'కేంద్ర సంస్థల ఏర్పాటులో వేగం పెంచండి.. ఏపీ ప్రభుత్వశాఖలతో చర్చించండి'

author img

By

Published : Jul 27, 2022, 4:36 AM IST

venkayyah naidu

Venkayya Naidu: ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో భాగంగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల పురోగతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌ మూర్తి, ఇతర అధికారులు హాజరై ఆయా సంస్థల పురోగతిని వివరించారు. ప్రాజెక్టుల ఏర్పాటులో అడ్డంకులు ఏవైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలతో చర్చించి త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.

Venkayya Naidu: ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో భాగంగా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థల పురోగతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మంగళవారం కేంద్ర మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌ మూర్తి, ఇతర అధికారులు హాజరై ఆయా సంస్థల పురోగతిని వివరించారు. వీటితోపాటు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సొంతభవనం కోసం రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరులో స్థలం కేటాయించిన నేపథ్యంలో దాని నిర్మాణానికి నిధుల కేటాయింపు గురించి ఉపరాష్ట్రపతి ఆరాతీశారు.

అలాగే నెల్లూరులో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌కు చెందిన ప్రాంతీయ కేంద్రం, రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ ఏర్పాటు గురించీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సోమవారం ఉపరాష్ట్రపతితో సమావేశమై వీటిపై చర్చించారు. ఆ నేపథ్యంలో మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి ఉపరాష్ట్రపతి నివాసానికి వచ్చి పూర్తి వివరాలను అందించారు. అనంతరం వెంకయ్య నాయుడు పార్లమెంటులోని తన ఛాంబర్‌లో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా, హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌లతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుల ఏర్పాటులో అడ్డంకులు ఏవైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలతో చర్చించి త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.

.

వివిధ సంస్థల పురోగతి ఇలా..
కేంద్ర విశ్వవిద్యాలయం: అనంతపురం జిల్లాలో కేటాయించిన 491.30 ఎకరాల భూమిని 2020లో యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకుంది. భవనాల నిర్మాణ బాధ్యతలను కేంద్ర ప్రజా పనులశాఖకు అప్పగించింది. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో 11 కోర్సుల్లో 414 మంది విద్యార్థులు చదువుతున్నారు.

గిరిజన విశ్వవిద్యాలయం: తాత్కాలిక భవనాల్లో 8 కోర్సుల్లో 250 మంది విద్యార్థులు చదువుతున్నారు. విజయనగరం జిల్లాలో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు భూమిని బదిలీ చేయాలని రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. అది అయ్యాక భవన నిర్మాణం, మౌలిక వసతుల కోసం కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. గత నాలుగేళ్లలో కేంద్రం దీని కోసం రూ.15.39 కోట్లు విడుదల చేసింది.

ఐఐటీ తిరుపతి: 2015 ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 1,249 మంది విద్యార్థులున్నారు. ఇప్పటివరకూ 3 బ్యాచ్‌లు బయటికెళ్లాయి. 548 ఎకరాల్లో 2,500 మంది విద్యార్థులకు సరిపడేలా క్యాంపస్‌ నిర్మాణాన్ని 2024 కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యం.

ఎన్‌ఐటీ తాడేపల్లిగూడెం: ఇది పూర్తిస్థాయి శాశ్వత ప్రాంగణంలో నడుస్తోంది.

ఐఐఎం విశాఖపట్నం: తొలి దశ నిర్మాణానికి కేంద్ర కేబినెట్‌ రూ.594.32 కోట్లకు ఆమోదముద్ర వేసింది. 600 మంది విద్యార్థులకు సరిపడా 60,384 చదరపు మీటర్ల నిర్మాణాలను చేపట్టడానికి రూ.445 కోట్లు కేటాయించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సంస్థ నిర్వహణ కోసం కేంద్రం ఒక్కో విద్యార్థికి రూ.5 లక్షల చొప్పున ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు రూ.317.57 కోట్లు విడుదలయ్యాయి. ఈ ఏడాది నవంబరుకు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా.

తిరుపతి ఐఐఎస్‌ఈఆర్‌: ఈ క్యాంపస్‌ నిర్మాణానికి కేంద్రం రూ.1,137.16 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు రెండు హాస్టల్‌ బ్లాక్‌లు పూర్తయ్యాయి. శాశ్వత క్యాంపస్‌లో 22 భవనాల నిర్మాణాన్ని సీపీడబ్ల్యూడీ చేపట్టింది. 2023 జనవరికల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యం.

విశాఖ పెట్రోలియం ఇన్‌స్టిట్యూట్‌: ఆంధ్రా యూనివర్సిటీలో లీజుకు తీసుకున్న భవనాల్లో 2016-17 నుంచి పెట్రోలియం, కెమికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు నడుస్తున్నాయి.

ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు: ఇది పూర్తి స్థాయిలో ఏర్పాటైంది.

కర్నూలు ఐఐటీడీఎం: శాశ్వత క్యాంపస్‌ నిర్మాణం కోసం రూ.297 కోట్లు కేటాయించి రూ.187.64 కోట్లు విడుదల చేశారు. ఈ ఏడాది డిసెంబరు కల్లా నిర్మాణం పూర్తవుతుంది.
జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ: కృష్ణా జిల్లా కొండపావులూరులో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో ఎన్‌ఐడీఎం దక్షిణ క్యాంపస్‌ ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణం కోసం హోంశాఖ రూ.42.56 కోట్లు విడుదల చేసింది. ఇప్పటివరకు 97% పనులు పూర్తయ్యాయి.

మంగళగిరి ఎయిమ్స్‌: రూ.1,618 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ క్యాంపస్‌లో తొలి దశ 100%, రెండో దశ 99% నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పటివరకు కేంద్ర ఆరోగ్యశాఖ రూ.1,137.91 కోట్లు విడుదల చేసింది. ఈ ఏడాది ఆగస్టుకల్లా పూర్తవుతుందని అంచనా. 2018-19 నుంచి ఎంబీబీఎస్‌ తరగతులు, 2019 మార్చి నుంచి ఓపీడీ ప్రారంభమైంది.

ఇదీ చదవండి: ఎస్సీ, ఎస్టీ, బీసీల రుణాల రాయితీ వెనక్కి!.. బ్యాంకుల్లో రూ.488 కోట్లకుపైనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.