ETV Bharat / state

'తప్పంతా దర్యాప్తు అధికారులదే.. విచారణలో బాధ్యత నిర్వర్తించలేదు'

author img

By

Published : Apr 12, 2023, 12:31 PM IST

Vakapalli rape case Judgment: సంచలనం సృష్టించిన ఉమ్మడి విశాఖ జిల్లా వాకపల్లి గ్రామ గిరిజన మహిళలపై గ్రేహౌండ్స్‌ పోలీసుల అత్యాచార కేసులో దర్యాప్తు అధికారుల(ఐవో) వైఫల్యాన్ని విశాఖ కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. వారి తీరువల్లే ఈ కేసును కొట్టేసి, నిందితుల్ని నిర్దోషులుగా ప్రకటించాల్సి వస్తోందని తెలిపింది.

Vakapalli rape case Judgment
Vakapalli rape case Judgment

Vakapalli rape case Judgment: వాకపల్లి గ్రామ గిరిజన మహిళలపై గ్రేహౌండ్స్‌ పోలీసుల అత్యాచార కేసులో చట్టనిబంధనల ప్రకారం అనుసరించాల్సిన విధివిధానాలను దర్యాప్తు అధికారులు (ఐవో) ఇద్దరూ పాటించలేదని విశాఖ కోర్టు తూర్పారపట్టింది. ఐవోలు సక్రమంగా దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను తమ ముందు ఉంచితే ఈ కేసు బాధిత మహిళలకు అనుకూలంగా ముగిసి ఉండేదేమోనని.. విశాఖలోని ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. ఐవోలుగా వ్యవహరించిన బొత్స ఆనందరావు, ఎం.శివానందరెడ్డిల తీరును తప్పుపట్టింది. దర్యాప్తు నిర్వహణలో వారు తప్పుచేశారని మండిపడింది.. నిందితులైన పోలీసులను బాధిత మహిళలు గుర్తించేందుకు టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పెరడ్‌(టీఐపీ) నిర్వహించలేదంది. ఆ రోజు వాకపల్లి గ్రామానికి వెళ్లిన పోలీసులు ఎవరనేది నిర్ధారించేందుకు సంబంధిత రిజిస్ట్రర్లను ఐవోలు సేకరించలేకపోయారని.. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులకు పటుత్వ పరీక్షలు ఐవోలు నిర్వహించలేదని కోర్టు తెలిపింది.

ప్రత్యేక పీపీ అభ్యర్థన మేరకు కోర్టు అనుమతితో 2018లో పటుత్వ పరీక్షలు నిర్వహించారని గుర్తు చేసింది. ఐవో ఆనందరావు కన్నుముసిన నేపథ్యంలో ఆయనపై చర్యలకు సిఫారసు చేయడం లేదని, మరో ఐవో శివానందరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలోని అపెక్స్‌ కమిటీకి సిఫారసు చేస్తు తీర్పు ఇచ్చింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న 13మంది పోలీసులను నిర్దోషులుగా ప్రకటించింది. బాధిత గిరిజన మహిళలు 9మంది ప్రభుత్వం నుంచి పరిహారం పొందేదుకు సొమ్మును నిర్ణయించాలని విశాఖపట్నం జిల్లా న్యాయసేవాధికార సంస్థను కోర్టు ఆదేశించింది. విశాఖలోని 11వ అదనపు జిల్లా కోర్టు/ఎస్సీ,ఎస్టీ అత్యాచార(నిరోధక) కేసుల ప్రత్యేక కోర్టు న్యాయాధికారి ఎల్‌ శ్రీధర్‌ ఈనెల 6న ఈ మేరకు ఇచ్చిన తీర్పు పూర్తి ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చింది.

