ETV Bharat / state

ఉచితమే కదా అని ఫోన్​లో యాప్స్ డౌన్​లోడ్ చేస్తున్నారా... తస్మాత్ జాగ్రత్త..!

author img

By

Published : Jan 3, 2021, 8:48 PM IST

ఫోనేమో చేతిలో పట్టేంత....అందులోని యాప్‌లు మాత్రం ప్రపంచాన్ని చుట్టేంత!..ఆ యాప్‌ల మాటునే జీవితాలను తలకిందులు చేసే పన్నాగాలున్నాయి. విలువైన సమాచారాన్ని కబళించే మోసపూరిత వ్యవస్థలున్నాయి. వినోదం మాటునే మరెవరివో ప్రయోజనాలు దాగున్నాయి. యాప్‌ డౌన్‌లోడ్‌ చేయగానే వివిధ అనుమతులు ఇచ్చేందుకు క్షణం కూడా ఆలోచించని తీరుతో ముప్పు తప్పదని బాధితుల అనుభవాలు చాటుతున్నాయి. రుణ యాప్‌ల కల్లోలం వేళ... అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరంపై ప్రత్యేక కథనం.

cyber-apps-installation-alertness
తస్మాత్ జాగ్రత్త

ఫోన్‌లో యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకొనే విషయంలో అప్రమత్తంగా లేకుంటే... ముప్పు తప్పదని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవసరం, వినోదం ఇలా అనేక కారణాలతో వినియోగించే యాప్‌ల వెనుక డేటా చోరులు సైతం పొంచి ఉన్నారని నిఘా సంస్థలతోపాటు.... బాధితుల అనుభవాలూ వెల్లడిస్తున్నాయి. ఓవైపు ఏటా వేల కోట్ల రూపాయలు సైబర్‌ దోపిడీలకు గురవుతుండగా... మరోవైపు... బ్యాంకింగ్ సహా అనేక రకాల సేవల కోసం ప్రతి ఒక్కరూ పదుల సంఖ్యలో యాప్‌లు వినియోగిస్తున్నారు.

అప్రమత్తత అవసరం

ప్రజల కష్టార్జితానికి సంబంధించిన ప్రతి వివరమూ ఫోన్‌లోనే ఉండటం సర్వసాధారణంగా మారింది. ఫోన్‌లోని యాప్‌ల మధ్యనే మన మొత్తం జీవితం ఇమిడి ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో ఫోన్‌ను బాధ్యతాయుతంగా వినియోగించకుంటే కల్లోలం తప్పదనే దానికి రుణయాప్‌ల బాధితుల అనుభవాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. అవసరం ఉన్నదానికీ... లేనిదానికీ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుంటూ... కోరిన అనుమతులు ఇస్తూ పోవడం ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తును చెప్పే, వయసును మార్చి చూపే లాంటి యాప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు.

ఒక్క 2019 సంవత్సరంలోనే సైబర్ నేరగాళ్లు మన దేశంలో లక్ష కోట్లకు పైగా దోచుకున్నారని అంచనాలున్నాయి. సైబర్ నేరాలను ఛేదించే వ్యవస్థలు కలిగిన పోలీసు స్టేషన్లు మన దేశంలో నామమాత్రమే. ఈ పరిస్థితులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. రెప్పపాటులో జరిగే సైబర్‌ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ముందస్తు అప్రమత్తతే శ్రీరామరక్ష అని నిపుణులు చెబుతున్నారు.

తస్మాత్ జాగ్రత్త

ఇదీ చదవండి: క్యాన్సర్‌ చికిత్స.. కోబాల్ పరీక్ష!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.