ETV Bharat / state

మాకిలాగే ఇష్టం..! మేము ఇలాగే ఉంటాం..! ఆధునికతకు దూరంగా శ్రీకాకుళంలోని ఓ గ్రామం

author img

By

Published : Dec 12, 2022, 11:23 AM IST

Updated : Dec 16, 2022, 7:20 PM IST

KURMA VILLAGE PEPOLE LIFE STYLE : మనిషి జీవితాన్ని సాంకేతికత సులభతరం చేసింది. సాంకేతికత సాయంతో ఎన్నో కొత్త వస్తువులకు ప్రాణం పోసిన మానవుడు.. వాటి ఆధారంగా తన జీవితాన్ని గతం కంటే సుఖమయం చేసుకున్నాడు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనిషి జీవితమే మారిపోయింది. అయితే స్మార్ట్‌ఫోన్‌ కాదు కదా, ఆధునిక సాంకేతికతతో నడిచే ఏ సౌకర్యాన్ని వినియోగించుకోని ఊరు అది. విద్యుత్‌ ఉండదు, కట్టడాలకు సిమెంటు, ఇనుము వాడరు, చదువులకు ఫీజులు కట్టరు. గ్రామస్థులంతా ప్రకృతి ఒడిలోనే సుఖంగా బతుకుతారు. ఉన్నత చదువులు, పెద్ద ఉద్యోగాలతో సంపన్న జీవితం గడిపినా, జీవిత పరమార్థం ఇది కాదని భావించి, పరమాత్మకు చేరువయ్యే వికాస మార్గంగా.. సనాతన ధార్మిక జీవితం గడుపుతారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మ అనే ఆ గ్రామ ప్రత్యేకతలను మనమూ చూసొద్దాం.

KURMA VILLAGE
KURMA VILLAGE

KURMA VILLAGE : కాలం మారుతున్న కొద్దీ అలవాట్లూ, పద్ధతులూ మారుతూ ఉంటాయి. కాలం మనుషులను అలా ముందుకు తీసుకువెళుతూ ఉంటుంది. అది కాలం లక్షణం. అయితే కాలానికి ఎదురునిలుస్తూ పూర్తిగా పాత పద్ధతులను అనుసరిస్తూ విభిన్న పంథాను అనుసరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మ గ్రామానికి చెందిన ప్రజలు. ఇప్పటికీ ప్రాచీన వైదిక వర్ణాశ్రమ పద్ధతులు పాటిస్తున్న గ్రామంగా కూర్మ గుర్తింపు పొందింది. ప్రాచీన భారతీయ గ్రామీణ ప్రజల పద్ధతులు, గురుకుల జీవన విధానానికి ఈ గ్రామం నిలువుటద్దంలా ఉంది.

ప్రపంచాన్ని సనాతన ధర్మం వైపు మరల్చడమే ధ్యేయంగా కుర్మా గ్రామం: 200 ఏళ్ల నాటి భారతీయ గ్రామీణ జీవన విధానం, సాంప్రదాయాలు, పద్ధతులు, ఆహారపు అలవాట్లు, కట్టు బొట్టు, వృత్తులు, వీటన్నిటిని ఒకే చోట కలపోస్తే కూర్మ గ్రామం. ఈ గ్రామాన్ని 2018 జులై లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకచార్యులైన భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు, వారి శిష్యులు ఏర్పాటు చేశారు.. మొదట్లో కొద్ది మందితో ప్రారంభమైన కూర్మ గ్రామంలో... ప్రస్తుతం 12 కుటుంబాలు, 16 మంది గురుకుల విద్యార్థులు, ఆరుగురు బ్రహ్మచారులుతో కలిపి మొత్తం 56 మంది నివసిస్తున్నారు, బ్రిటిష్ వారి ఏలుబడిలో భారతీయ వర్ణాశ్రమ వ్యవస్థ గాడి తప్పడంతో తిరిగి ప్రపంచాన్ని సనాతన ధర్మం వైపు మరల్చడమే ధ్యేయంగా కుర్మా గ్రామం ప్రజలు సంకల్పించుకొని ఆ దిశగా ప్రచార కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అందరికీ ఆదర్శంగా కూర్మ గ్రామం: ఆధునిక కాలంలో మానవుడు యంత్రంలాగా పనిచేస్తూ తరచూ అనారోగ్యం పాలవుతున్నాడు. పూర్వం మన తాత ముత్తాతలు ప్రకృతితో మిళితమై జీవిస్తూ ఎంతో ఆనందంగా గడిపారు. ప్రకృతితో కలిసి మనిషి జీవితం ఎలా అని భారతీయ సంస్కృతే చాటి చెప్పింది. అలాంటి జీవితానికి కూర్మ గ్రామం నిదర్శనమై నిలుస్తోంది. ప్రకృతిసిద్ధ జీవితంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. కూర్మ గ్రామంలో ఉన్న వారంతా గొప్ప కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే.

