ETV Bharat / state

ప్రభుత్వాస్పత్రి డైట్‌ కాంట్రాక్టు బరిలో ముగ్గురు..కలెక్టర్‌ ఆఫీస్​కు చేరిన పంచాయితీ

author img

By

Published : Feb 11, 2023, 3:59 PM IST

Updated : Feb 11, 2023, 10:08 PM IST

Govt Hospital Diet Contract: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి డైట్ కాంట్రాక్టును ఎలాగైనా దక్కించుకునేందుకు అధికార పార్టీ అండదండలున్న ముగ్గురు గుత్తేదారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో నిబంధనల ప్రకారం పూర్తి చేయాల్సిన డైట్‌ కాంట్రాక్టు టెండర్‌ను అధికారులు పెండింగ్‌లో పెట్టేశారు. టెక్నికల్, ఫైనాన్షియల్‌ బిడ్లకు సంబంధించిన షీల్డ్‌ కవర్లను తెరిచి పది రోజులు దాటిపోతున్నా ఇంతవరకూ దానిపై నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి టెండర్ల పంచాయితీ చేరింది.

Etv Bharat
Etv Bharat

Govt Hospital Diet Contract: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి డైట్‌ కాంట్రాక్టుకు ప్రస్తుతం గట్టి పోటీ ఏర్పడింది. ఏడుగురు గుత్తేదారులు ఈ డైట్‌ టెండర్లలో పాల్గొనగా వారిలో నిబంధనల ప్రకారం ఏ అర్హతలూ లేవంటూ ఇద్దరు గుత్తేదారులను పక్కకు తప్పించారు. మిగిలిన ఐదుగురు గుత్తేదారుల్లో ముగ్గురు అధికార పార్టీ నేతల అండదండలతో టెండర్‌ దక్కించుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. గత కొన్నేళ్లుగా చక్రం తిప్పుతున్న గుత్తేదారునే మళ్లీ కాంట్రాక్టు దక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పది రోజుల కిందట టెండర్ల సీల్డ్‌ కవర్లు తెరిచిన సమయంలో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి చెందిన ఇద్దరు కీలక అధికారులు సైతం అతని వైపే మొగ్గుచూపారు. దీంతో పాటు పక్క జిల్లాకు చెందిన ఓ ఎంపీ అండదండలు ఇతనికి ఉన్నాయి.

వైఎస్సార్సీపీ కీలక నేత ఆశీస్సులు: తాజాగా రాష్ట్రానికి చెందిన ఓ కీలక అధికారితోనూ జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మరో గుత్తేదారుకు రాష్ట్రంలోనే ఓ కీలకమంత్రి అండదండలున్నాయి. మరో గుత్తేదారుకు రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కీలక నేత ఆశీస్సులున్నాయి. ప్రస్తుతం ఈ ముగ్గురి కోసం పెద్దస్థాయిలో లాబీయింగ్‌ జరుగుతోంది. తాము చెప్పిన వారికే ఇవ్వాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.

గుత్తేదారుల అర్హతలు: డైట్‌ కాంట్రాక్టు నిబంధనల ప్రకారం చూస్తే గతంలో గుత్తేదారులు పనిచేసిన ఆస్పత్రుల్లో ఎలాంటి క్రిమినల్‌ కేసులు ఉండకూడదు. ఆసుపత్రుల ద్వారా వచ్చే ఆదాయానికి ప్రతి రూపాయికి జీఎస్‌టీ, ఐటీ సహా అన్నీ చెల్లించాలి. అక్రమాలకు పాల్పడకుండా కనీసం ఐదేళ్లు ఆసుపత్రుల్లో డైట్‌ కాంట్రాక్టును నిర్వహించిన అనుభవం ఉండాలి. ఎక్కువ ఏళ్ల అనుభవం ఉన్నవాటికి ఏడాదికి ఒక మార్కు చొప్పున వేయాలి. వీటన్నింటినీ అధికారులు పక్కాగా చూడాలి.

విమర్శలు..అభ్యంతరాలు: కానీ ఈ నిబంధనలను ఆసుపత్రి తాజా టెండర్లలో అధికారులు ఏ రకంగానూ పరిగణించలేదు. అనుభవం విషయంలో పక్క రాష్ట్రాల్లో సేవలు అందించిన వాటిని పరిగణలోనికి తీసుకోవటం, అక్కడ వ్యాట్‌ లైసెన్సులున్నా ఇక్కడ అనుమతించడం లాంటివి చేస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా అనుభవం విషయంలోనూ పక్క రాష్ట్రాల్లోని ఆసుపత్రుల్లో చేసిన దానికి ఇక్కడ మార్కులు వేస్తున్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

నిబంధనలతో సంబంధం లేకుండా: టెండర్లు తెరిచిన సమయంలోనూ దీనిపై మిగతా వారంతా అభ్యంతరం వ్యక్తం చేసినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. కేవలం పైనుంచి తమకు ఉన్న ఆదేశాల మేరకు టెండర్లలో ఎన్ని అవకతవకలు చేసైనా తాము అనుకున్న వారికి కట్టబెట్టాలనే ధోరణి జిల్లా అధికారుల్లో కనిపిస్తోంది. నిబంధనలతో సంబంధం లేకుండా ఆ ముగ్గురిలోనే ఒకరికి టెండర్ కట్టబెడతారన్న విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వాస్పత్రి డైట్‌ కాంట్రాక్టు బరిలో ముగ్గురు..కలెక్టర్‌ ఆఫీస్​కు చేరిన పంచాయితీ

ఇవీ చదవండి

Last Updated :Feb 11, 2023, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.