ETV Bharat / state

జీవో నెంబర్ 1పై ప్రతిపక్షాల పోరాటం.. 'చలో అసెంబ్లీ'కి నిర్ణయం

author img

By

Published : Feb 19, 2023, 5:30 PM IST

Updated : Feb 19, 2023, 7:40 PM IST

Andhra Pradesh Left parties important decision: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. బహిరంగ సమావేశాలపై ఆంక్షలను విధిస్తూ జనవరి 2వ తేదీన జీవో నెంబర్​ 1​ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ జీవోపై ఆగ్రహించిన ప్రతిపక్షాలు.. రాజకీయ పార్టీల గొంతును నొక్కేందుకే ప్రభుత్వం జీవోను జారీ చేసిదంటూ.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, రాస్తారోకోలను చేపట్టాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 1ను రద్దు చేసేవరకూ పెద్ద ఎత్తున పోరాటం చేయాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నేతలు విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమై.. కీలక నిర్ణయం తీసుకున్నారు.

SADASSU
SADASSU

జీవో నెంబర్ 1పై ప్రతిపక్షాల పోరాటం.. 'చలో అసెంబ్లీ'కి నిర్ణయం

Andhra Pradesh Left parties important decision: రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 1ను రద్దు చేసేంతవరకూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు నిర్ణయించారు. మార్చిలో శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే.. 'చలో అసెంబ్లీ' పేరుతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలని నిర్ణయించాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే బ్రిటీష్ కాలం నాటి జీవోలను ప్రభుత్వం తీసుకువచ్చిందని ప్రతిపక్షాల నేతలు ఆక్షేపించారు. అదేవిధంగా పోలీసుల తీరును నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలోని పోలీసులు సీఎం జగన్‌కు జీతగాళ్లుగా మారి పని చేస్తున్నారని.. తీరు మార్చుకోవాలని సూచించారు. జీవోను వెనక్కి తీసుకునే వరకు ఐక్యంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించారు.

బహిరంగ సమావేశాలు, బహిరంగ ప్రదేశాల్లో సభలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2వ తేదీన జీవో నెంబర్ 1 తీసుకువచ్చింది. ఈ క్రమంలో విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఈరోజు జీవో నెంబర్ 1ను వ్యతిరేకిస్తూ.. తెలుగుదేశం, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ముఖ్య నేతలు రాష్ట్ర సదస్సును నిర్వహించారు. వీరితోపాటు పలువురు హైకోర్టు న్యాయవాదులు, పలు కార్మిక, ప్రజా సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. సదస్సులో జీవో నెంబర్ 1 పరిణామాల గురించి, ప్రభుత్వం ప్రతిపక్షాల పట్ల అనుసరిస్తోన్న వైఖరి గురించి సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. అసెంబ్లీ ముట్టడి చేయాలని సదస్సులో తీర్మానించారు. ముట్టడికి అన్ని పార్టీల, ప్రజా సంఘాల, నేతలు కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని నేతలు పిలుపునిచ్చారు. అనంతరం జోవోను రద్దు చేసేలా నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్‌‌ను కలిసి చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు. రాష్ట్రంలో జీవో నెంబర్ 1 అమలుపై సదస్సు వేదికగా రాజకీయ పార్టీ నేతలు, హైకోర్టు న్యాయవాదులు తీవ్రంగా తప్పు పట్టారు. జీవో నెంబర్ 1 ఇలాగే కొనసాగితే.. వైసీపీ వారు తప్పా, మిగిలిన ప్రజలంతా ముద్దాయిలవుతారని హైకోర్టు సీనియర్ న్యాయవాది సంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

ప్రతి రాజకీయ పార్టీ, కార్మిక, కర్షక సంఘాలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని, జీవో నెంబర్ 1 రద్దు కోసం ఒక మహా ఉద్యమం చేస్తేనే గానీ.. విజయం సాధించగలమన్నారు. ప్రజా పోరాటం చేయడం ద్వారానే ఇలాంటి నియంతృత్వ పోకడలను అడ్డుకోగలమని.. అందుకు 'చలో అసెంబ్లీ' ముట్టడియే ప్రధాన మార్గమని న్యాయవాదులు, నేతలు వ్యాఖ్యానించారు. ఎన్ని అడ్టుంకులు వచ్చినా జీవోను ఉపసంహరించుకునే వరకూ పెద్ద ఎత్తున పోరాటం చేయాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. అందరి హక్కులను కూలదోసి, ప్రతిపక్షాల పోరాటాలను అణచివేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 1 పేరుతో నల్ల జీవోను తీసుకు వచ్చిందన్నారు. ఇలాంటి నిర్వీర్యమైన పోలీసు వ్యవస్థను తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రగతి శూన్యంగా మారి, ఉనికే నాశనమయ్యే పరిస్థితులు వచ్చాయన్నారు. రాబోయే తరాల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని రామ్మోహన్ వ్యాఖ్యానించారు.

