ETV Bharat / state

ఉపాధ్యాయుల బదిలీ.. జిల్లాలో 3,687 ఖాళీలు.. 1,460 పోస్టులు బ్లాక్‌

author img

By

Published : Dec 11, 2020, 3:31 PM IST

కొత్త కొత్త నిబంధనలతో 8 నెలలుగా వివిధ అవాంతరాల మధ్య ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ సాగుతూ వచ్చింది. ఎట్టకేలకు నెల్లూరు జిల్లా విద్యాశాఖ అధికారులు దాన్ని పూర్తి చేసి.. వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినా.. పెద్ద సంఖ్యలో పోస్టులను చూపకుండా బ్లాక్‌ చేశారు. 1,460 పోస్టులను బ్లాక్‌ చేసినట్లు విద్యాశాఖ అధికారులే పేర్కొన్నందున ఉపాధ్యాయుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది.

nellore district teachers transfers
నెల్లూరు జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీ

ఓ వైపు బదిలీల్లో సమస్యలపై ఉపాధ్యాయ వర్గాలు పోరుబాట పట్టగా- ఇంకోవైపు నెల్లూరు జిల్లాలో ఉపాధ్యాయ బదిలీ ఖాళీలపై స్పష్టత వచ్చింది. ఈ ఖాళీలపై గత కొద్ది రోజులుగా వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న జిల్లా విద్యాశాఖ- ఎట్టకేలకు కాస్త ఆలస్యంగానైనా తుది జాబితాను రూపొందించింది. గురువారం ఆన్‌లైన్‌లో పొందుపరిచింది. దాని ఆధారంగా ఉపాధ్యాయులు బదిలీలకు ఐచ్ఛికాలు ఇచ్చుకోవాల్సి ఉంది.

nellore district teachers transfers
నెల్లూరు జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీ

జిల్లాలో 5, 8 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, వివిధ పాఠ్యాంశ ఉపాధ్యాయులు బదిలీ కావాల్సి ఉంది. 1,572 మంది తప్పనిసరి బదిలీ జాబితాలో ఉండగా.. వీరికి తోడు రెండేళ్లు పూర్తి చేసుకున్న వారు విజ్ఞాపన బదిలీకి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 4,984 మంది దరఖాస్తు చేసుకున్నారు. హేతుబద్ధీకరణ అనంతరం జిల్లాలోని ఖాళీలు 3,687గా విద్యాశాఖ అధికారులు తేల్చారు. ఈ పోస్టుల్లో 1,460 పోస్టులను బ్లాక్‌ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలను బదిలీల్లో ఉపాధ్యాయులు కోరుకోవడం లేదన్న కారణంగా ముందుగానే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీంతో మిగిలిన 2,227 స్థానాలకే ఉపాధ్యాయులు ఐచ్ఛికాలు ఇచ్చుకోవాల్సి ఉంది. ఈ చర్యల వల్ల ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందని, బ్లాక్‌ చేసిన పోస్టులను అక్రమ మార్గంలో భర్తీ చేసేందుకు అధికారులు ఇలా చేశారని ఉపాధ్యాయ వర్గాలు మండిపడుతున్నాయి.

వెబ్‌ ఆప్షన్‌లు నేటి నుంచి...

నవంబరు 30 నుంచి నూతన షెడ్యూల్‌తో ప్రారంభమైన ఈ ప్రక్రియ అభ్యంతరాలు జిల్లా సంయుక్త పాలనాధికారి పరిశీలనతో గురువారం కొలిక్కి వచ్చింది. ఉన్న ఖాళీలు, దరఖాస్తు చేసుకున్న వారు, జిల్లాలో బ్లాక్‌లో ఉంచిన పోస్టుల వివరాలను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఇది తుది జాబితాగా ప్రకటించారు. శుక్రవారం నుంచి 15వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జరగనుంది. 16 నుంచి 21 వరకు బదిలీల ఉత్తర్వుల ప్రదర్శన, అనంతరం 22, 23 తేదీల్లో సాంకేతిక ఇబ్బందుల స్వీకరణ ఉంటుంది. 24న బదిలీల ఉత్తర్వులు డౌన్‌లోడ్‌ అవుతాయి. ఈ మేరకు ఆన్‌లైన్‌లో ప్రక్రియ కొనసాగనుంది.

పారదర్శకంగా చేపట్టాం

పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాం. తుది జాబితాను ఆన్‌లైన్‌లో పాందుపరిచాం. ఉపాధ్యాయులు శుక్రవారం నుంచి వెబ్‌ ఆప్షన్స్‌ ఎంచుకోవాల్సి ఉంది. -- డీఈవో పీ.రమేష్‌

ఇవీ చదవండి..

చలించొద్దు. జాగ్రత్త మరవొద్దు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.