ETV Bharat / state

పక్క రాష్ట్రం సీఎం బిడ్లు వేస్తామంటుంటే..ఈ రాష్ట్రం సీఎం ఏం చేస్తున్నారు..?: టీడీపీ నేతలు

author img

By

Published : Apr 10, 2023, 5:34 PM IST

TDP leaders fire on CM Jagan Mohan Reddy: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సంబంధించి పక్క రాష్ట్రం సీఎం చూపిన చొరవ కూడా సీఎం జగన్ చూపటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అపలేని ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ..పలు కీలక ప్రశ్నలను సంధించారు.

1
1

TDP leaders fire on CM Jagan Mohan Reddy: విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలైనా బండారు సత్యనారాయణ, ధూళిపాళ్ల నరేంద్రలు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్ల విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చూపిన చొరవ కూడా సీఎం జగన్ చూపడం లేదంటూ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవను ఏపీ ప్రభుత్వం ఎందుకు చూపడం లేదు..? అని నిలదీశారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయామనే కోపం సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ మీద చూపుతున్నారా..? అని పలు కీలక పశ్నలను సంధించారు.

ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తున్నారు..?: ఈ సందర్భంగా మీడియాతో బండారు సత్యనారాయణ మాట్లాడుతూ..''విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దు అంటూ గతకొన్ని నెలలుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేస్తున్నాము. తాజాగా తెలంగాణ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ విషయంలో బిడ్డు వేస్తామని చెప్పడం జరిగింది. మా కోరిక ఒక్కటే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దు. ఎందుకంటే అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో ఉద్యమం ఫలితంగా వచ్చిన స్టీల్ ప్లాంట్. ఆ స్టీల్ ప్లాంట్ కోసం దాదాపు 350మంది వారి ప్రాణాలను త్యాగం చేశారు. అటువంటి స్టీల్ ప్లాంట్‌ను ప్రవేటీకరణ చేస్తామంటే మేము ఒప్పుకోము. స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు నాయుడు సైతం దిల్లీలో ధర్నా చేద్దాం రండి అని ముఖ్యమంత్రి జగన్‌ను కోరారు. కానీ, ఈ ముఖ్యమంత్రి ఆ ధర్నాకు రాలేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బిడ్డు వేస్తామని ముందుకు వస్తుంటే.. ఈ ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారు..?, సీఎం జగన్.. పోరాటం చేయవు..?, దిల్లీకి వెళ్లి పీఎంగారితో మాట్లాడవు..?, 25 మంది ఎంపీలతో ధర్నాలు ఎందుకు చేయించావు..?'' అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.

23మంది వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారు..?: టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ..'' విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉమ్మడి రాష్ట్రం ప్రజలు అనేక ఉద్యమాలు చేశారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు నినాదంతో తమ ప్రాణాలను అర్పించారు. అటువంటి ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తున్నామంటూ ప్రకటిస్తే..ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది..?, ముఖ్యమంత్రి జగన్ గాఢనిద్రలో ఉన్నట్టుంది. పక్క రాష్ట్రాల సీఎంలు స్టీల్ ప్లాంట్ విషయంలో స్పందిస్తుంటే..ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, 23మంది వైసీపీ ఎంపీలు ఎందుకు స్పందించటంలేదో అర్థకావటంలేదు'' అని ఆయన పశ్నించారు.

సీఎం జగన్‌ను ఎవ్వరూ కాపాడలేరు: ఉత్తరాంధ్ర ఎన్నికల్లో ఓడిపోయిన కోపం ఇలా చూపిస్తామంటే జగన్‌ను ఎవ్వరూ కాపాడలేరని నేతలు వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో సీఎం జగన్ మౌనం దేని కోసమని నిలదీశారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్తామన్న సీఎం జగన్ మాటలేమయ్యాయని ప్రశ్నించారు. ఇన్నిసార్లు దిల్లీకి వెళ్లి వచ్చిన సీఎం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయాన్ని ఎందుకు వ్యతిరేకించడం లేదని ఆక్షేపించారు. కేసుల నుంచి తప్పించండని కోరడానికే దిల్లీకి వెళ్తున్నారా..? అని మండిపడ్డారు. ఇంతమంది ఎంపీలను గెలిపించినా.. సీఎం జగన్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు పోరాడడం లేదని విమర్శించారు.

సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్: విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బిడ్డింగులు వేసే అంశానికే తాము వ్యతిరేకమని.. కానీ ప్రైవేటీకరణని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్లు వేస్తామని ముందుకు రావడం సంతోషమన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ చెబుతున్నామన్నారు. పక్క రాష్ట్ర సీఎం బిడ్లు వేస్తామంటున్నప్పుడు.. ఏపీ సీఎం జగన్ ఏం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.