సదస్సులో జోవో నెంబర్ 1పై సీపీఐ, సీపీఎం నేతలు ధ్వజమెత్తారు. సీఎం జగన్ మూర్ఖుడిగా వ్యవహరిస్తున్నారని, ఎవరినీ లెక్కచేయడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. పోలీసులు ఖాకీ డ్రెస్ వేసుకున్న జీతగాళ్లుగా మారారని, ఐపీఎస్ అధికారులు.. సీఎం జగన్‌కు జీతగాళ్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచకాన్ని మించిన అరాచక పాలన జరుగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మండిపడ్డారు. శాంతియుతంగా నడిచే ప్రతిపక్షాల సభలను ప్రభుత్వం చెడగొట్టడమే కాకుండా పోలీసులను ఉసిగొల్పుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 1 అనేది సీఎం జగన్‌కే త్వరలోనే ఉరితాడుగా మారుతుందన్నారు. జీవో నెంబర్ 1ను నిరసిస్తూ త్వరలో చలో అసెంబ్లీ ముట్టడి చేపట్టాలని.. దీనికోసం అన్ని ప్రాంతాల నుంచి అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున తరలిరావాలని నేతలు కోరారు.

జీవో నెంబర్ 1 తీసుకురావడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆ పార్టీ నేత సుంకర పద్మశ్రీ అన్నారు. జీవో నెంబర్.1ను వ్యతిరేకిస్తూ..అందరూ సంఘటితమై ఉద్యమం చేయాలన్నారు. జీవో నెంబర్.1 నిరసనగా చేసే చలో అసెంబ్లీలో అన్ని పార్టీల అధ్యక్షులు పాల్గొనాలన్నారు. మహిళలు ఏకమై చేస్తోన్న అమరావతి రైతుల ఉద్యమాన్నీ.. సీఎం జగన్ అణచి వేశారన్న ఆమె.. జీవో నెంబర్ 1పై కేంద్ర హోంశాఖకు కూడా ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఆనాడూ బ్రిటీష్ ప్రభుత్వ పాలనలో కూడా ఈ జీవో నెంబర్.1 తరహా జీవోను అమలు చేయలేదని.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. లక్షలాది మందితో నడుస్తూ, మహాత్మా గాంధీ స్వాతంత్య్ర ఉద్యమం చేసినా కూడా బ్రిటీష్ ప్రభుత్వం ఈ తరహా జీవోను మాత్రం అమలు చేయలేదని గుర్తు చేశారు. గతంలో వైఎస్ఆర్, జగన్ మోహన్ రెడ్డి, షర్మిల పాదయాత్రలు చేసినా అప్పటి టీడీపీ ప్రభుత్వం.. ఎక్కడా కూడా ఆటంకపరచలేదన్నారు. ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు పర్యటనలకు, లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటున్నారని, పోలీసులు దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు.

అనంతరం తాము దద్దమ్మలం కాదు.. ప్రజా రక్షకులని పోలీసులు నిరూపించుకోవాలని, జీవో నెంబర్.1 రద్దు కోసం చేసే ప్రతి నిరసనకూ తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చంద్రబాబు ఆదేశించినట్లు వర్ల రామయ్య తెలిపారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు తీసుకువచ్చిన జీవో నెంబర్ 1ను అడ్డుకునేందుకు బాధ్యత ప్రజాస్వామ్యవాదులందరిపై ఉందని, నిరసన కార్యక్రమాల్లోప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని సదస్సు వేదికగా పలు కార్మిక, ప్రజా సంఘాల, రాజకీయ పార్టీల నేతలు పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి

Last Updated : Feb 19, 2023, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.