ETV Bharat / state

ఆస్పత్రిలో సిబ్బంది లేరు.. సౌకర్యాల్లేవు.. తూతూ మంత్రంగా కొవిడ్‌ మాక్‌డ్రిల్‌

author img

By

Published : Apr 11, 2023, 10:09 AM IST

Covid Mock Drill in Vijayawada Government Hospital: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తాజాగా అధికారులు చేపట్టిన కొవిడ్‌ మాక్‌డ్రిల్‌‌పై తీవ్రమైన విమర్శలు తలెత్తుతున్నాయి. ఏళ్ల తరబడి ఆసుపత్రిలో సాధారణ రోగులకు వైద్య సేవలు అందించేందుకే.. వైద్యులు లేక, రోజవారీ సిబ్బంది లేక, సరైన సౌకర్యాలు లేక రోగులు అవస్థలు పడుతుంటే.. అధికారులు తూతూ మంత్రంగా కొవిడ్‌ మాక్‌డ్రిల్‌ నిర్వహించారని రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Covid Mock
Covid Mock

Covid Mock Drill in Vijayawada Government Hospital: 'అదొక ప్రభుత్వాసుపత్రి.. అందులో సమయానికి వైద్యులు ఉండరు. రోజవారీ సిబ్బంది ఉండరు. సరైన సౌకర్యాలు ఉండవు. రోగానికి ఖచ్చితమైన మందులు కూడా ఉండవు. ప్రభుత్వం ఆదేశించినప్పుడల్లా ఆసుపత్రికి ఉన్నతాధికారులు వస్తారు.. రోగులతో మాట్లాడి వారి సమస్యలను తీరుస్తామంటూ ప్రకటనలు చేస్తారే తప్ప.. సమస్యలను పరిష్కరించనే పరిష్కరించరు' అంటూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్య సమస్యలతో విచ్చేసిన రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగుల సమస్యలను పట్టించుకోని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆసుపత్రిలో అధికారులు నిర్వహించిన కొవిడ్‌ మాక్‌డ్రిల్‌‌పై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి.

అంతా బాగానే ఉందంటూ ప్రకటనలు: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ రోగులకు వైద్య సేవలు అందించేందుకే.. రోజవారీ సిబ్బంది, సౌకర్యాలు, మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉన్నతాధికారులు రావడం రోగులతో మాట్లాడి, హడావుడి చేసి వెళ్లడం తప్ప.. ఆసుపత్రిలో ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యలను పరిష్కరించే పరిస్థితి మాత్రం లేదు. కానీ, అంతా బాగానే ఉందంటూ, మేం ఎలాంటి పరిస్థితులనైనా కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఉన్నతాధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.

తూతూ మంత్రంగా కొవిడి మాక్‌డ్రిల్: దేశవ్యాప్తంగా ప్రధాన ఆసుపత్రుల్లో కొవిడ్‌ సన్నద్ధత కోసం మాక్‌డ్రిల్‌ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కనీసం మాక్‌డ్రిల్‌ కూడా సరిగా నిర్వహించలేక అధికారులు చేతులెత్తేశారు. ఒకేసారి పరిస్థితి చేయిదాటి రోగుల తాకిడి పెరిగినప్పుడే ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను బట్టి మాక్‌డ్రిల్‌ చేపడతారు. కానీ, విజయవాడ ఆసుపత్రిలో కేవలం పది మంచాలను వేసి.. వాటిని సందర్శించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. ఇదే మాక్‌డ్రిల్‌ అంటూ సోమవారం సరిపెట్టేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు నెలల కిందట కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ మాక్‌డ్రిల్‌ నిర్వహించారు. అదే సమయంలో ఆక్సిజన్‌ను మంచాలకు సరఫరా చేసే వ్యవస్థ కూడా సరిగా లేదనే విషయం కూడా తెలిసింది. కానీ, ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. ఈసారి కనీసం ఆక్సిజన్‌ పరిస్థితి ఏంటనేది కూడా పరిశీలించకుండానే అధికారులు మాక్‌డ్రిల్‌ను ముగించారు.

అస్తవ్యస్తంగా పైప్‌లైన్ వ్యవస్థ: కొత్తాసుపత్రిలో ఆక్సిజన్‌ను మంచాలకు అందించే పైప్‌లైన్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. గతసారి మాక్‌డ్రిల్‌ నిర్వహించిన సమయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆ తర్వాత కనీసం వాటికి మరమ్మతులు కూడా చేయలేదు. దీంతో ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. చాలా మంచాలకు ఆక్సిజన్​ అందించే వ్యవస్థ సరిగా లేక.. పక్క బెడ్‌ల నుంచి కనెక్షన్‌ తీసి అందించే పరిస్థితి ఉంది. ఆసుపత్రిలో ఉన్న వెయ్యికి పైగా మంచాలన్నీ ఆక్సిజన్‌ కనెక్షన్‌ ఇచ్చుకునే సౌకర్యం ఉందని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా కనెక్షన్లు ఇచ్చారు కానీ.. అవన్నీ సక్రమంగా ఉన్నాయో లేవో పరిశీలించి, బాగుచేసే వ్యవస్థ లేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అవసరం మరీ ఎక్కువ లేకపోవడంతో పక్క మంచాల నుంచి కనెక్షన్లను తీసి అందిస్తున్నారు. అవసరం పెరిగితే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.

మాకే జీతాల్లేవు, కొత్తవారిని ఎక్కడ్నుంచి తీసుకొస్తారు..!: గతసారి మాక్‌డ్రిల్‌ నిర్వహించినప్పుడే ఆసుపత్రిలో సిబ్బంది కొరత గురించి వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు వివరించారు. కానీ, ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆసుపత్రికి వస్తున్న రోగుల సంఖ్యను బట్టి చూస్తే.. ప్రతి విభాగంలోనూ సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రస్తుతం పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బందికే నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు. ఇంక కొత్త వారిని ఎక్కడ తీసుకొస్తారంటూ ఆసుపత్రికి చెందిన సిబ్బందే బహిరంగంగా విమర్శిస్తున్నారు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించండి: గత రెండు మూడేళ్లుగా సిబ్బంది కొరతపై ఆసుపత్రి నుంచి నివేదికలను ఉన్నతాధికారులకు పంపిస్తూనే ఉన్నారు. ఆసుపత్రిలో ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వో, స్ట్రెచర్‌ బాయ్స్, వార్డు బాయ్స్, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఐటీ టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, బ్యాక్‌ అండ్‌ ఆఫీస్‌ టీం, అదనంగా వైద్యులు, ఆక్సిజన్‌ టెక్నీషియన్లు.. ఇలా అన్ని విభాగాల్లోనూ సిబ్బంది తక్కువే ఉన్నారు. ఏడాది కిందట లెక్కల ప్రకారమే.. 200మందికి పైగా సిబ్బంది అదనంగా అవసరమని తేల్చారు. కొవిడ్‌ ముప్పు వచ్చినా.. రాకున్నా.. కనీసం పెరిగిన సాధారణ రోగుల సేవల కోసమైనా.. సిబ్బంది సంఖ్యను పెంచాల్సి ఉంది. దీనిపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని రోగులు, స్థానికులు వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.