దర్యాప్తులో లోపాలు ఇవే.. విశాఖ ఉమ్మడి జిల్లాలోని జి మాడుగుల మండలం గిరిజన ప్రాంతంలోని నుర్మతి పంచాయతీ పరిధిలోని వాకపల్లి గ్రామంలో 2007 ఆగస్టు 20న ఉదయం నక్సలైట్ల ఏరివేతలో భాగంగా గ్రేహౌండ్‌ పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. తమ గ్రామానికి వచ్చిన గ్రేహౌండ్‌ పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారని 11మంది ఆదివాసీ మహిళలు ఫిర్యాదు చేసారు. ఈ వ్యవహారంపై 21మంది పోలీసులపై కేసు నమోదు అయ్యింది. 8మందికి హైకోర్టు, సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మిగిలిన 13 మందిపై విశాఖ కోర్టు తుది విచారణ జరిపి తీర్పు ఇచ్చింది. దర్యాప్తు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేల్చిచెప్పింది. అత్యాచార ఆరోపణ ఘటన 20 ఆగస్టు 2007 చోటు చేసుకుంది. విశాఖ గ్రామీణ అదనపు ఎస్పీ బి ఆనందరావు మొదటి ఐవోగా 2007 ఆగస్టు 20 నుంచి అక్టోబర్‌ 1 వరకు వ్యవహరించారు.

2007 అక్టోబర్‌ 1 నుంచి సీఐడీ ఎస్పీ శివానందరెడ్డి తిరిగి దర్యాప్తు చేపట్టారు. 20 ఆగస్టున దర్యాప్తు అధికారిగా నియమితులైన బి ఆనందరావు వెంటనే బాధ్యతులు స్వీకరించారుకాని.. కేసు విషయంలో తక్షణం స్పందించలేదు. బాధిత మహిళలను విచారించడంలో 18 రోజులు జాప్యం చేశారు.. దర్యాప్తు అధికారిగా ఆనందరావు మాత్రం సెప్టెంబర్‌ 1 వరకు గ్రామంలో అడుగుపెట్టలేదు. మరోవైపు పోలీసులు.. నిందితులను బాధిత మహిళలు గుర్తించేందుకు ఐవో ఆనందరావు.. టెస్ట్‌ ఐడెంటిఫికేషన్‌ పెరడ్‌ నిర్వహించలేదు. టెస్ట్‌ నిర్వహించాల్సిన బాధ్యత ఐవోపైనే ఉంటుంది. ఆ సమయంలో వాకపల్లి వెళ్లిన పోలీసులు ఎవరనేది తేల్చేందుకు సంబంధిత రిజిస్ట్రర్లను సేకరించే ప్రయత్నం చేయలేదు. అత్యాచారం ఆరోపణల కేసులో నిందితులకు పటుత్వ పరీక్ష చేయించడం తప్పనిసరి. ఐవో ఆ పరీక్ష చేయించలేదు. ప్రత్యేక పీపీ అభ్యర్థనతో కోర్టు అనుమతితో 2018 డిసెంబర్‌ 5న ఆ పరీక్ష నిర్వహించారు.

అన్యాయానికి గురయ్యామనే భావనను 15ఏళ్లుగా మోస్తూ.. రెండో దర్యాప్తు అధికారి ఎం శివానందరెడ్డి సైతం టీఐపీ నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఆయన కోర్టులో సాక్ష్యం ఇస్తూ.. జనరల్‌ డైరీ, ఒరిజినల్‌ డ్యూటీ రిజిస్ట్రర్, లాగ్‌ పుస్తకాన్ని సేకరించలేదని ఒప్పుకున్నారు.. 21మందిపై పెట్టిన కేసులో 8మందిపై కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తే.. దర్యాప్తులో తీవ్ర లోపం ఉన్నట్లు స్పష్టమవుతోంది. టీఐపీ నిర్వహించినట్లుతే కోర్టులో సాక్ష్యం చేప్పే సందర్భంలో నిందితులను బాధిత మహిళలు గుర్తించేందుకు అవకాశం ఉండేది. దర్యాప్తు అధికారి నిజాయతీగా ప్రయత్నం చేసినట్లయితే.. ఆరోజు కూంబింగ్‌లో పాల్గొనడానికి వెళ్లిన పోలీసులు ఎవరనేది రుజువు చేయడానికి ఆధారాలు సేకరించి ఉండేవారు. ఐవోలు ఆనందరావు, శివానందరెడ్డి విధి నిర్వహణలో అశ్రద్ధ చేశారు.. ఒకవేళ పోలీసులు ఆరోజు వాకపల్లి వెళ్లారని వివరాలు సమర్పించినప్పటికీ.. కేసు నిరూపణకు అవి సరిపడవు. ఎందుకంటే ఎవరు అత్యాచారానికి పాల్పడ్డారనేది బాధిత మహిళలు గుర్తించాల్సిన అవసరం ఉంది.

