ETV Bharat / state

MLA Anil Challenge to Lokesh: నారా లోకేశ్​కు ఎమ్మెల్యే అనిల్​ సవాల్​.. అరగంటలో వస్తానంటూ కామెంట్లు

author img

By

Published : Jul 5, 2023, 2:06 PM IST

MLA Anil Kumar Challenge to Lokesh: ఎమ్మెల్యే అయిన తర్వాత వెయ్యి కోట్లు అక్రమంగా సంపాదించానని లోకేశ్​ ఆరోపించడం అర్ధరహితమని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ ఆరోపణలపై తిరుమలలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని, లోకేశ్​ సిద్ధమా అంటూ సవాల్ చేశారు. వీఆర్సీ సెంటర్ బహిరంగ సభ స్టేజి ఎక్కి నగర అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని లోకేశ్​ పిలవటం హాస్యాస్పదమన్నారు.

MLA Anil Kumar Challenge to Lokesh
MLA Anil Kumar Challenge to Lokesh

అరగంటలో వస్తానంటూ కామెంట్లు
YCP MLA Anil Kumar Challenge to Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​కు వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్​ సవాల్ విసిరారు. అధికారంలో ఉండి తాను వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించానని చెబుతున్న నారా లోకేశ్‌.. సిట్ కాకపోతే సీబీఐ వేసుకోవాలని.. రాజకీయాల్లోకి వచ్చి తాను ఆస్తులు పోగొట్టుకున్నానని.. దీనిపై తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేయమన్నా సిద్ధమని లోకేశ్​కు సవాల్​ విసిరారు. బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో లోకేశ్​పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

రాజకీయాల్లోకి రాకముందు వాళ్ల నాన్న ఇచ్చిన ఆస్తి కంటే ఒక్క పైసా ఎక్కువ ఉన్నా, భగవంతుడు తనని శిక్షిస్తాడని అనిల్​ అన్నారు. లోకేశ్​.. ఎక్కడకి రమ్మన్నా వచ్చి.. ప్రమాణం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఇస్కాన్ సిటీలో పద్దెనిమిదిన్నర ఎకరాలు ఉంటే.. ప్రస్తుతం అమ్మి వేసి మూడు ముక్కలుగా ఎకరా మాత్రమే ఉందని.. ఆరోపణలు చేసేటప్పుడు సిగ్గుండాలని ధ్వజమెత్తారు. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద ఉన్న మూడు ఎకరాలని అమ్మేశానని.. టేక్కేమిట్ట స్థలం కూడా అమ్మి రాజకీయాలు చేశా అని వ్యాఖ్యానించారు.

"నువ్వు చేసిన ఏ ఆరోపణకైనా చర్చకు సిద్ధం. నువ్వు రా అంటే అరగంటలో వస్తా. రెండు గంటల వరకు సమయం ఇస్తా. నువ్వు ఏ టైం చెప్పినా నిమిషం లేటు కాకుండా వస్తా. చర్చకు కావాలన్నా వస్తా.. యుద్ధానికి రమ్మనా వస్తా. నువ్వు 10వేల మందిని తీసుకొచ్చినా.. నేను వందమందితో వస్తా. యుద్ధం ఎలా ఉంటది.. భయం ఎలా ఉంటదో చూపిస్తా. ఇస్కాన్​ సిటీలో నా కుటుంబానికి రాజకీయాల్లోకి వచ్చేముందు 18న్నర ఎకరాలు ఉంది. ఈరోజు మూడుముక్కల ఎకరం ఉంది. మా నాన్న ఇచ్చిన ఆస్తి కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రమాణం చేస్తా"-అనిల్​కుమార్​ యాదవ్​, నెల్లూరు ఎమ్మెల్యే

తన తమ్ముడు అశ్విన్ మొదటి నుంచి ఒక హాస్పిటల్లో షేర్ హోల్డర్‌గా ఉన్నాడని.. గంజాయి తరలించే ముఠాకి టీడీపీ నేతలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని ఆరోపించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించాలని సాక్షాత్తు నెల్లూరు ఇంచార్జ్ తనకు 50 లక్షల రూపాయలు పంపితే వెనక్కి పంపానని.. దీనిపై ఇప్పటి వరకు ఆ పెద్దమనిషి నోరు విప్పి మాట్లాడలేదని మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలు పోతుంటే హైదరాబాదుకు వెళ్లి దాక్కున్న నారాయణ, నేడు నెల్లూరుకు రావడానికి సిగ్గుండాలని విమర్శించారు. ఇలాంటి విలువలు లేని రాజకీయాలు చేసే వ్యక్తి గొప్పవాడని చెప్పటానికి లోకేశ్​కు సిగ్గుండాలని అనిల్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. క్రికెట్ బెట్టింగ్ కేసు ఉన్న వారిని పక్కన పెట్టుకుని తనను నిందించటం సిగ్గుచేటన్నారు. జగన్​ను విమర్శించే స్థాయి లోకేశ్​కు లేదన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.