ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు

author img

By

Published : Jan 14, 2023, 9:15 AM IST

Updated : Jan 14, 2023, 12:00 PM IST

Bogi Festival
భోగి పండగ

Bogi Festival Celebrations: రాష్ట్రంలో భోగి పండగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెలుగు వారి సంప్రదాయం సంక్రాతి పండగ మొదటి రోజైన భోగి పండగను కన్నుల పండుగ`గా నిర్వహించారు. పాత వస్తువులను భోగి మంటల్లో వేసి అగ్నికి ఆహుతి చేశారు.. కొత్త దుస్తులతో నూతనంగా ముస్తాబవుతున్నారు.

Bogi Festival Celebrations: రాష్ట్రంలో భోగి పండగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి ఇళ్ల ముందు, వీధుల్లో పెద్ద ఎత్తున భోగి మంటలు వెలిగించి.. పాత వస్తువులను అందులో వేశారు. కీడు తొలగిపోవాలని కోరుకున్నారు. మంటల చుట్టూ తిరుగుతూ.. ఆటపాటలతో సందడి చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో.. ప్రజలు భోగి మంటలు వేసి సందడి చేశారు. మంత్రి విడుదల రజిని భోగి మంటలు వేసి వేడుకలు జరుపుకున్నారు. తిరుపతి జిల్లాలోని శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ప్రాంగణంలో.. భోగి సంబరాలను వేడుకగా నిర్వహించారు.

భోగి సంబరాల్లో మాజీ ఉపరాష్ట్రపతి.. నెల్లూరులో వెంకయ్యనాయుడు భోగి సంబరాల్లో పాల్గొన్నారు. స్వగృహం నందు కుటుంబ సభ్యులతో కలిసి తెలుగు వారి ఆచారాలను, సాంప్రదాయాలను ఆలకరించుకుని భోగి మంటను వెలిగించారు. అనంతరం భోగి మంట చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకున్నారు..

విద్యాసంస్థల అధినేత, సినీ నటుడు మంచు మోహన్‌.. కుటుంబసభ్యులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. నెల్లూరులోని ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి యువత సందడి చేశారు. పిల్లలు, పెద్దలు అంతా కలిసి.. సంప్రదాయబద్ధంగా భోగి వేడుకలను జరుపుకున్నారు. భోగి మంటలు వెలిగించి.. ఆటపాటలతో మంటల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పాత వస్తువులను భోగి మంటల్లో వేసి ఆహుతి చేశారు.

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వాడ వాడలా భోగి మంటలు ఎగిశాయి. తెలుగు వారి సంప్రదాయం సంక్రాతి పండగ మొదటి రోజైన భోగి పండగను ప్రాంతంలో కన్నుల పండుగ గా నిర్వహించారు. ప్రతి కూడలిలో భోగి మంటను వేసి మహిళలు చిన్నారులు సందడి చేసారు.

విజయవాడలో సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభంగా జరుగుతున్నాయి. సింగ్ నగర్​లో గుండాది చలపతిరావు కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కాలనీ వాసులు భోగి మంటలు వేశారు. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్యాలు చేశారు. మహిళలు అందమైన రంగవల్లులను అలంకరించారు.

బాపట్ల జిల్లా వ్యాప్తంగా భోగిమంటల కార్యక్రమంలో చిన్నారులు,పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలోని విజయలక్ష్మీపురంలో అపార్ట్ మెంట్ వాసులు భోగిమంటలు వేసి సందడిచేశారు. తెలుగుమహిళ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మానం విజేత ఆధ్వర్యంలో.. భోగి మంటలు వేసి మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేశారు.

శ్రీశైల మహా క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని.. తెల్లవారుజామున ఆలయం ముందు భాగం వద్ద.. సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు ఏర్పాటు చేశారు. దేవస్థానం ఈవో ఎస్ లవన్న, అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు చేసి భోగి మంటలను వెలిగించారు. సాయంత్రం శ్రీ పార్వతీ సమేత మల్లికార్జున స్వామికి రావణ వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు.

కర్నూలు జిల్లాలో బోగి పండుగను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచి మహిళలు ఇళ్ల ముందు బోగి ముగ్గులు వేశారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్​లో డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బోగి మంటలు వేశారు. ప్రజలు చేడును, అహంకారం, దురాశను విడనాడాలని ఆయన పిలుపునిచ్చారు.

కృష్ణా జిల్లా దివిసీమలో మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆవు పిడకలు, పెద్ద పెద్ద కట్టెలతో.. తెల్లవారు జాము నుంచి పెద్ద ఎత్తున భోగి మంటలు వేశారు.

పుణ్యక్షేత్రమైన తిరుమలలో భోగి పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. శ్రీవారి ఆలయ ప్రాంగణంలో.. ఉద్యోగులు, స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున గుమ్ముకూడి భోగి మంటలు వేశారు. గోవిందా గోవిందా స్మరణలు చేస్తూ భోగి సంబరాల్లో పాల్గొన్నారు. కలియుగ దేవుడైన శ్రీనివాసుడిని క్షేత్రంలో భోగి పండగ జరుపుకోవడం చాలా అదృష్టంగా భక్తులు భావిస్తున్నామన్నారు.

కాకినాడ జిల్లా ముమ్మిడివరంలో .. నూతన సంవత్సరంలో సంక్రాంతి పండగ వాతావరణం మొదలైంది. తొలిరోజు వాడ వాడలా.. తెల్లవారుజామునే భోగి మంటల వెలుగులు సందడి చేస్తున్నాయి.. జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం.. యానంలో భోగి మంట వెలిగించే ముందు ప్రత్యేక పూజలు చేసి ఆవు నెయ్యిని భోగి దుంగలపై వేసి వెలిగించారు. పట్టణంలోని ప్రతి కూడలిలోనూ యువకులు భోగి మంటలు వెలిగించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో పల్లెల్లో భోగి పండగ సందడి నెలకొంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు

ఇవీ చదవండి:

Last Updated :Jan 14, 2023, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.