అన్నీ వదిలి కూర్మ గ్రామంలో నివసిస్తున్న ఇతర దేశాల ప్రజలు: ఉన్నత చదువులు చదివి లక్షల్లో జీతాలు వచ్చే సంస్థల్లో పని చేసినవారే. కానీ యాంత్రిక జీవితానికి విసుగుచెంది ప్రకృతిలో మమేకమై పరమానందం పొందేందుకు కుటుంబ సమేతంగా అన్ని వదిలి కూర్మ గ్రామంలో నివసిస్తున్నారు. కార్లు, బంగ్లాలు ఉన్నా వాటి నుంచి వచ్చే ఆనందం కంటే మట్టి ఇంటిలో, పూరి గుడిసెలో నివసిస్తున్నప్పుడే చాలా ఆనందంగా ఉందని ఈ గ్రామస్థులు అంటారు. తమ కుటుంబాలను వదిలి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి కూడా పలువురు కూర్మ గ్రామానికి భగవంతుని సేవ కోసం వస్తున్నారు.


"ఫోన్లు, కంప్యూటర్లు, కార్లు తాత్కాలికమైనవి. జీవితంలో ప్రతిక్షణం పరుగెత్తాల్సి వస్తోంది. మనుషులకు డబ్బుపై ధ్యాస పెరిగింది. కూర్చుని తినడానికి కూడా సమయం ఉండడం లేదు. మన తండ్రి, తాతల జీవితాన్ని పరిశీలిస్తే వారు చాలా ఆనందంగా బతికారు. వారి జీవితాన్ని పరిశీలిస్తే మనం ఎలా బతుకుతున్నామో తెలుస్తుంది" నుహారి, రష్యా నుంచి వచ్చిన వ్యక్తి

సరళ జీవనం, ఉన్నత చింతనం కూర్మ గ్రామస్థుల ప్రత్యేక. నిత్యావసరాలైన కూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని నిరూపిస్తూ, ప్రకృతి సేద్యంతోనే వీటిని పొందుతున్నారు. ఈ ఏడాది గ్రామస్థులంతా కలిసి ఉమ్మడిగా 198 బస్తాల ధాన్యాన్ని పండించారు. సరిపడా కూరగాయలను కూడా పండించుకుంటున్నారు. విత్తనం నాటింది మొదలు, కోతల వరకు ఇతరులపై అసలు ఆధారపడరు.

వ్యవసాయంతో సొంతంగా కూరగాయలు: రసాయనాలు లేని వ్యవసాయంతో సొంతంగా నచ్చిన కూరగాయలు పండించుంటారు. పశుపోషణ కూడా చేస్తారు. దంపుడు బియ్యాన్ని వండుకు తింటారు. తమ దుస్తులకు వారే నేత కార్మికులు, ఇళ్ల నిర్మాణానికి వారే మేస్త్రీలు, కూలీలు. ఇసుక, సున్నం, బెల్లం, మినుములు, కరక్కాయలు, మెంతులు మిశ్రమంగా చేసి, గానుగలో ఆడించి గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో ఇళ్లు నిర్మించుకుంటారు. నిర్మాణంలో సిమెంటు, ఇనుమును ఏ మాత్రం వాడరు. గ్రామస్థులు కుంకుడుకాయ రసంతో దుస్తులు ఉతుక్కుంటారు. విద్యుత్‌ను అసలు వాడరు. ఇళ్లలో లైట్లు, ఫ్యాన్లు ఉండవు.

