ETV Bharat / state

గొంతెండుతోంది.. తాగునీటి సమస్యతో అల్లాడుతున్న జనం

author img

By

Published : Mar 5, 2023, 1:39 PM IST

Updated : Mar 5, 2023, 2:29 PM IST

Water Problem in Podili: వేసవి ప్రారంభంలోనే ప్రజల గొంతెండుతోంది. గ్రామాలు, పట్టణాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రకాశం జిల్లా మెట్టప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాలను పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వనరులను పెంచకపోవడం వల్ల తాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

Peoples drinking water problems
ప్రజల తాగునీటి కష్టాలు

ప్రజల తాగునీటి కష్టాలు

Water Problem in Podili: ప్రకాశం జిల్లా పొదిలి నగర పంచాయతీలో ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. నేతపాలెం, ప్రకాశ్‌నగర్, ఇస్లాంపేట, టైలర్స్ కాలనీ, పిచ్చిరెడ్డి తోట, విరాట్‌ నగర్, శ్రీపతి నగర్ ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆయా ప్రాంతాలకు పూర్తిస్థాయిలో పైపులైన్లు లేకపోవడం.. కొన్నిచోట్ల అనధికార కనెక్షన్ల వల్ల దిగువ ప్రాంతాలకు నీరు సరఫరా కావడం లేదు. కుళాయిల్లో నీరు రాకపోవడం వల్ల డబ్బులు చెల్లించి కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"బబుల్ నీళ్లు కొనుక్కుని తాగితే ఒళ్లు నొప్పులతో ఆస్పత్రి పాలవుతున్నాము. దీనివల్ల అధిక ఖర్చుతోపాటు ఆరోగ్యం దెబ్బతింటుందని.. బబుల్ నీళ్లు తాగట్లేదు. అందువల్ల రెండు కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చి తాగునీటిని తీసుకుని వెళ్తున్నాము. ఇక్కడ కూడా నీళ్లు రాకపోతే ఇంకా పైకి వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ నీళ్లు రావటానికి ఒక సమయం అంటూ ఏం లేదు. ఉదయం నీళ్లు వస్తే సాయంత్రం రావట్లేదు. నీళ్ల కోసం పనులు మానుకుని సమయం దొరికినప్పుడల్లా వస్తున్నాము. వేసవి కాలంలో అయితే ఈ సమస్య మరింత ఎక్కువవుతోంది." - మస్తాన్‌వలి, పొదిలి

"తీవ్రమైన నీటి సమస్య ఉండటం వల్ల ఇటు ప్రజలు, అటు రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారు."- శ్రీనివాసులు, పొదిలి

"ఫిల్టర్ నీరు తాగటం వల్ల ఒంటి నొప్పులు వస్తున్నాయి. బోరు నీళ్లలో ఫొరింగ్ ఎక్కువగా ఉంది. అందువల్ల సాగర్ నీళ్లు తీసుకుని వెళ్లేందుకు ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాము. పొదులిలో నీళ్లు లేక ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్తున్నాం. ఉదయం, సాయంత్రం ఇక్కడికి వచ్చి నీళ్లు తీసుకుని వెళ్తున్నాం. - చిరంజీవి రెడ్డి,పొదిలి

పొదిలిలో 4 దశాబ్దాల క్రితం ఎన్​ఏపీ నీటి పథకాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి అవసరాలకు తగ్గట్లు నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు జనాభా రెట్టింపైనా ఆ పథకంపైనే ఆధారపడి తాగునీరు అందిస్తున్నారు. దర్శి నుంచి వారంలో ఐదు రోజులు పట్టణానికి నీటి సరఫరా జరుగుతుంది. వంతులవారీగా వివిధ ప్రాంతాల్లో మూడు రోజులకు ఒకసారి మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ఒక్కో వ్యక్తికి రోజుకు 130 లీటర్ల నీరు అందించాల్సి ఉండగా.. కేవలం 70 లీటర్లు మాత్రమే ఇస్తున్నారు. సొంత బోర్లు లేని వారు ప్రైవేటు ట్యాంకర్ల వద్ద డబ్బులు ఇచ్చి నీరు కొనుగోలు చేసుకుంటున్నారు. కొత్తూరులో నీటి సమస్య మరింత జఠిలంగా మారిందని స్థానికులు వాపోయారు.

"ఎన్ఏపీ వాటర్ కూడా ఇంతకు ముందు డిపార్టుమెంటు వారు ఎగ్జిక్యూట్ చేసేవారు. అదిపోయి ఇప్పుడు ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించారు. వారు పొలిటికల్ కాంట్రాక్టర్లైపోయారు. వారు మెయింట్​నెన్స్ సరిగా చేయటం లేదు. ఎక్కడ లీకేజీ ఏర్పడినా కనీసం నాలుగు రోజులకు కూడా రిపేర్ చేసే పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా నీళ్ల ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. మున్సిపాలిటీ వాళ్లు కూడా వాటర్ తోలటం పూర్తిగా మానేశారు. వాళ్లకు పేమెంట్ లేక నీటి సరఫరాను మానేశారు. అంతకుముందు వార్డుకు పది, పదిహేను ట్రిప్పులు తోలేవారు. ఇప్పుడు ఒక్క ట్రిప్పు కూడా నీటిని తోలట్లేదు."- కాటూరి నారాయణ ప్రసాద్, పొదిలి

"ఇరవై, ముప్పై సంవత్సారాల క్రితం జనాభా చాలా తక్కువగా ఉండేది. అందువల్ల అప్పుడు నీటి ఎద్దడి పెద్దగా లేదు. ఇప్పుడైతే జనాభా ఎక్కువగా పెరిగిపోయింది. పొదిలిలో ఉన్న రెండు చెరువులు కూడా అడుగంటిపోయాయి. దర్శి నుంచి నీటిని తీసుకుని వచ్చి రెండు చెరువులను నింపటం లేక వెనుగొండ ప్రాజెక్టు నుంచి నీటిని కేటాయించటం వల్ల ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. దీనివల్ల పొదిలి భవిష్యత్తు బాగుంటుంది." - మహమ్మద్ బాషా, పొదిలి

జనాభా పెరుగుదలకు అనుగుణంగా నీటి పథకాలను పెంచి.. సక్రమంగా నీటి సరఫరా అయ్యే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Mar 5, 2023, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.