రమణ, గంజాయి సాగు-అమ్మకాలు, అక్రమ మైనింగ్ పై... వైకాపా దారుణాలను ప్రజల ముందు ఉంచి తీరుతామని ఆయన అన్నారు. ఉత్తరాంధ్రలో వైకాపా మార్క్ దోపిడీ, అసలైన ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో కనీస అభివృద్ది చేసినా... సినిమా హాల్ కి వెళ్లి ఒక మహిళా నేతను అరెస్ట్ చెయ్యాల్సిన దుస్థితి ప్యాలెస్ పిల్లికి వచ్చేది కాదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అండ్ కో ఉత్తరాంధ్రను అడ్డంగా దోచుకుంటున్న వ్యవహారాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే తెదేపా పోరుబాట కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. నిబంధనలకు విరుద్దంగా రుషికొండపై సీఎం జగన్ ప్యాలస్‌ కట్టుకుంటున్నారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.

ఇవీ చదవండి:

Last Updated :Oct 28, 2022, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.