"నేను పలాస నుంచి వచ్చాను. ఈ గ్రామం చూసిన తర్వాత మన పూర్వీకులు ఉన్న దానికి.. మనం ఉన్న దానికి చాలా తేడా ఉంది. ఇప్పటి జీవన విధానానికి, అప్పటి విధానానికి తేడా ఉంది. మళ్లీ పూర్వ జీవన విధానం వస్తే బాగుంటుంది. ఇప్పుడున్న యాంత్రిక జీవనంలో బిజీబిజీగా ఉంటూ టెక్నాలజీని వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్తున్నాం. ఇది చూస్తుంటే మన జీవన సరళి ఈ విధాంగా ఉంటుంది అని భావితరాలకు తెలియజేస్తే ఎంతో బాగుంటుంది"-శేషు కుమార్​, పలాస

దైవానికి హారతితో దినచర్య ప్రారంభం: కూర్మ గ్రామంలో విద్య వర్ణాశ్రమ విధానంలో ఉంటుంది. విద్యార్థులు తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీలో అనర్గళంగా మాట్లాడతారు. ఈ ఆశ్రమంలో తెల్లవారుఝామున 4 గంటల 30 నిమిషాలకు దైవానికి హారతితో దినచర్య ప్రారంభం అవుతుంది. ఉదయం భజన, ప్రసాద స్వీకరణ తర్వాత రోజు వారీ పనులకు వెళతారు. వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం, ధర్మ ప్రచారంలో గ్రామస్థులు మమేకం అవుతారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

కూర్మా గ్రామం గురుకులంలో చదువుకునే విద్యార్థులకు ఉచిత చదువుతోపాటు, సకల శాస్త్రాలను, వైదిక శాస్త్ర ఆధారిత విద్యా విధానం, ఆత్మ నిగ్రహం క్రమశిక్షణ, సత్ప్రవర్తన, శాస్త్ర అధ్యయనం తో పాటు వ్యవసాయం, చేతివృత్తులు, తల్లిదండ్రులకు గురువుకు సేవ చేయడం లాంటివి కూడా నేర్పుతారు.

"మమల్ని రిసీవ్​ చేసుకున్న విధానం చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ప్రతి అంశం గురించి విఫులంగా విశదీకరించారు. ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేయడం, వాళ్లకి కావాల్సిన వంటి పంటలను పండించుకోవడం వల్ల డబ్బుపై ఆధారపడకుండా సొంతంగా పండించుకుని వాడుకోవడం నేర్చుకున్నారు"-తేజస్వి, పలాస

కూర్మ గ్రామాన్ని సందర్శిస్తున్న నిత్యం వందల మంది ప్రజలు: కూర్మ గ్రామం గురించి తెలుసుకున్న ఎంతోమంది ఇతర ప్రాంత వాసులు.. ఇక్కడకు వచ్చి ప్రజలు పాటిస్తున్న పద్ధతులను తెలుసుకుంటున్నారు. తమ పిల్లలకు కూడా వాటిని నేర్పిస్తున్నారు. ప్రాచీన గ్రామీణ వాతావరణానికి, ఆధ్యాత్మిక చింతన కలగలిసిన కూర్మ గ్రామాన్ని ఇలా ప్రతి నిత్యం వందల మంది సందర్శిస్తున్నారు. విద్యుత్‌ ఉంటే దానితో పాటు సౌకర్యాలు పెరుగుతాయని, అందుకు డబ్బు అవసరం అని, దాని వల్ల జీవితం యాంత్రికంగా మారి మనుషులూ యాంత్రికంగా మారతారని కూర్మ గ్రామస్థులు అంటున్నారు.

"ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో ప్రజలు, యువత కేవలం వాటాప్స్​లు, ల్యాప్​టాప్​లు, ఫోన్​లతోనే కాలాక్షేపం చేస్తున్నారు. ఇక్కడి వచ్చిన తర్వాత మన పూర్వీకులు కూడా ఇలానే ఉంటారా అని అనిపించింది. ప్రస్తుత సమాజంలో ఇలా ఉండటం కొంచెం కష్టమనిపించింది. కానీ ఇక్కడకి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా, ఆనందంగా ఉంది. ఇస్కాన్​ వాళ్లు ప్రజలకు కేవలం టెక్నాలజీ గురించి కాకుండా దేవుడు ఉన్నాడనే నమ్మకం కలిగించాలనుకున్నారు"-చంద్రప్రియ, శ్రీకాకుళం

"ఈ కూర్మ గ్రామం గురించి విన్నాము. ఇక్కడికి కుటుంబంతో వచ్చాం. మన పూర్వీకులు ఎలా ఉన్నారో.. ఇక్కడి ప్రజలు కూడా అలానే ఉన్నారు"-ఉమామహేశ్వరరావు

ప్రపంచం అంతా ఆధునిక జీవన విధానంతో ఉన్నతంగా జీవిస్తూ ఉంటే ప్రకృతి సిద్ధ జీవితంతో కూర్మ గ్రామస్థులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఈ గ్రామ జీవితం.. అన్నింటా భిన్నం

ఇవీ చదవండి:

Last Updated : Dec 16, 2022, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.