ETV Bharat / state

Nara lokesh fire on YSRCP: యానాదులకు న్యాయం జరగాలంటే.. సైకో పోవాలి, సైకిల్ రావాలి: నారా లోకేశ్

author img

By

Published : Jul 7, 2023, 9:24 PM IST

Nara lokesh fire on YSRCP: యానాదుల పొట్ట కొడుతూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెంబర్ 217ని టీడీపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రద్దు చేస్తామని ఆ పార్టీ యువనేత నారా లోకేశ్ ప్రకటించారు. జ‌గ‌న్ ఓ డాన్‌గా, స‌ర్కారు మాఫియా అండ‌గా వైసీపీ నేత‌లు చెలాయిస్తున్న గూండాయిజంతో రాష్ట్రంలో భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని నారా లోకేశ్ ఆందోళ‌న వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర 149వ రోజు కోలాహలంగా ప్రారంభమైంది.

Etv Bharat
Etv Bharat

Nara lokesh fire on YSRCP: యానాదుల పొట్ట కొడుతూ జగన్ తీసుకొచ్చిన జీఓ నెంబర్ 217ని టీడీపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రద్దు చేస్తామని ఆ పార్టీ యువనేత నారా లోకేశ్ ప్రకటించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని రాజుపాలెం పీఎస్అర్ కళ్యాణమండపం వద్ద యానాది సామాజికవర్గ ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. యానాదుల చేతిలో ఉన్న చెరువులన్నీ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన జగన్ వారి పొట్ట కొట్టారని ఈ సందర్భంగా లోకేశ్ విమర్శించారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించడమే కాకుండా, సంక్షేమ కార్యక్రమాలకు పెట్టే ఖర్చుని సబ్ ప్లాన్ లెక్కల్లో చూపుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను జగన్ ప్రభుత్వం వెనక్కి లాక్కుందన్నారు. యానాదులకు న్యాయం జరగాలంటే సైకో పోవాలి, సైకిల్ రావాలన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేవలం ఎస్టీల సంక్షేమానికే వినియోగిస్తామని చెప్పారు. గిరిజన గురుకుల పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచి, ఐటీడీఏను బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ లో యానాదులను చేర్చేందుకు కృషి చేస్తామన్నారు.

యానాదులతో నారా లోకేశ్ ముఖాముఖి

వైసీపీ వ్యవహారంతో ఇతర రాష్ట్రాలకు వలస... జ‌గ‌న్ ఓ డాన్‌గా, స‌ర్కారు మాఫియా అండ‌గా వైసీపీ నేత‌లు చెలాయిస్తున్న గూండాయిజంతో రాష్ట్రంలో భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని నారా లోకేశ్ ఆందోళ‌న వ్యక్తం చేశారు. ధ‌ర్మవ‌రం ప‌ద్మశాలి చేనేత వ‌స్త్రవ్యాపారుల‌పై వైసీపీ నేత, ఆల‌య సిల్క్స్ ఎండీ అవినాష్ దాడిని తీవ్రంగా ఖండిస్తూ లోకేశ్ ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. వైసీపీ నాయ‌కులే కాదు ఆ పార్టీకి చెందిన‌ వ్యాపారులు కూడా మాఫియా డాన్‌ల కంటే ఘోరంగా త‌యార‌య్యారని ఆయన మండిపడ్డారు. వైసీపీ నేత అవినాష్ కి చెందిన‌ విజ‌య‌వాడ ఆల‌య సిల్క్స్ కి ల‌క్షల్లో చేనేత‌-ప‌ట్టువ‌స్త్రాలు స‌ర‌ఫ‌రా చేసిన ధ‌ర్మవ‌రం ప‌ద్మశాలీ చేనేతలు బాకీల వ‌సూలుకి వ‌స్తే, వారిని బంధించి చిత్రహింస‌ల‌కి గురిచేయ‌డం జ‌గ‌న్ జంగిల్ రాజ్‌లో మ‌రో దారుణ ఘ‌ట‌న‌గా పేర్కొన్నారు.

