ETV Bharat / state

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు.. విజయం కోసం పోరాటం..

author img

By

Published : Mar 9, 2023, 8:45 AM IST

GRADUATE MLC ELECTIONS IN AP
GRADUATE MLC ELECTIONS IN AP

MLC ELECTIONS IN AP: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం పోరాడుతున్న విపక్ష పార్టీలు బోగస్‌ ఓట్లపైనే దృష్టి సారిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ భారీ ఎత్తున నకిలీ ఓట్లను చేర్పించిందని.. పదో తరగతి కూడా చదవని వారి పేరిట దొంగ ఓట్లు సృష్టించిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఎక్కడికక్కడ ఆధారాలతో ఫిర్యాదు చేస్తూ, ఎన్నికలు సక్రమంగా జరిగేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం పోరాడుతున్న ప్రధాన పార్టీలు

MLC ELECTIONS IN AP : తాయిలాల పంపిణీ, ఉన్నతాధికారులు, వాలంటీర్లను ఎన్నికల ప్రచారంలోకి దింపడం వంటి చర్యలతో ఎమ్మెల్సీ ఎన్నికల స్థాయిని వైఎస్సార్​సీపీ దిగజార్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఈ ఎన్నికల్లో గెలవాలంటే బోగస్‌ ఓట్లను అడ్డుకోవడమే కీలకమని గుర్తించిన టీడీపీ.. క్షేత్రస్థాయిలో వాటిపై దృష్టి సారించింది. మరో 4 రోజుల్లో(మార్చి 13) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బోగస్​ ఓట్ల తొలగింపు సాధ్యం కానందున.. ఓట్లు వేసే వారిని ఎలాగైనా అడ్డుకోవాలని ప్రతిపక్షాలు ఎన్నికల ఏజెంట్లకు, తమ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. టీడీపీ శ్రేణులతో పాటు పార్టీ విద్యార్థి విభాగమైన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు ప్రచారం చేస్తూనే నకిలీ ఓటర్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. బోగస్‌ ఓటున్న వారికి ఫోన్‌ చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే శిక్ష అనుభవిస్తారని చెబుతున్నారు.

ముగ్గురు మధ్యే ప్రధాన పోటీ: ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 22 మంది బరిలో ఉన్నా ప్రధాన పోటీ వైఎస్సార్​సీపీ బలపరుస్తున్న పేరినాటి శ్యాం ప్రసాద్‌రెడ్డి, టీడీపీ మద్దతిచ్చిన కంచర్ల శ్రీకాంత్, బీజేపీ అభ్యర్థి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డిల మధ్యే నెలకొంది. శ్యాంప్రసాద్‌రెడ్డి బరిలో ఉంటారని సంవత్సరం క్రితమే సీఎం జగన్‌ ప్రకటించడంతో ముందు నుంచే ఆయన ప్రచారాన్ని ప్రారంభించారు. వివిధ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న పట్టభద్రులకు బహుమతుల రూపంలో తాయిలాలు అందించారు. వైఎస్సార్​సీపీ నేతలు దొంగ ఓట్లను పెద్ద ఎత్తున చేర్చారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఒకే ఇంటి చిరునామాతో పలు ఓట్లు: తిరుపతిలోని వైఎస్సార్​సీపీ వార్డు కార్యాలయం చిరునామాతో ఏకంగా 50 మంది ఓటర్లను, తిరుపతిలోనే ఇంటి నంబరు 7/18లో యజమానికే తెలియకుండా 20 ఓట్లు నమోదు చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. తిరుపతి యశోద నగర్‌లోని ఓ చిన్న గది చిరునామాతో 11 మందికి ఓట్లు ఉండటం, కొత్తపల్లి పరిధిలోని ఆటో స్టాండులో 61 మందిని ఓటర్లుగా నమోదు చేయడంపై నేతలు మండిపడుతున్నారు. వైఎస్సార్​సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే భూమన పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదుకు తెరలేపారని వర్ల రామయ్య ఆరోపించారు. దొంగ ఓటర్ల నమోదుకు పాల్పడ్డ వైఎస్సార్​సీపీ నాయకులు.. ధ్రువీకరించిన అధికారులపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌ తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు: చిత్తూరు జిల్లా కుప్పం పురపాలక పరిధిలోని తంబిగానిపల్లెలో వాలంటీర్లు వైఎస్సార్​సీపీ అభ్యర్థికి మద్దతుగా కరపత్రాలు పంచుతున్నట్లు గుర్తించి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఈ ఘటనలో నలుగురు వాలంటీర్లకు షోకాజ్‌ నోటీసు ఇచ్చామని పురపాలక కమిషనర్‌ వివరణ ఇచ్చారు. అధికార పార్టీ నేతలు తటస్థ ఓటర్లను గుర్తించి వారికి 2 వేల రూపాయల నుంచి 5 వేల రూపాయల వరకు ఇస్తున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలకు రెండు రోజుల ముందు వాలంటీర్లతో పంపిణీ చేయించేందుకు సిద్ధమవుతున్నారని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.