వైసీపీ అరాచకాలతో ప్రజలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు : చంద్రబాబు

author img

By

Published : Mar 4, 2023, 9:40 PM IST

Updated : Mar 5, 2023, 10:14 AM IST

చంద్రబాబు

Chandrababu : తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రతిపక్షాలపై అనుసరిస్తున్న తీరును ఆయన ఎండగట్టారు. తర్వాత కాలంలో జగన్​మోహన్​ రెడ్డి లాంటి వ్యక్తి ఉంటే.. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్​ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ అరాచకాలతో ప్రజలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు : చంద్రబాబు

Chandrababu Fires : ఒక్క సైకో వందల మంది సైకోలను తయారు చేయటంతోనే వైసీపీ నేతలను మనం కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఎంపీ రఘురామరాజు, సుబ్బారావు గుప్తాలే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎవరు ప్రశ్నించినా అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రావణ కాష్ఠ పరిస్థితులు ఏర్పడిన.. లీగల్ సెల్ అందుకు ధీటుగా పనిచేస్తోందని వెల్లడించారు. ఎన్టీఆర్ భవన్ సమీపంలోని సీకే కన్వెన్షన్ హాల్​లో చంద్రబాబు అధ్యక్షతన.. తెలుగుదేశం లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. రాష్ట్రంలో సామాన్యులు బతికే పరిస్థితి లేదని చంద్రబాబు ఈ సదస్సులో అన్నారు. వైసీపీ అరాచకాలతో బతకలేమంటూ ప్రజలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేసే హక్కుందన్నట్లు డీజీపీ స్థాయి అధికారులే మాట్లాడే దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని ధ్వజమెత్తారు. వివిధ ఘటనల్లో న్యాయవాదులు చేసిన కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.

గడిచిన నాలుగు సంవత్సరాలలో తెలుగుదేశం శ్రేణులపై నమోదు చేసిన అక్రమ కేసులపై సదస్సులో చర్చించారు. లోకేశ్​ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రభుత్వ అడ్డంకులను సమావేశంలో గుర్తు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం అనుసరించవలసిన విధానాలపై సమీక్షించారు. వైసీపీ నేతల దాడుల్లో బాధిత కుటుంబాలు పడ్డ ఇబ్బందులను వారు సదస్సులో వివరించారు. అంతేకాకుండా లీగల్ సెల్ అందించిన సాయాన్ని బాధితులు గుర్తు చేసుకున్నారు. డ్రైవర్​ సుబ్రహ్మణ్యం శవాన్ని ఎమ్మెల్సీ ఆనంతబాబు కారులో తీసుకువచ్చిన తీరును సదస్సులో గుర్తు చేసుకుని అతని తల్లి కన్నీళ్లు పెట్టుకున్నారు.

పొలిటికల్ రౌడీయిజాన్ని భూ స్థాపితం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్​మోహన్​ రెడ్డి పాలనలో విధ్వంసం పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. ఒక్క విశాఖలోనే 40వేల కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మెడపై కత్తిపెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారని.. ఇలాంటి పరిస్థితిలో పెట్టుబడులు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కూడా జగన్​మోహన్ రెడ్డి లాంటి వ్యక్తే ఉంటే.. ప్రజలకు భవిష్యత్తు ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారుల్ని బోనెక్కించకుండా వదలనని ఆయన హెచ్చరించారు. అన్ని శక్తులు కూడగట్టుకుని చేసే పోరాటంలో న్యాయవాదుల పాత్ర కీలకమన్నారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడైన జగన్​మోహన్ రెడ్డి అమరావతిపై అసత్య ఆరోపణలు చేసాడని ఆరోపించారు. నరేగా పనులు చేసిన వారికి బిల్లులు ఇప్పించటంలోనూ న్యాయవాదుల కృషి కీలకమని అభినందించారు. న్యాయవాదుల కృషి లేకుంటే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకునేవారని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు తనపై ఏమైనా కేసులున్నాయా అని.. డీజీపీకి లేఖ రాయాల్సిన పరిస్థితి నెలకొందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇంతక ముందు తనపై ఎలాంటి కేసులు లేవని.. తనపై కేసులు పెట్టేందుకు ఎవరూ సాహసించలేదన్నారు. ఇప్పుడు తనపై ఎన్ని కేసులున్నాయో తెలియదని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో 175నియోజకవర్గాల్లో తెలుగుదేశం అభ్యర్థులకు లీగల్ సెల్ సహకారం ఎంతో అవసరమని ఉద్ఘాటించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను న్యాయవాదులు సవాల్​గా తీసుకుని అక్రమాలను అరికట్టాలని కోరారు. రావణున్ని యుద్దంలో ఓడించడానికి రాముడొక్కడే చాలని.. ధర్మ పరిరక్షణ కోసం రాముడు అందరి సాయం తీసుకున్నారని గుర్తుచేశారు. ఉడుత కూడా ధర్మ పరిరక్షణ కోసమే సాయం చేసిందని హితవు పలికారు.

గడిచిన నాలుగేళ్ల సమయంలో విశాఖలో పెట్టుబడి పెట్టడానికి ఒక్క రూపాయి రాలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి లాయర్ల అవసరం ఉందని, అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ లీగల్ సెల్ లాయర్ల సేవలు వినియోగించుకుంటామని తెలిపారు.సుప్రీంకోర్టు పరిధిలోనున్న అమరావతి అంశంపై జగన్​మోహన్ రెడ్డి వ్యాఖ్యలు.. సైకో తనమేనని ధ్వజమెత్తారు. ఓ సారి జైలుకు పోయి వచ్చారు కాబట్టే.. లెక్కలేని తనంతో ఎన్ని ఉల్లంఘనలైనా చేస్తారని దుయ్యబట్టారు. ఎన్ని కేసులు పెట్టిన జగన్​మోహన్ రెడ్డి మాట్లాడటం ఆపరని మండిపడ్డారు. దీనిపై కోర్టు ధిక్కరణ కేసు పరిశీలిస్తున్నామన్నారు.

"విధ్వంసం పరాకాష్టకు చేరింది. మామూలుగా కాదు. ఇంత విధ్వంసకారుడ్ని నేనేప్పుడు చూడలేదు. నాలుగు సంవత్సరాలలో ఒక్క రూపాయీ పెట్టుబడి రాలేదు. పెట్టుబడి రాదు, ఇక్కడ పెట్టుబడి పెట్టిన పరిశ్రమలే పారిపోయే పరిస్థితికి వచ్చింది. మెడమీద కత్తి పెట్టి సంపాదించుకున్న ఆస్తులను రాసేసుకుంటున్నారు."- టీడీపీ అధినేత చంద్రబాబు

ఇవీ చదవండి :

Last Updated :Mar 5, 2023, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.