ETV Bharat / state

Vizag Steel Plant: విశాఖ ఉక్కుపై నోరువిప్పని సీఎం జగన్.. కేంద్ర పెద్దల వద్ద మౌనంగా వైసీపీ ఎంపీలు

author img

By

Published : Aug 1, 2023, 10:28 AM IST

YSRCP MPs No Comments on Vizag Steel Plant: వైసీపీ ఎంపీలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై మౌనం పాటిస్తున్నారు. విశాఖ ఉక్కుపై ఆది నుంచి అసహాయ స్థితిలో ఉంటోంది. 22 మంది ఎంపీల బలమున్న వైసీపీ.. పార్లమెంటులో పోరాడకుండా మిన్నకుండిపోతోంది. ప్రతిపక్ష హోదలో మేమున్నామంటూ ముందుకు వచ్చిన వైసీపీ నాయకులు నేడు తలదించుకోవడంపై.. విమర్శల దాడి పెరుగుతోంది.

Vizag Steel Plant
విశాఖ ఉక్కు

YSRCP MPs Keep Silence on Vizag Steel: 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచుతానే మాటలను మాట్లాడుతూ.. ప్రతిపక్ష హోదలో ఉన్నప్పుడు ప్రచారంలో జగన్‌ ఊదరగొట్టారు. మరీ ఇప్పుడు వైసీపీ తరఫున 22 మంది ఎంపీలు ఉన్నా.. కేంద్రం ఎదుట ఎప్పుడూ తల దించుకునే ఉంటున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం వడివడిగా అడుగులు వేస్తుంటే.. ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి మాత్రం మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారు. కనీసం కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించాలన్నా భయపడుతున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు 900 రోజులుగా కార్మికులు ఆందోళనలు చేస్తున్నా.. వైసీపీ ఎంపీలు పార్లమెంటులో నోరెత్తలేదు. వారి మౌనమే విశాఖ ఉక్కుకు ఉరితాడుగా మారింది.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓట్ల కోసం విశాఖ ఉక్కు ఉద్యమాన్ని వాడుకోవడం.. జగన్‌కు అలవాటుగా మారింది. అధికారంలోకి రాగానే ప్లాంటుకు అవసరమైన ముడిసరకు విషయంలో పక్కనే ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని. గత ఎన్నికల ముందు, అలాగే పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక పక్క రాష్ట్రాలతో చర్చలు జరపనేలేదు. సొంత రాష్ట్రంలో ఉన్న గనుల లీజుల పొడిగింపుపైనా తాత్సారం చేస్తున్నారు. విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలోనూ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ నుంచి స్టీల్‌ప్లాంట్‌ గేటు వరకు కంటితుడుపు పాదయాత్ర చేసి ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేశారు. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలోనూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 120 మంది ఎంపీలతో సంతకాలు చేయించి మోదీకి పంపిన లేఖ ఇదిగో అంటూ హడావుడి చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లా గర్భాంలో 264 హెక్టార్ల మాంగనీస్‌ గనులు, నెల్లిమర్లలో 64 హెక్టార్ల సిలికా, అనకాపల్లి జిల్లా కింతాడలో క్వార్ట్జ్, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో లైమ్‌స్టోన్, తెలంగాణలోని ఖమ్మం జిల్లా మాదారంలో డోలమైట్‌ గనులు కేటాయించారు. ప్రస్తుతం జగ్గయ్యపేట లైమ్‌స్టోన్‌ లీజు పదేళ్లు, మాదారం డోలమైట్‌ లీజు 20 ఏళ్లు పొడిగించారు. ఉత్తరాంధ్రలో మిగిలిన మూడు గనుల అనుమతులను రెన్యువల్‌ చేయాల్సి ఉంది.. దీనిపై అతి కష్టంపై క్వార్ట్జ్‌కు పొడిగింపు ఇచ్చి మిగిలినవి అటకెక్కించారు. మాంగనీస్, ఇసుక లీజు రెన్యువల్‌ ఫైల్స్​లన్నీ గత నవంబరు నుంచి గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేషీలో పెండింగ్‌లో ఉన్నట్లు కార్మిక వర్గాలు చెబుతున్నాయి.

విశాఖ ప్లాంటుకు ప్రత్యేక గనులు కేటాయించాలన్న పార్లమెంటరీ కమిటీ సూచనను కేంద్రం అమలు చేయలేదు. అయినా కమిటీ సభ్యులుగా ఉన్న ఇద్దరు వైసీపీ ఎంపీలు పట్టించుకోలేదు. కమిటీ సభ్యులైన అనకాపల్లి ఎంపీ సత్యవతి "ఉక్కు పరిరక్షణ ఉద్యమ శిబిరాన్ని" సందర్శించలేదని, మరో సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇంతవరకు విశాఖ ప్లాంటునే చూడలేదని కార్మికులు చెబుతున్నారు. ఇక స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌ సమావేశాల్లో మాట్లాడటం, ఎన్​ఎండీసీ నుంచి బొగ్గు తెచ్చుకోవడానికి రైలు రేక్‌ల కొరత ఏర్పడితే కేంద్ర మంత్రితో చర్చించడం వంటివీ చేయలేదనే చెప్పాలి.

రాష్ట్ర ప్రభుత్వ వాటాను అదానీకి ఇవ్వడంతో గంగవరం పోర్టు పూర్తిగా ప్రైవేటు పరమైంది. స్టీలు ప్లాంటు ముడిసరకు నిల్వలకు ప్రత్యేక యార్డు, వచ్చే ఓడలకు బెర్త్‌లు కేటాయించేవారు. ప్రస్తుతం అదానీ చేతుల్లోకి వెళ్లాక పరిస్థితి తారుమారైంది. గతంలో 50 కోట్ల వరకు స్టీలు ప్లాంటుకు మార్జిన్‌ ఇచ్చేవారు. ప్రస్తుతం పాత బకాయిలు చెల్లిస్తేనే సరకు దిగుమతి చేస్తామని అదానీ సంస్థ వర్గాలు స్పష్టంచేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వెయ్యి కోట్ల విలువైన ఉత్పత్తులతో వచ్చిన మూడు ఓడలను పోర్టులోనే నిలిపివేశారు. దీనిపై మాట్లాడటానికి వెళ్లిన అధికారులతో... ఉక్కు ప్లాంటుకు ప్రాధాన్యం ఇవ్వొద్దని తమ యాజమాన్యం చెప్పిందని పోర్టు ప్రతినిధులు అనడం కార్మిక సంఘాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. పైగా పోర్టులో హ్యాండ్లింగ్‌ ఛార్జీలను పెంచడం విశాఖ ఉక్కు కర్మాగారానికి అదనపు భారంగా మారింది.

విశాఖ ఉక్కుకు ఉరితాడు బిగిస్తున్న వైసీపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.