ETV Bharat / state

రాజ్యాంగం అందరికీ అర్థమయ్యేలా.. రావిశాస్త్రి రచనలు: జస్టిస్‌ ఎన్వీ రమణ

author img

By

Published : Jul 31, 2022, 8:26 PM IST

JUSTICE NV RAMANA
JUSTICE NV RAMANA

JUSTICE NV RAMANA: రావిశాస్త్రి.. తన సాహిత్యంలో న్యాయవ్యవస్థపై విపులంగా చర్చించారని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. విశాఖలోని అంకోసా హాల్​లో రావిశాస్త్రి శతజయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని.. నివాళులర్పించారు. ఈ సందర్భంగా రావిశాస్త్రి శతజయంతి ప్రత్యేక సంచిక విడుదల చేశారు. న్యాయవ్యవస్థ తీరుపై.. రావిశాస్త్రి చేసిన రచనల గురించి వివరించారు.

Raavisastri: రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావి శాస్త్రి) తన సాహిత్యంలో న్యాయవ్యవస్థపై చర్చించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. విశాఖలోని అంకోసా హాల్​లో జరిగిన రావిశాస్త్రి జయంతి వేడుకలకు జస్టిస్​ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రావిశాస్త్రి సృష్టించిన పాత్రలు శాసనసభ, చట్టాలపై మాట్లాడాయని ఆయన పేర్కొన్నారు. 'నిజం' అనే నాటకంలో పార్లమెంట్ గురించి రావిశాస్త్రి చర్చించారని తెలిపారు. మనిషి ఎంత ఘనుడో రావిశాస్త్రి తన సాహిత్యంలో చెప్పారని తెలియజేశారన్నారు. రావిశాస్త్రి ఎప్పుడూ తన ఫీజు గురించి ఆలోచించేవారు కాదని.. ఆయనకు ఫీజు కింద కొందరు కూరగాయలు కూడా ఇచ్చేవారని గుర్తు చేశారు. సాహిత్యాన్ని అభిమానించే వ్యక్తిగా ఇక్కడికి వచ్చినట్లు సీజేఐ తెలిపారు. మాండలీకాలతోనే తెలుగుభాష అభివృద్ధని.. విద్యార్థులకు తెలుగుభాష గొప్పతనం గురించి వివరించాలన్నారు. రాజ్యాంగంపై రావిశాస్త్రి ఎన్నో రచనలు చేశారని.. ఆయన చేసిన రచనలను ఆంగ్లంలో తర్జుమా చేయాలన్నారు.

నా పదవి విరమణ తర్వాత.. రావి శాస్త్రి, శ్రీ శ్రీ వారి సాహిత్య కార్యక్రమాలు చేస్తా

న్యాయవ్యవస్థపై రావిశాస్త్రి చక్కని కవితలు చెప్పారు. తన రచనల్లో ప్రజలు, వారి కష్టాలను వివరించారు. వారానికి ఒకసారి వచ్చే 'రత్తాలు-రాంబాబు' కోసం ఎదురుచూసే వాళ్లం. విశ్వవిద్యాలయం.. సామాజిక ప్రయోగశాల. వర్సిటీ పాఠాల వల్లే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కోగలిగాం. ఆరు సారాకథలు చదివితే న్యాయవ్యవస్థను అర్థం చేసుకోవచ్చు. ఆరు సారాకథల పుస్తకాలను అనేకమంది మిత్రులకు ఇచ్చా. రావిశాస్త్రి తన కథల్లో పార్లమెంట్, శాసనసభపై చక్కగా చెప్పారు. రాజ్యాంగం అందరికీ అర్థమయ్యేలా తన రచనల్లో రావిశాస్త్రి చెప్పారు. వ్యవస్థలపై నమ్మకం పోతే ఏమవుతుందో రచనల్లో తెలిపారు. సరిగాలేని, అమలుకాని చట్టాల గురించి చెప్పారు. -జస్టిస్​ ఎన్వీ రమణ, సీజేఐ

రావిశాస్త్రి రచనలను ఆంగ్లంలోకి అనువదించాలనే కోరిక ఉంది. ఎవరైనా ముందుకు వస్తే నేను ఆ పని చేయాలని అనుకుంటున్నాను. విశాఖ జిల్లా.. తెలుగు జాతికి గొప్ప కవులను అందించింది. విశాఖపై ఉన్న ప్రేమను యారాడకొండ పై రచన చేసి రావిశాస్త్రి ఆ ప్రేమను చాటుకున్నారు. నా పదవి విరమణ తరవాత రావి శాస్త్రి, శ్రీ శ్రీ వారి సాహిత్య కార్యక్రమాలు చేస్తాను. భాష లేనిదే బ్రతుకు లేదు.. కనుక తెలుగు భాషను కాపాడండి. తెలుగులో మాట్లాడండి. పిల్లలకు తెలుగు పుస్తకాలు ఇచ్చి చదివించండి. మాండలికాలను కాపాడుకుంటేనే తెలుగును రక్షించుకున్నట్లు. -జస్టిస్​ ఎన్వీ రమణ, సీజేఐ

రావిశాస్త్రి శతజయంతి వేడుకలకు హాజరైన సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణకు విశాఖ రసజ్ఞ వేదిక ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రావిశాస్త్రి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన ఆయన.. రావిశాస్త్రి శతజయంతి ప్రత్యేక సంచిక విడుదల చేశారు. జస్టిస్​ ఎన్వీ రమణను రావిశాస్త్రి కుటుంబ సభ్యులు సత్కరించగా.. వేడుకల్లో పాల్గొన్న ప్రసిద్ధ రచయిత్రి వోల్గాను జస్టిస్ ఎన్‌.వి.రమణ సత్కరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.