ETV Bharat / entertainment

'సుగుణ సుందరి'తో బాలయ్య సందడి.. రవితేజ ట్రైలర్ 'ధమాకా'!

author img

By

Published : Dec 12, 2022, 7:13 AM IST

బాలయ్య హీరోగా నటిస్తున్న 'వీరసింహారెడ్డి' మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఈనెల 15న ఈ సినిమాలోని "సుగుణ సుందరి" అనే పాట విడుదల చేయనున్నారు. మరోవైపు రవితేజ కథానాయకుడిగా నటించిన 'ధమాకా' సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా ఈనెల 15న ట్రైలర్‌ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించారు.

balayya-raviteja-latest-movie-updates
శ్రుతిహాసన్, బాలయ్య, రవితేజ

కథానాయకుడు బాలకృష్ణ మాస్‌ ఎనర్జీని చూపిస్తామంటూ ఊరిస్తోంది 'వీరసింహారెడ్డి' బృందం. బాలయ్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాని గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల జోరు పెంచుతోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈనెల 15న ఈ సినిమాలోని "సుగుణ సుందరి" అనే పాట విడుదల చేయనున్నారు.

ఈ విషయాన్ని చిత్రవర్గాలు ఆదివారం అధికారికంగా ప్రకటించాయి. ఈ మేరకు పాటకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో శ్రుతిహాసన్‌, బాలకృష్ణ స్టైలిష్‌ లుక్‌లో ఆకట్టుకునేలా కనిపించారు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఓ పాట మినహా ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తమన్‌ సంగీతమందిస్తున్నారు. రిషి పంజాబీ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

'ధమాకా'తో వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని త్రినాథరావు నక్కిన తెరకెక్కించారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఈనెల 15న ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ ప్రచార చిత్రంలో రవితేజ సూట్‌ ధరించి.. కళ్లజోడుతో స్టైలిష్‌గా కనిపించారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాకి ప్రసన్న కుమార్‌ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీత దర్శకుడు. కార్తీక్‌ ఘట్టమనేని ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.