ETV Bharat / state

వామ్మో..! పనిమనిషేగానీ.. ఊహించని మర్డర్ ప్లానింగ్

author img

By

Published : Feb 27, 2023, 11:47 AM IST

Maid Murder Planning: ఆసరా ఉంటుందనుకుంటే.. అంతం చేసింది. సంరక్షణ చూస్తుందనుకుంటే.. చంపేసి నగదు, నగలు మాయం చేసింది. కేసును పక్కదారి పట్టించేలా చేసిన ప్లానింగ్ పై పోలీసులు కూడా నివ్వెరపోయారు.

వృద్ధురాలి హత్య కేసు
వృద్ధురాలి హత్య కేసు

Maid Murder Planning: వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. సంరక్షణ చూసే మహిళే నిందితురాలిగా తేల్చారు. కేసును పక్కదారి పట్టించేందుకు పక్కా పథకం వేసినా సరే.. క్లూ దొరకడంతో.. ఆమెను అదుపులోకి తీసుకుని నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు.

సంరక్షణ కోసం నియమిస్తే... పెనమలూరు మండలం కానూరుకు చెందిన చాగంటిపాటి సుమతీ దేవి(81) కి ఇద్దరు కుమార్తెలు, కుమారులు. వారు వేరుగా వుండటంతో తల్లి సంరక్షణ కోసం పెనుగంచిప్రోలు నవాబుపేటకు చెందిన చింతల మల్లేశ్వరిని నాలుగు నెలల కిందట నియమించారు. ఒంటరి ఉంటున్న వృద్ధురాలి ఒంటిపై బంగారం కాజేసేందుకు మల్లేశ్వరి పథకం వేసింది.

దోపిడీకి పాల్పడ్డారంటూ.. మల్లేశ్వరి ఈ నెల 24వ తేదీ అర్ధరాత్రి అనంతరం ఇంట్లో విద్యుత్తు సరఫరా నిలిపివేసి సీసీ కెమెరాను తొలగించింది. చీకట్లో సుమతీదేవిపై దాడి చేసి మెడలోని ఆభరణాలు, ఉంగరాలు తెంపడానికి ప్రయత్నించింది. వృద్ధురాలు ప్రతిఘటించడంతో గొంతు నులిమి హతమార్చింది. దుండగులు వచ్చి వృద్ధురాలిని చంపి దోపిడీకి పాల్పడ్డారని కట్టుకథ అల్లింది.

పోలీసులను దారి మళ్లించేలా.. కేసును తప్పుదోవ పట్టించడానికి వృద్ధురాలి సెల్‌ఫోన్‌తో పాటు తన సెల్‌ఫోన్‌ను కూడా ఇంటి బయట ఉన్న డ్రైనేజీలో పడేసింది. చోరీ చేసిన బంగారు గొలుసు, ఆభరణాలు, నగదును వంట గదిలోని పోపు డబ్బాల్లో దాచింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లుగా.. తనంతట తానే గాయపర్చుకొని స్పృహ తప్పినట్టు నటించింది. బజారులో దొరికిన ఖాళీ పాన్‌పరాగ్‌, సిగరెట్‌ ప్యాకెట్లు తీసుకువచ్చి ఇంటి ఆవరణలో పడేసింది. ఇద్దరు దుండగులు దాడి చేశారంటూ పోలీసులను దారి మళ్లించే ప్రయత్నం చేసింది.

సెల్‌ఫోన్ల లొకేషన్‌ ఆధారంగా.. పోలీసులు సెల్‌ఫోన్ల సిగ్నల్స్‌, లొకేషన్లను పరిశీలించగా అవి మృతురాలి ఇంటి వద్దే చూపుతుండటంతో మరింత లోతుగా దర్యాప్తు చేశారు. పనిమనిషిపై అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించింది.

వృద్ధురాలి కుమారుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టాం. కేసును పక్కదారి పట్టించేందుకు పనిమనిషి కట్టుకథ అల్లింది. కానీ, ఆమెపై అనుమానంతో ఇంటరాగేట్ చేసి రెండు గంటల్లోనే కేసు ఛేదించాం. డ్రైనేజీలో పడేసిన సెల్‌ఫోన్లను ఆమెతోనే బయటకు తీయించాం. వంట గదిలో దాచిన రూ.4.50 లక్షల విలువైన ఆభరణాలు, రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నాం. - డీఎస్పీ విజయపాల్‌

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.