న్యాయస్థానంలో విచారణ సందర్భంగా ఈ కేసులో బాధిత మహిళలు అత్యాచారానికి పాల్పడిందెవరనేది గుర్తించలేకపోయారు. టీఐపీ నిర్వహిస్తే అత్యాచారానికి పాల్పడిన వారిని గుర్తిస్తామని దర్యాప్తు సందర్భంగా మహిళలు చెప్పారు. అయినా ఐవోలు టీఐపీ నిర్వహించలేదు. ఐవోల చర్యల కారణంగా నిందితులు నేరానికి పాల్పడ్డారని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైంది. గిరిజన మహిళలు తాము అన్యాయానికి గురయ్యామనే భావనను 15 ఏళ్లుగా మోస్తూ వచ్చారు..

ఎంక్వైరీ కమిషన్‌గా.. ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్​గా విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ వాదనలు వినిపించారు. కేసు నిరూపణ కోసం ఆయన శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశారని కోర్టు పేర్కొంది. అయితే అయనకు పోలీసు అధికారుల నుంచి తగినంత సహకారం అందలేదని తెలిపింది. వాకపల్లి ఘటనపై వాస్తవాలు తేల్చేందుకు అప్పటి ప్రభుత్వం గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డిని ఎంక్వైరీ కమిషన్‌గా నియమించింది. ఆయన 2009 సెప్టెంబరు 6, 7 తేదీల్లో బాధిత మహిళలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆదివాసి ఐక్య పోరాట సమితి తదితరులతో విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. 2007 ఆగస్టు 20న ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో పోలీసులు ఆఘాయిత్యానికి పాల్పడ్డారని 11 మంది బాధిత మహిళలు తెలిపారు. పోలీసులు వచ్చిన సమయంలో తమ గ్రామంలో పురుషులెవరు లేరన్నారు. పోలీసులు దుష్ప్రవర్తనతో కొంతమందిని ఇళ్లలో, మరికొందరిని పొలాల్లో అత్యాచారం చేశారన్నారు. ఘటనపై ఫిర్యాదు చేశాక వైద్య పరీక్షల నిమిత్తం తమను విశాఖ కేజీహెచ్‌ ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. అనకాపల్లికి తీసుకెళ్లారన్నారు..

చర్యలు తీసుకోవాలి .. బాధిత మహిళలు, పోలీసులు ఒకరిపై మరొకరు విభిన్న దృక్పథాలను వ్యక్తపరుస్తున్నారు. అయినప్పటికీ అత్యాచారం జరిగిందని 11 మంది గిరిజన మహిళలు పదేపదే చెబుతున్న విషయాన్ని విస్మరించడానికి వీల్లేదు. ఈ వ్యవహారంపై దర్యాప్తు ఓ ముగింపునకు రావాలి. గిరిజన మహిళలపట్ల దుష్ప్రవర్తన రుజువు అయితే పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందే. ఆదివాసి ఐక్య పోరాట సమితి, తదితరుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని విశ్రాంత ఐఏఎస్‌ ఎస్‌ఆర్‌ శంకరన్‌ వంటి ప్రతిష్ఠ కలిగిన వ్యక్తుల సారధ్యంలో స్వంతత్ర విచారణ కమిషన్‌ ఏర్పాటు చేయాలి. జిల్లా కలెక్టర్, ఎస్పీ వాకపల్లిని సందర్శించడంలో విఫలమైన ఘటనపై విచారణ చేయాలి. తగిన చర్యలు తీసుకోవాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.