ETV Bharat / state

పింఛన్‌ తొలగింపుపై ఆందోళన.. 'స్పందన'కు వందల సంఖ్యలో బాధితులు

author img

By

Published : Dec 26, 2022, 5:53 PM IST

Updated : Dec 26, 2022, 8:30 PM IST

PENSIONERS PROTEST AT NELLORE
PENSIONERS PROTEST AT NELLORE

PENSIONERS PROTEST AT NELLORE : నెల్లూరు జిల్లాలో ఫించన్​ తొలగించిన వారి రోదనలు ఆకాశానంటుతున్నాయి. పింఛన్​ డబ్బులతోనే జీవనం సాగిస్తున్న వారికి.. ఇప్పుడు దానిని నిలిపివేయడంతో అల్లాడుతున్నారు. కాస్తో కూస్తో వచ్చే డబ్బులతోనే వారికి ఇంట్లో గౌరవం ఉందంటున్నారు. ఇప్పుడు అలాంటి పింఛన్లు తీయొద్దని ఎమ్మెల్యేను కోరుతున్నారు. అయితే అధికారులు మాత్రం వాటిని పునరుద్ధరించడానికి సమయం ఎక్కువ పడుతుందని మాట దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు.

పింఛన్‌ తొలగింపుపై ఆందోళన

PENSIONERS PROTEST AT SPANDANA PROGRAM: నెల్లూరు జిల్లాలో పింఛన్ల తొలగింపుతో ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ పింఛన్లు పోయాయని స్పందన కార్యక్రమానికి వందలాది మంది బాధతో తరలివచ్చారు. వారికి అధికారులు చెప్పే కారణాలు నచ్చకపోవడంతో కన్నీటితో వెనుతిరిగారు. ఎక్కువ మంది ఈ నెల నుంచి రాలేదని.. మరి కొందరు జూన్ నుంచి ఆగిపోయిందని అధికారులకు గోడును వినిపించారు. సామాజిక భద్రత పింఛన్ మాకు భరోసా అని బాధితులు స్పష్టం చేస్తున్నారు.

పింఛన్​ వస్తే గౌరవంగా ఉంటాం: నెల్లూరు జిల్లాలో భారీగా పింఛన్ల కోత పెట్టారు. 2014 నుంచి పింఛన్ తీసుకుంటున్న వారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. 200 రూపాయలు నుంచి పింఛన్ తీసుకుంటూ హాయిగా జీవితం గడుపుతున్నామని,.. పింఛన్ వస్తే కుటుంబ సభ్యులు గౌరవంగా చూసుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి మా పింఛన్ తీసేస్తే.. మాకు భరోసా ఏదని వారు ప్రశ్నిస్తున్నారు. పేద కుటుంబాలకు పింఛన్ ఎంతో కొంత ఆదరువుగా ఉందని చెప్పారు. వారి గోడు వెళ్లబోసుకునేందుకు స్పందన కార్యక్రమానికి బాధితులు భారీగా తరలివచ్చారు.

ఒక్కో నియోజకవర్గంలో 3000 పింఛన్లు తొలగింపు: జిల్లాలో 12 వేలకు పైగా పింఛన్లు పోయాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో 2500 నుంచి మూడు వేల మందిని తొలగించారు. పింఛన్లు పోయినవారు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ బోరున విలపిస్తున్నారు. రాణమ్మ అనే వృద్ధురాలు నడవలేక నెల్లూరు కార్పొరేషన్​కు వచ్చింది. వృద్ధాప్య పింఛన్ తొలగించారని కన్నీరుమున్నీరయ్యింది. తన కొడుకు ఆటో తోలుతున్నాడని.. పింఛన్ ఉంటే తాను కుటుంబానికి భారం కానని, కానీ ఇప్పుడు మందులు తెచ్చుకోవడానికి కూడా పింఛన్ లేకుండా పోయిందని బోరున విలపిస్తోంది.

భర్త లేక ఇద్దరు చిన్నారులతోనే బతుకు: నెల్లూరు జడ్బీ కాలనీకి చెందిన బుజ్జమ్మ.. 2014 నుంచి ఇప్పటి వరకు పింఛన్​ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల నుంచి పింఛన్ ఆగిపోయిందని తెలియడంతో బాధగా ఉన్నట్లు చెప్పారు. బట్వాడిపాలెంకు చెందిన స్వప్న తన బాధను ఈటీవీ-ఈటీవీ భారత్​కు వివరించారు. జులై నుంచి తన పింఛన్ ఆగిపోయిందని కన్నీరు కార్చింది. భర్త చనిపోయాడని, ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటున్నానని చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. ఇళ్లలో పని చేస్తానని, సొంత ఇళ్లు కూడా లేదని చెప్పి వాపోయారు.

ఏ నాయకుడి ఇంటి వద్ద చూసినా పింఛన్​ బాధితులే: జిల్లాలో ప్రతి చోట పింఛన్ బాధితుల రోదనలు వినిపిస్తున్నాయి. ఏ ప్రజాప్రతినిధి ఇంటి వద్ద, వైసీపీ కార్యాలయ వద్ద, నాయకుల ఇళ్ల వద్ద పింఛన్ పోయిన బాధితులు కనిపిస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందనలో వందలాది మంది బాధితులు వారి గోడును వినిపించడానికి వచ్చారు. ఇక తమకు పింఛన్ రాదని నిరాశతో వెనుతిరిగారు. రెండు రోజులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి వృద్ధులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారి గోడును విన్న ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చారు. ఒక్క పింఛన్ కూడా తీయడానికి వీలులేదని చెప్పారు.

సాధ్యం కాదంటున్న అధికారులు: తొలగించిన పింఛన్​లను మళ్లీ పునరుద్ధరించాలంటే ఎక్కువ సమయం పడుతుందని.. రీసర్వేచేయమని ఎమ్మెల్యేలు కోరుతున్నా అది సాధ్యమయ్యే పనికాదని అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Dec 26, 2022, 8:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.