ETV Bharat / state

చెక్కుల దొంగ దొరికాడు.. అకౌంట్ సెటిల్ చేశారు!

author img

By

Published : Oct 24, 2021, 10:31 AM IST

అతడు.. కొరియర్‌లో పంపే చెక్కులు, ఏటీఎం కార్డులు, చెక్‌బుక్‌లను మాత్రమే దొంగలిస్తాడు. వాటిపై ఫొర్జరీ సంతకాలతో నగదు కాజేస్తాడు.. ఇలా చోరీలకు పాల్పడుతూ ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా.. రూ.50 లక్షల వరకు అపహరించిన వ్యక్తిని శనివారం అరెస్టు చేశారు. అతగాడి చోరీలకు సంబధించి మరిన్ని ఆసక్తి కర విషయాలను పోలీసులు వెల్లండించారు.

devangula satram works in progress in chittor
devangula satram works in progress in chittor

జల్సాలకు అలవాటు పడి కొరియర్​లో పంపే చెక్కులు, ఏటీఎం కార్డులను దొంగిలిస్తూ.. వాటిపై ఫోర్జరీ సంతకాలతో సొమ్ము కాజేస్తున్న ఘరానా దొంగను ప్రకాశం జిల్లా కందుకూర్ పోలీసులు పట్టుకున్నారు. అతను ఏకంగా రూ. 50 లక్షల వరకు అపహరించినట్లు పోలీసులు చెప్పారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు కందుకూర్ సబ్ డివిజన్​ డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.

తిరుపతి పట్టణానికి చెందిన గాలిచేతన్‌ చౌదరి అనే 35 ఏళ్ల యువకుడు జల్సాలకు అలవాటు పడి జూదం, మద్యపానం వంటి వ్యసనాలకు బానిసై భార్య, కుమార్తెను వదిలేసి తిరుగుతున్నాడు. ప్రస్తుతం.. ఒంగోలు గోపాల్‌నగర్‌లోని రెండో వీధిలో ఒంటరిగా ఉంటున్నాడు. గతంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసి ప్రస్తుతం చోరీలతో జల్సాలు చేసుకుంటున్నాడు. డబ్బు కోసం కొరియర్‌ బాయ్‌లను అనుసరించి బ్యాంకు ఏటీఎంలు, చెక్కు బుక్‌లు వంటివి దొంగతనం చేస్తుంటాడు.

సెప్టెంబర్‌ 28వ తేదీన కందుకూరు పట్టణానికి చెందిన రమాదేవి అనే మహిళ.. అనంతసాగరం గ్రామానికి చెందిన వి.వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి రూ.2 లక్షల చెక్కు ఇచ్చింది. రమాదేవి ఖాతా కెనరాబ్యాంకులో ఉండగా.. వి.వెంకటేశ్వర్లు ఖాతా యూనియన్‌ బ్యాంకుకు చెందినది. రమాదేవి నుంచి చెక్కు తీసుకున్న వెంకటేశ్వర్లు అదే రోజు పట్టణంలోని యూనియన్‌ బ్యాంకుకు వెళ్లి చెక్కు జమచేశారు. బ్యాంకు మేనేజరు ఆశిష్‌గుప్తా చెక్కు క్లియరెన్స్‌ కోసం ప్రొఫెషనల్‌ కొరియర్‌ ద్వారా చెక్కును ఒంగోలు పంపారు. ఒంగోలులో ఉంటున్న చేతన్‌ చౌదరి కొరియర్‌ బాయ్‌ని అనుసరిస్తూ వెళ్లి మూడు చెక్కులున్న కవర్‌ను దొంగలించాడు. అందులో ఒకటి వి.వెంకటేశ్వర్లుకు సంబంధించినది.

నిందితుడు చేతన్‌చౌదరికి వలేటివారిపాలెం మండలం బడేవారిపాలేనికి చెందిన ఎ.వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో పరిచయం ఉంది. ఎ.వెంకటేశ్వర్లు అనే పేరుతో ఒంగోలులో నాలుగు బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించాడు. రమాదేవి ఇచ్చిన చెక్కు వి.వెంకటేశ్వర్లు పేరుతో ఉండగా.. అందులో ‘వి’ అక్షరాన్ని మిస్టర్‌ గా దిద్దాడు. ఎ.వెంకటేశ్వర్లుకు మిస్టర్‌ వెంకటేశ్వర్లు పేరుతో రమాదేవి చెక్కు ఇచ్చినట్లుగా చిత్రీకరించి.. ఆ చెక్కును ఒంగోలులోని కెనరా బ్యాంకులో ఎ.వెంకటేశ్వర్లు ఖాతాలో జమ చేసి నగదు డ్రా చేశారు. ఇందుకు సహకరిస్తున్న ఎ.వెంకటేశ్వర్లుకు రూ.10వేలు ఇచ్చి పంపించేశాడు.

28వ తేదీ చెక్కు వేసినా నగదు ఖాతాలో జమ కాకపోవడంతో.. ఈనెల 14వ తేదీ వి.వెంకటేశ్వర్లు పట్టణంలోని యూనియన్‌బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించాడు. దీంతో మేనేజరు చెక్కు స్టేటస్‌ తెలుసుకోగా.. కొన్ని రోజుల క్రితమే నగదు వేరే ఖాతాలో జమ చేసి డ్రా చేసినట్లుగా తేలింది. దీంతో మేనేజరు ఆశిష్‌గుప్తా పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ వి.శ్రీరామ్‌ ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై కె.కె.తిరుపతిరావు దర్యాప్తు ప్రారంభించారు. ఎ.వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ద్వారా చేతన్‌చౌదరిని గుర్తించి శనివారం ఉదయం అరెస్టు చేశారు.

విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయని, నిందితుడు చెన్నై. కోయంబత్తూర్, హైదరాబాద్, ఒంగోలు ప్రాంతాల్లో ఇదే తరహా మోసాలకు పాల్పడి రూ.50 లక్షలు వరకు అపహరించినట్లు డీఎస్పీ వివరించారు. ప్రస్తుతం నిందితుడి నుంచి రూ.40 వేల నగదుతో పాటు 40 చెక్కులు, 7 పాన్‌కార్డులు, 8 చెక్‌బుక్‌లు, 17 ఆధార్‌కార్డులు, 9 ఖాతాబుక్‌లు, 21 ఏటీఎంకార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన సీఐ, ఎస్సై, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

ఇదీ చదవండి: Arrest: పేకాట శిబిరంపై దాడి..11 మంది అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.