ETV Bharat / state

దిక్కుతోచని పరిస్థితిలో సీమ రైతులు.. పరిహారంతో ఆదుకోవాలని వినతి

author img

By

Published : Dec 13, 2022, 6:56 AM IST

Updated : Dec 13, 2022, 8:58 AM IST

Crops Damaged
పంట నష్టం

Houses and Crops Damaged : తుపాను ధాటికి నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోనూ భారీ నష్టం వాటిల్లింది. ప్రధాన పంటలన్నీ దెబ్బతిని రైతులు కష్టాల్లో కూరుకుపోయారు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లోకి జారుకున్నారు. మరోవైపు కొన్నిచోట్ల ఇళ్లు కూలిపోయి సాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Houses and Crops Damaged : నెల్లూరు జిల్లాలో ఉద్యాన, వ్యవసాయ, వాణిజ్య పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, పచ్చి మిర్చి, పత్తి రైతులకు అపార నష్టం వాటిల్లింది. 30 వేల ఎకరాల్లో వరి, 3 వేల ఎకరాల్లో పచ్చిమిర్చి, 1500 ఎకరాలలో పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ, వాణిజ్య పంటల నష్టం 5 కోట్లు, ఉద్యాన పంటల నష్టం 4 కోట్లు ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

తుపాన్ ప్రభావిత ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పరిశీలించారు. రైతులను ఆదుకోవాలని కోరుతూ ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి సంయుక్త కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు.

"వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. వారికి పరిహారం అందించాలి. తర్వాత పంటలకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించి వారికి సహాయం చేయాలి." -రావుల వెంకయ్య, రైతు సంఘ నాయకుడు.

వర్షాలకు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని సర్వేపల్లి కట్టపై అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఐదు ఇళ్లు కూలిపోయాయి. ఇళ్ళలోకి నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిసిపోయాయి. బాధితులు రోడ్డుపైనే ఉండాల్సిన పరిస్థితి. నిర్మాణంలో ఉన్న ఇళ్లు చాలా వరకు నెర్రలిచ్చాయి. బాధితులను టీడీపీ నేత అజీజ్‌ పరామర్శించారు.

"ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాము. వర్షాలకు ఇళ్లుగోడ కుంగిపోయింది. ఇంట్లోని సరుకులు రోడ్డుపైనే ఉంచాము. అధికారులు స్పందించి వసతి కల్పించాలని కోరుకుంటున్నాము." - సర్వేపల్లి మహిళ

"సర్వేపల్లి కాలువ రిటైనింగ్​ వాల్​ నిర్మాణం సిటీ వద్ద ఎందుకు ఆగిపోయింది. అదే నిర్మాణం ఇక్కడి వరకు కొనసాగితే బాగుండేది. ఇప్పుడు ఈ ఇళ్లులకు బలం ఉండేది. ఆ నిర్మాణం పూర్తైతే." - టీడీపీ నేత అజీజ్‌

అనంతపురం జిల్లాలో హెచ్ఎల్​సీ కింద జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా రైతులు వరి పంట సాగు చేశారు. తుపాన్ ప్రభావంతో కురిసిన వర్షం, ఈదురుగాలులు.. రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్, బొమ్మనహాల్, డి. హీరేహాల్ మండలాల్లోని వేలాది ఎకరాల్లో పంట నేల వాలింది. నూర్పిడి చేసి కలాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. ఆరబెట్టడానికి నానా అవస్థలు పడుతున్నారు. రంగు మారి మొలకలు వస్తే ధర కూడా దక్కదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాండౌస్‌ తుపాన్‌ ప్రకాశం జిల్లా పొగాకు రైతులను నిండా ముంచింది. మొక్క దగ్గర నుంచి, రేపో మాపో కోతకు దిశకు వచ్చే తోటల వరకూ నీట మునిగిపోయాయి. నీటిలో నానిన మొక్కలు ఒడిలిపోతున్నాయని, తోటల్ని తొలగించి మరో సారి నాట్లు వేసుకోవాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. ఎకరాకు 10నుంచి 25వేల వరకు నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

"అకాల వర్షాలకు పొగాకు పంట నష్టపోయాము. గతంలో ఎప్పుడూ ఈ సమయంలో వర్షాలు కురవలేదు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పొగాకు పంటను 11వ నెలలో నాటుకున్నాము. వర్షం కారణంతో నాటిన పంట నష్టపోయాము." - పొగాకు రైతు

గిద్దలూరు నియోజకవర్గంలో వందల ఎకరాల్లో మిర్చి, శనగ, అరటి పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటలను యర్రగొండపాలెం తెలుగుదేశం నియోజవర్గ బాధ్యుడు గూడూరి ఎరిక్షన్ బాబు పరామర్శించారు. త్రిపురాంతకం మండలంలోని గొల్లపల్లి, దూపాడు, ముడివేముల, ఉమ్మడివరం గ్రామాల్లో ట్రాక్టర్‌పై పర్యటించి రైతుల బాధలను తెలుసుకున్నారు. మార్కాపురం, కొనకనమిట్ల మండలాల్లో మాజీ ఎమ్మేల్యే కందుల నారాయణరెడ్డి పర్యటించారు. మిర్చి రైతులను పరామర్శించారు.

కొండెపి నియోజకవర్గంలో నీటిపాలైన పంటలను ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, దామచర్ల సత్య పరామర్శించారు. పరిహారం విషయంలో ఉదారంగా వ్యవహరించి.. రైతులను ఆదుకోవాలని నేతలు విజ్ఞప్తి చేశారు.

"పొగాకు రైతులకు ఒక ఎకరానికి సుమారు 10 నుంచి 25వేల వరకు నష్టం వాటిల్లుతోంది. కేంద్రప్రభుత్వం, పొగాకు బోర్డు రైతులను ఆదుకోవాలి. మిరప, మినుము, శనగ పంటలు వర్షానికి తడిసి నష్టపోయారు. ప్రభుత్వం అందించి రైతులను ఆదుకోవాలి." -బాల వీరాంజనేయస్వామి, కొండెపి ఎమ్మెల్యే

తిరుపతిలో భారీ వర్షానికి వర్షపు నీటి కాలువలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లు కాలువలోకి కుంగి గోడలు నేలకూలాయి. మరికొన్ని చోట్ల పాక్షికంగా దెబ్బతిన్నాయి.

దిక్కుతోచని పరిస్థితులో సీమ రైతులు.. పరిహారంతో ఆదుకోవాలని వినతి

ఇవీ చదవండి:

Last Updated :Dec 13, 2022, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.