ETV Bharat / state

'పుస్తక మహోత్సవం' రా రమ్మంటోంది.. పుస్తక ప్రియులు విజయవాడ వస్తున్నారా..!

author img

By

Published : Feb 11, 2023, 3:07 PM IST

Vijayawada Book Festival latest Updates: గత మూడు దశాబ్దాలకు పైగా దిగ్విజయంగా కొనసాగుతున్న విజయవాడ 'పుస్తక మహోత్సవం' ఫిబ్రవరి 9వ తేదీన ప్రారంభమైంది. ప్రారంభమైన రోజు నుంచి ఈరోజు వరకూ సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సందర్శకులను అనుమతిస్తున్నారు. ఈసారి దాదాపు 200 పుస్తకాల స్టాళ్లను ఏర్పాటు చేశామని.. ఈ స్టాళ్లలో కేజీ నుంచి పీజీ వరకూ పుస్తకాలను అందుబాటులో ఉంచామని నిర్వాకులు తెలిపారు.

pusthakam
pusthakam

Vijayawada Book Festival latest Updates: విజయవాడలో ఏర్పాటు చేసిన 'పుస్తక మహోత్సవం' రా రమ్మంటోంది. వేల పుస్తకాలు.. తనలోని అక్షర సమూహాలను తేరిపార చూసి ఆస్వాదించే చదువరులను స్వాగతం- సుస్వాగతం అంటూ ఆహ్వానిస్తున్నాయి. వందలాది కవుల కలాల నుంచి జాలువారిన సాహితీ మకరందాలు ఓవైపు ఉంటే.. పురాణాలు, ఇతిహాసాలు, వేదాల్లోని సారాన్ని కళ్లకు కట్టే కమనీయగాథలు మరోవైపు ఉన్నాయి. చిన్నారులకు నీతిని తెలిపే పంచతంత్ర కథలు ఒకవైపు ఉంటే.. ఆరోగ్యం నుంచి అంతరిక్షం వరకు చిన్నారులు, పెద్దల వరకూ అణువణువూ వివరించే మరెన్నో పుస్తకాలు ఇంకోవైపు ఉన్నాయి. ఇలా మరెన్నో గ్రంథాలు, వందలాది కొత్త పుస్తకాలు పుస్తక ప్రియుల కోసం అందుబాటులోకి వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన 'పుస్తక మహోత్సవం' మొదలైన రోజు నుంచి ఈరోజు వరకూ సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సందర్శకులను అనుమతిస్తున్నారు. దీంతో సాయంత్రం వేళ రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ మహోత్సవానికి కుటుంబ సమేతంగా కొందరు.. స్నేహితులతో ఇంకొందరు తరలివస్తున్నారు. సాహితీ ప్రియులు బృందాలుగా వచ్చి పుస్తకాలను పరిశీలిస్తున్నారు. అనేక విద్యాలయాలకు చేరువైన ప్రాంతంలో పుస్తక మహోత్సవం వేదికను ఎంపిక చేయడంతో విద్యార్ధుల రాక పెరుగుతోంది.

ప్రతి పుస్తక ప్రదర్శనలో స్టాళ్లలోని పుస్తకాలు అమ్మకాలు మాత్రమే జరుగుతుంటాయి. కానీ.. ఇక్కడి కొన్ని స్టాళ్లు పుస్తకం కొనుగోలు చేయకపోయినా, కూర్చొని చదువుకునే అవకాశాన్ని కలిపిస్తున్నాయి. వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం, ఆధ్యాత్మికం, సైన్సు ప్రయోగాలు, పురాణాలు, కథలు, కథానికలు, సాహిత్యం, తెలుగు, ఇంగ్లీషు వ్యాకరణం, శబ్ధరత్నాకరం వంటి అనేక రకాల పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. మంచి పుస్తకం చదవడం ద్వారా మనో వికాసం చెందుతుందని.. గంటల తరబడి చరవాణిలు, కంప్యూటర్ల వద్ద ఉన్నా దొరకని అనుభూతిని పొందవచ్చని ఎన్నో ఏళ్లుగా పుస్తకాలను చదవడం అలవాటుగా చేసుకున్న వారంతా సూచిస్తున్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులతో పుస్తక పఠనానికి సమయం తగ్గించేస్తున్నారని.. విద్యార్ధులు కేవలం పాఠ్యాంశాలకు పరిమితం అవుతుండడం కొంత ఆందోళన కలిగించే అంశమని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నడుం బిగించాలని కోరుకుంటున్నారు.

ఈనెల 19వ తేదీ వరకు పుస్తక ప్రదర్శన, విక్రయాలతోపాటు సాహిత్య, ప్రతిభావేదికలు, శతజయంతి సభలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రెండు వందలకుపైగా స్టాళ్లలో ప్రాంతీయ, జాతీయస్థాయి ప్రచురణకర్తల నుంచి తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో వేలాది పుస్తకాలను తెప్పించి ఉంచారు. జీవితాన్ని సమగ్రంగా దర్శింపజేసే సాధనాలే-పుస్తకాలు. బాధల్లో ఓదార్పునిస్తూ.. సమాజంలో ఎలా నడచుకోవాలో బోధించే స్నేహితులే పుస్తకాలు. ఇంకెందుకు ఆలస్యం ఇష్టమైన పుస్తకాన్ని కొని చదవండి- మానసిక ఆనందాన్ని పొందండి.

ఈసారి 200 పుస్తకాల స్టాళ్లు: ఈసారి దాదాపు 200 పుస్తకాల స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు నిర్వాకులు తెలిపారు. ఈ స్టాళ్లలో కేజీ నుంచి పీజీ వరకూ పుస్తకాలను అందుబాటులో ఉంచామన్నారు. పిల్లలకు సంబంధించిన పుస్తకాలు అధికంగా ఉన్నాయని.. భారతం, రామాయణం, భగవద్గీత, కథల పుస్తకాలు, పంచతంత్రం సహా అన్నీ పుస్తకాలు అందుబాటులోకి ఉంచమన్నారు. తెలుగు, ఆంగ్ల నవలలు, ఇంజినీరింగ్‌, మెడికల్‌ పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు సహా అన్ని రకాల పుస్తకాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పుస్తక విక్రేతలు, ప్రచురణ కర్తలు తరలివచ్చి స్టాళ్లను ఏర్పాటు చేశారని వెల్లడించారు.

విజయవాడ 'పుస్తక మహోత్సవం' రా రమ్మంటోంది

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.