ETV Bharat / state

'రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకంలోనూ.. కేంద్ర ప్రభుత్వ వాటా ఉంది'

author img

By

Published : Jun 15, 2022, 8:38 PM IST

ఎంపీ జీవీఎల్
ఎంపీ జీవీఎల్

కొవిడ్ కష్టకాలంలో పేదలకు కేంద్రం నేరుగా పదిహేను వందల రూపాయలు జమ చేసిందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో భాజపా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. పేదలందరికీ బ్యాంకు ఖాతా ఉండాలనే లక్ష్యంతో కేంద్రం భారీగా ఖాతాలు తెరిపించిందని నేతలు వివరించారు. కేంద్రం ఇచ్చే సహాయం నేరుగా ఖాతాలో జమయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకంలోనూ.. కేంద్ర ప్రభుత్వ వాటా ఉందన్నారు.

కేంద్రం ఇచ్చే నిధులతో పథకాలు అమలు చేస్తూ .. రాష్ట్ర ప్రభుత్వం తన స్టిక్కర్లు అంటించి కొని ప్రచారం చేసుకుంటుందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ వందశాతం సాధికారత పేరుతో మోదీ ఎనిమిదేళ్ల పాలన పై జిల్లా స్థాయి సమావేశం జరిగింది. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే జరుగుతుందని ఆయన అన్నారు.

వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో తన స్వంత నిధులతో ఏం చేసిందో... కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏం చేసిందో చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. దీనిపై ఏ స్థాయి నాయకులు వచ్చిన.. ఆ స్థాయి నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి ప్రజలకు తెలియజేసేందుకు నిర్భయంగా ముందుకు వస్తున్నామని ఆయన అన్నారు. కొవిడ్ కష్టకాలంలో ప్రతి ఒక్క పేదవానికి కేంద్ర ప్రభుత్వం నేరుగా పదిహేను వందల రూపాయలు జమ చేసిందన్నారు. ప్రతి నెల ఒకరికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం సరఫరా చేసినట్లు చెప్పారు. గత మూడు నెలలుగా ఆ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయకుండా నిలుపుదల చేసింది అన్నారు. ప్రతి ఒక్క పేదవానికి బ్యాంకు ఖాతా ఉండాలనే లక్ష్యంతో భాజపా ప్రభుత్వం భారీగా ఖాతాలు తెరిపించి.. కేంద్రం ఇచ్చే సహాయం నేరుగా ఖాతాలో జమ అయ్యేలా చర్యలు తీసుకుందన్నారు. సుస్థిర పాలన భాజపా తోనే సాధ్యమని ఆ విషయాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు బూత్ స్థాయి నుంచి ప్రయత్నిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: CM JAGAN REVIEW MEETING : త్వరలో రాష్ట్రంలో మూడు లక్షలకు పైగా ఉద్యోగాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.