ETV Bharat / state

కోర్టు ధిక్కరణ పిటిషన్​ దాఖలు చేయండి.. పిటిషనర్​కు హైకోర్టు సూచన

author img

By

Published : Feb 16, 2023, 9:53 AM IST

HIGH COURT : అధికార యంత్రాంగం కోర్టు తీర్పును అమలు చేయకపోతే.. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేయవచ్చని పిటిషనర్​కు హైకోర్టు సూచించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. పిటిషనర్​కు చెందిన స్థలం నుంచి రెవెన్యూ, పోలీసు అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారన్న పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

HIGH COURT ADVISED TO PETITIONER
HIGH COURT ADVISED TO PETITIONER

HIGH COURT ADVISED TO PETITIONER : యథాస్థితి పాటించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. పిటిషనర్​కు చెందిన స్థలం నుంచి రెవెన్యూ, పోలీసు అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని విశాఖపట్నానికి చెందిన కాట్రగడ్డ లలితేష్ కుమార్ తరఫున న్యాయవాది వీవీ సతీష్ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ జరపాలని వారు కోరారు. అధికార యంత్రాంగం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. పిటిషనర్​కు ఆందోళనకర పరిస్థితులు కల్పిస్తోందన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేసుకోవాలని సూచించింది. విచారణ జరిపి బాధ్యులైన అధికారులను జైలుకు పంపుతామని హెచ్చరించింది.

చట్టబద్ధంగా తనకు దఖలు పడిన విశాఖపట్నంలోని మర్రిపాలెం సర్వే నెంబరు 81/1, 81/3లో 17,135 చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని రద్దు చేసే నిమిత్తం 2020 ఏప్రిల్ 23వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 115ను కొట్టివేయాలని కోరుతూ వ్యాపారవేత్త కాట్రగడ్డ లలితేష్​కుమార్​ అదే ఏప్రిల్​ నెలలో హైకోర్టులో వ్యాజ్యం వేశారు. లోతైన విచారణ జరిపిన న్యాయస్థానం.. జీవో 115ని రద్దు చేస్తూ 2022 డిసెంబర్ 22న తీర్పు ఇచ్చింది. గతంలోనూ ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేపట్టిందని.. న్యాయస్థానం తప్పుపట్టడంతో చర్యలను ఉపసంహరించుకుందని గుర్తు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. రెవెన్యూ అర్బన్, ల్యాండ్ సీలింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి, భూపరిపాలన చీఫ్ కమిషనర్, విశాఖ అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రత్యేక అధికారి, విశాఖపట్నం తహశీల్దార్.. ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు.

ఈ నెల 14న అప్పీలుపై వాదనలు జరిగాయి. విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం.. భూమి విషయంలో 14వ తేదీన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటినే కొనసాగించాలని అధికారులకు, లలితేష్ కుమార్​కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. 14వ తేదీన కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ.. 15వ తేదీన ఉదయం బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని పిటిషనర్ న్యాయవాది వీవీ సతీష్ ధర్మాసనానికి తెలిపారు. పిటిషనర్​కు చెందిన స్థలంలో బేకరీ నిర్వహిస్తున్నారన్నారు. నర్సరీ, సోలార్ విద్యుత్ యూనిట్ ఉందన్నారు. ఓ సంస్థకు చెందిన కార్లు నిలుపుకొని ఉంటే వాటిని ఖాళీ చేయిస్తున్నారన్నారు. పిటిషనర్ స్వాధీనంలో స్థలం ఉందనేందుకు సాక్ష్యాధారాలను కోర్టు ముందు ఉంచామన్నారు. అత్యవసరం విచారణ సాధ్యం కాదని చెప్పిన ధర్మాసనం.. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేసుకోవాలని సూచించింది. ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యుల్ని జైలుకు పంపుతామని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.