ETV Bharat / state

వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కోసం సామాన్య ప్రజలకు ఇక్కట్లు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 10:10 PM IST

Samajika Sadhikara Bus Yatra in Kanigiri: ప్రకాశం జిల్లా కనిగిరిలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రంటూ.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కనిగిరి పట్టణానికి సుమారు 3 కిలో మీటర్ల దూరంలోనే వాహనాలను మళ్లించారు. ఆర్టీసీ బస్సుల్నీ ఆపేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పోలీసుల ఆంక్షలను వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించారు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎలా నడుస్తారని నిలదీశారు. మరోవైపు కనిగిరి-పామూరు బస్టాండ్ కూడలిలో రోడ్డుకు అడ్డంగా సభ ఏర్పాటు చేశారు. పాదచారులు సభాస్థలి కింద నుంచి దూరివెళ్లాల్సి వచ్చింది.

samajika_sadhikara_bus-yatra
samajika_sadhikara_bus-yatra

వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కోసం సామాన్య ప్రజలకు ఇక్కట్లు

Samajika Sadhikara Bus Yatra in Kanigiri : సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వివిధ జిల్లాలో పర్యటిస్తున్నారు. తమ ప్రభుత్వం చేసే సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఎమ్మెల్యేలు, మంత్రుల పర్యటన నేపథ్యంలో చేసే ఏర్పాట్లతో సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై సభలు పెట్టి ట్రాఫిక్​కు అంతరాయం కలిగిస్తున్నారంటూ ప్రజలు విమర్శిస్తున్నారు. అయినప్పటికీ... నాయకులు తమ పని తాము చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. నేతలకు ఇబ్బందులు కలగకుండా... పోలీసులు వారి సభలు సజావుగా సాగేందుకూ బస్సు యాత్రకు రాచబాటలు వేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్పందన లేని సామాజిక సాధికార బస్సు యాత్ర..నిరాశతో వైసీపీ నాయకులు

ప్రకాశం జిల్లా కనిగిరిలో వైసీపీ బస్సు యాత్ర ప్రయాణికుల పాలిట శాపంలా మారింది. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారి అత్యుత్సాహం ప్రదర్శించారు. బస్సు యాత్ర నేపథ్యంలో కనిగిరి పట్టణానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో... బస్సులను ఎక్కడిక్కడే ఆపివేయడంతో ఆయా బస్సుల్లోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వృద్ధులు, వికలాంగులు అటుగా వెళ్లలేమని పోలీసులను ప్రాధేయపడినప్పటికీ.. వారి అభ్యర్థనను పట్టించుకోలేదు. కనిగిరికి మూడు కిలోమీటర్ల దూరంలో బస్సులను నిలిపివేయడంతో.. చిన్న పిల్లల, వృద్ధులు మూడు కిలోమీటర్ల నడవలేక ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బస్సు ముందే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం సామాన్యులను ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వీళ్లు వైసీపీ కార్యకర్తలా ? పారిశుద్ధ్య కార్మికులా!

కనిగిరి పట్టణంలో సామాజిక సాధికారత బస్సు యాత్ర కాస్తా... చిరు వ్యాపారుల పాలిట శాపంగా మారింది. వైసీపీ బస్సు యాత్ర సందర్భంగా చిన్నచిన్న దుకాణాలకు అడ్డంగా పెద్దపెద్ద ఫ్లెక్సీలు, హోర్డింగులను ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆయా దుకాణాలు మూసివేసుకోలేక వారు ఏర్పాటు చేసిన ప్లెక్సీల వెనకవైపే దుకాణాలు తీసి దిగాలుగా కూర్చున్నారు. పట్టణంలో తోపుడుబండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే వ్యాపారస్తులకు రోడ్ల పైకి రాకుండా... అధికారులు ముందుగానే హెచ్చరికలు చేశారు. చేసేదేమీ లేక తోపుడుబండ్ల వ్యాపారులు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు కనిగిరి పామూరు బస్టాండ్ కూడలిలో రోడ్డుకు అడ్డంగా సభను ఏర్పాటు చేయడంతో... అటుగా వెళ్లే పాదచారులు సభాస్థలి కింది నుంచి దూరి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పాట పాడి ఖాళీ కుర్చీలకు జగనన్న గొప్పతనాన్ని వివరించిన మంత్రి

బస్సు యాత్ర కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి స్త్రీలు, పురుషులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా తరలించారు. ఈ సభ కోసం ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలుసుకునేందుకు కొందరు మహిళలు హాజరు తీసుకున్నారు. మరో వైపు సభ ప్రారంభం కాగానే నేతలు చెప్పే వాగ్దానాలను వినలేక.. సభకు వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో వెనుదిరిగారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.