ETV Bharat / state

ఫ్లోరైడ్‌ వ్యథ.. బాధితుల కన్నీటి గాథ.. ఇప్పటికైనా తమ బతుకులు మార్చాలంటూ విన్నపం

author img

By

Published : Mar 8, 2023, 8:40 AM IST

FLUORIDE DISEASE : వారు అందరిలాగా ఆ ఊరు.. ఈ ఊరు తిరగలేరు. ఒకసారి అనారోగ్యం బారినపడితే ఇక జీవితాంతం అంగ వైకల్యంతో అవస్థలు పడాల్సిందే. దశాబ్దాల క్రితమే ఈ సమస్యను గుర్తించినా.. నేటి తరం ఆ భూతానికి బలి కాకూడదని ప్రణాళికలు రచించినా.. ఆచరణ మాత్రం శూన్యం. అధికారుల చిత్త శుద్ది కొరవడి నేటి పిల్లలు కూడా బలి అవుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ భూతంపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

FLUORIDE DISEASE
FLUORIDE DISEASE

ఫ్లోరైడ్‌ వ్యథ.. బాధితుల కన్నీటి గాథ..

FLUORIDE ISSUE: కదలకుండా కాసేపు ఉండాలంటేనే చాలా కష్టంగా భావిస్తుంటాం. అలాంటిది జీవితాంతం మంచానికే పరిమితం కావడం అంటే ..మాటలా.. ఆ బాధ వర్ణనాతీతం. ఫ్లోరైడ్ రక్కసి బారిన పడి కీళ్ల నొప్పులతో, ఇతర సమస్యలతో బాధపడే వారు కొందరైతే.. పూర్తి అంగవైకల్యానికి గురై .. సొంత అవసరాలూ తీర్చుకోలేని దుస్థితి మరికొందరిది. తమకొచ్చిన ఈ కష్టం కనీసం తర్వాతి తరాల వారికైనా రాకుండా చూడాలంటున్నారు ప్రకాశం జిల్లా వాసులు. జిల్లాలోని ఫ్లోరైడ్‌ బాధితుల వెతలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ భూతం ఎంతోమంది జీవితాలను వేధిస్తోంది. 20 మండలాల్లో తాగునీటిలో 1.5 నుంచి 14 PPM వరకు ఫ్లోరైడ్ ఉండడంతో.. ఆయా ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. దశాబ్దాల క్రితమే సమస్యను గుర్తించినా..శాశ్వత పరిష్కారానికి పాలకులు, అధికారులు చర్యలు తీసుకోలేదన్నది ప్రజల వాదన. గత్యంతరం లేకే ఫ్లోరైడ్ నీటినే తాగుతూ ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. పొదిలి మండలం రాజుపాలెంలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు 50 మంది ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు. అంగవైకల్యంతో ఏళ్లతరబడి మంచాలకే పరిమితమై.. కనీసం ఆదరించే వారు లేరంటూ చెమ్మగిల్లిన కళ్లతో చెబుతున్నారు.

"ఈ అన్నం తినమనే వారు లేరు. నన్ను పట్టించుకునే వారు ఎవరూ లేరు. ఎటూ తిరగలేను. కనీసం నాకు సహాయం చేయడానికి కూడా లేరు"-చిన్నయోగమ్మ, ఫ్లోరైడ్ బాధితురాలు, రాజుపాలెం

"తాగితే గుక్కెడు నీళ్లు తాగేది.. లేకపోతే పస్తులు ఉండాల్సిందే. సాయం చేయడానికి ఎవరూ లేరు. ఒక్కోసారి వండుకోవడం చేతకాక అలాగే ఉండాల్సిన పరిస్థితి"-పెద్దయోగమ్మ, ఫ్లోరైడ్ బాధితురాలు, రాజుపాలెం

వెయ్యిమంది జనాభా ఉన్న రాజుపాలెం గ్రామంలో.. 40 ఏళ్ల క్రితమే ఫ్లోరైడ్ 7 PPM ఉందని అధికారులు గుర్తించారు. అప్పటి గవర్నర్ కుముద్ బెన్ జోషి గ్రామాన్ని సందర్శించి.. ఫ్లోరైడ్ బాధితుల దుస్థితిని చూసి చలించిపోయారు. గ్రామానికి తక్షణమే రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగమేఘాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు దర్శి నుంచి సాగర్ జలాలను గ్రామానికి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నారు.

"ఈ ఊరిలో ఫ్లోరైడ్​ సమస్య ఉంది. 7ppm కంటే ఎక్కువుగా ఉండటం వల్ల మనుషులు, పశువులు అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే గతంలో ఈ నీటిని తాగొద్దని అధికారులు చెప్పారు. కానీ సరైన నీటి సప్లై లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వీటినే తాగాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి ఈ ఫ్లోరైడ్​ నుంచి తమకు విముక్తి కలిగించాలని కోరుకుంటున్నాం"-స్థానికులు, రాజుపాలెం

అయితే గ్రామ ప్రవేశ మార్గం వరకే ఆ నీళ్లు వచ్చాయి. ఎగువ ప్రాంత వాసులకు నీళ్లు రాక, కుళాయిలూ ఏర్పాటు చేయక కొందరు ఇప్పటికీ ఫ్లోరైడ్ నీటినే తాగుతున్న దుస్థితి. తాము పాలకుల నిర్లక్ష్యానికి బలయ్యామంటున్న రాజుపాలెం గ్రామస్థులు.. ఇప్పటికైనా గ్రామానికి శుద్ధిజలం సరఫరా చేసి భావితరాలకు మేలు చేయాలని వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.