బ‌ట్టలు విప్పించి, బాదుతూ వీడియో తీసి ధ‌ర్మవ‌రంలో ఇత‌ర చేనేత‌ల‌కి పంపి, ఇంకా ఎవ‌రైనా బ‌కాయిల వ‌సూలుకి వ‌స్తే ఇదే గ‌తి ప‌డుతుంద‌ని హెచ్చరించ‌డం రాష్ట్రంలో భ‌యాన‌క ప‌రిస్థితుల‌కి అద్దం ప‌డుతున్నాయని లోకేశ్‌ ధ్వజమెత్తారు. వైసీపీ వాళ్లయితే చాలు... ఎన్ని నేరాలు చేసినా చట్టాలుండ‌వు, పోలీసులు అటువైపే చూడ‌రని దుయ్యబట్టారు. వైసీపీ నేత‌ల హింస‌, దౌర్జన్యాల‌తో ఇప్పటికే ఇత‌ర రాష్ట్రాల వ్యాపారులు పారిపోయారన్నారు. ఇప్పుడు స్థానిక వ్యాపారులు, చేనేత క‌ళాకారులు రాష్ట్రంలో ఉండ‌లేని ప‌రిస్థితులు ప్రభుత్వమే క‌ల్పించ‌డం ఆందోళ‌న‌క‌రమని అన్నారు. విశాఖ ఎంపీ భార్య, కొడుకు, ఆడిట‌ర్‌ని కిడ్నాప్ చేసి చంపుతామ‌ని బెదిరించి కోట్లలో లాగేసినా ప‌ట్టించుకోలేని పోలీస్ వ్యవ‌స్థ... త‌న కుటుంబానికి ఇక్కడ ర‌క్షలేద‌ని, ప‌క్క రాష్ట్రానికి వెళ్తున్నానని చెప్పినా స్పందించ‌ని యంత్రాంగాన్ని చూస్తుంటే ఏపీ పాత‌బిహార్‌ను త‌ల‌పిస్తోందని మండిపడ్డారు. వ్యాపారులు, ప‌రిశ్రమ‌ల య‌జ‌మానుల‌కి రాయితీలు ఇవ్వాల్సిన ప్రభుత్వమే మాఫియా డాన్‌లా బెదిరిస్తూ ఒక్కొక్కరినీ త‌రిమేయ‌డం దారుణమన్నారు. ధ‌ర్మవ‌రం ప‌ద్మశాలీ చేనేత‌ల‌ని పైశాచికంగా హింసించిన వైసీపీ నేత, ఆల‌య సిల్క్స్ ఎండీ అవినాష్ ని అరెస్టు చేయాలని, ప‌ద్మశాలీల‌కి ర‌క్షణ క‌ల్పించాలని నారా లోకేశ్‌ డిమాండ్ చేశారు.

అడుగడుగునా హారతి... నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో 149వ రోజు యువగళం పాదయాత్ర కోలాహలంగా ప్రారంభమైంది. కొడవలూరు మండలం రాజుపాలెం వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. రాజుపాలెం, కొడవలూరు, తలమంచి మీదుగా కావలి నియోజకవర్గంలో యాత్ర ప్రవేశించనుంది. నార్త్ ఆములూరు, బీరంగుంట వరకు యాత్ర సాగనుంది. అల్లూరు శివారులో ఏర్పాటు చేసిన విడిది కేంద్రంలో లోకేశ్ బస చేయనున్నారు. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న ప్రజలు, లోకేశ్​కు తమ సమస్యలు విన్నవించుకున్నారు. కోవూరు నియోజకవర్గంలో యువనేత లోకేశ్ కు ప్రజలు అడుగడుగునా జేజేలు పలికారు. మహిళలు హారతులు ఇచ్చి నీరాజనాలు పలికారు. బుచ్చిరెడ్డిపాలెం బహిరంగసభకు జనం పోటెత్తారు. చెల్లాయపాలెం నుంచి సీనియర్ నేతలు జవహర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, దినేష్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. చిరు వ్యాపారస్తులు, రైతులు అడుగడుగునా వారి సమస్యలను వివరించారు. కోవూరు నియోజవర్గ ప్రజలు నాలుగేళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేశ్ కి వివరించారు. విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారని చెత్త పన్ను, పెరిగిన విద్యుత్ ఛార్జీలు, రకరకాల పేర్లతో పన్నుల బాదుడు కారణంగా జీవనం కష్టంగా మారిందని ప్రజలు, చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.

దిల్లీ పర్యటనలు ఎందుకో... టీడీపీ అధికారంలోకి వస్తుందని, ధైర్యంగా ఉండాలన్న లోకేశ్.. పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి శిలాఫలకాలపై ఉన్న శ్రద్ధ.. ఆ తర్వాత పనుల విషయంలో లేదని విమర్శించారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి నల్లతాచు అని పేరు పెట్టా... అడ్డగోలు దోపిడీ, శిలాఫలకాలు, రంగులపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేకపోవడం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమంటూ లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. బాబాయ్ మర్డర్ కేసులో ఏ8 గా ప్రకటించిన అవినాష్ ని కాపాడటానికి జగన్ స్పెషల్ ఫ్లైట్ లో మళ్లీ దిల్లీ వెళ్లాడు.. సీబీఐ ఛార్జ్ షీట్​లో తన పేరు, తన భార్య భారతీ రెడ్డి పేరు చేర్చకుండా దిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి వెళ్లాడని లోకేశ్ ఆరోపించారు. బాబాయ్ మర్డర్ జగనాసుర రక్త చరిత్ర అని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.