ETV Bharat / state

వాటిపై డీఈవో సంతకాలు లేకపోతే జాబితా నుంచి తొలగించండి.. కేంద్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం

author img

By

Published : Feb 16, 2023, 8:36 AM IST

HIGH COURT ORDERS CEC
HIGH COURT ORDERS CEC

HIGH COURT ORDERS TO CEC : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని హైకోర్టు పేర్కొంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ దాఖలైన రెండు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఓటు హక్కు కోసం వచ్చిన దరఖాస్తులకు జత చేసిన సర్వీసు సంబంధ ధ్రువపత్రాలపై.. జిల్లా విద్యాశాఖాధికారుల సంతకాలున్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించింది.

HIGH COURT ORDERS TO CEC : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం వచ్చిన దరఖాస్తులకు జత చేసిన సర్వీసు సంబంధ ధ్రువపత్రాలపై జిల్లా విద్యాశాఖ అధికారుల సంతకాలు ఉన్నాయో లేదో పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారులను హైకోర్టు ఆదేశించింది. జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) సంతకాలు లేని వాటిని తిరస్కరించాలని తేల్చి చెప్పింది. అధికారి సంతకాలు లేని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ సీహెచ్ మానవేంద్రనాథ్​రాయ్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణ మార్చి 1కి వాయిదా వేశారు. ఆ రోజు విచారణలో వివరాలను కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేశారు.

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆంధ్రప్రదేశ్​ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్, స్టేట్ టీచర్స్ యూనియన్ ఏపీ ప్రధాన కార్యదర్శి తిమ్మన్న హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి, న్యాయవాది చలసాని వెంకట్ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.

అర్హతలను పరిశీలించకుండానే ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చారన్నారు. సర్వీసు సర్టిఫికేట్లను డీఈవోలు ధ్రువీకరించకపోయినా ఓటరుగా పరిగణనలోకి తీసుకుంటున్నారని కోర్టుకు తెలిపారు. పిటిషనర్లు అభ్యంతరం తెలపడంతో ఇప్పటికే 788 ఓట్లు తొలగించారన్నారు. ఓటు కోసం వచ్చిన దరఖాస్తులన్నింటిని తమ పరిశీలనకు ఇస్తే వాటిలో అనర్హుల వివరాలను బయటపెడతామని న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

సర్వీస్​ సర్టిఫికేట్లను బహిర్గతం చేయడం గోప్యత హక్కును హరించడమే అని.. కేంద్ర ఎన్నికల సంఘం తరపున సీనియర్ న్యాయవాది అవినాష్ శాయ్ వాదనలు వినిపించారు. పిటిషనర్లకు వివరాలు సమర్పించడం సాధ్యపడదన్నారు. ఇరు వైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. డీఈవో ధ్రువీకరించని ధ్రువపత్రాలను పరిశీలించి వాటిని ఓటరు జాబితా నుంచి తొలగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.