'మా గోడు వినండి.. పొగాకు సాగుకు పెట్టుబడి లేదు..'

author img

By

Published : Jan 17, 2023, 9:59 AM IST

Tobacco Farmers

Tobacco Board : పొగాకు రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. డిసెంబర్‌లో వచ్చిన మాండౌస్ తుపానుతో పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలకు సగానికి పైగా పంట తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ సాగు చేయటానికి పంటలకు పెట్టుబడి లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ కష్ట కాలంలో సాగుదారుల్ని ఉదారంగా ఆదుకోవాల్సిన పొగాకు బోర్డు.. కేవలం వడ్డిలేని రుణాలు అంటూ 10వేల రుపాయలతో సరిపెడుతోంది.

పెట్టుబడి పెట్టేందుకు డబ్బుల్లేక పొగాకు రైతుల ఇబ్బందులు

Tobacco Farmers : రాష్ట్రంలో 53వేల హెక్టార్లలో రైతులు పొగాకు సాగు చేస్తున్నారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో పండిస్తున్నారు. బాపట్ల, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ పొగాకు సాగు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన మాండౌస్ తుపాను.. పొగాకు పంటను తీవ్రంగా దెబ్బతీసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు.. 26వేల 196 హెక్టార్లలో పొగాకు పంట దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 10 వేల హెక్టార్లలో మొక్కలు తీసేసి, మళ్లీ కొత్తగా నారు తెచ్చి నాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాండౌస్‌ తుపానుకు ముందే దాదాపు ఒక్కో రైతు ఎకరాకు 75వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. తుపాను కారణంగా ఈ మొత్తాన్ని పూర్తిగా నష్టపోయారు. తుపానుతో దెబ్బతిన్న తమను ఆదుకోవాలని ఇటీవల రైతులు, రైతుసంఘాల ప్రతినిధులు.. గుంటూరులోని పొగాకు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని సంప్రదించారు. రుణాలు రీషెడ్యూల్‌ చేయాలని, దెబ్బతిన్న తోటలకు ఎకరాకు 25వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు.

"పొగాకు రైతులు ఇబ్బందులలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదని చెప్పటం భాద్యతారాహిత్యం. అధికారులను నియమించాము కదా.. వాళ్లతో మాట్లాడుకోవాలనే కేంద్ర ప్రభుత్వ తీరు వైఖరి సరైనది కాదు. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ప్రభుత్వాలతో చర్చించి రైతులను ఆదుకునే చర్యలు తీసుకోవాలి. ఈ బాధ్యత వారి పైన ఉంది." -హనుమారెడ్డి, రైతు సంఘం నాయకుడు

తుపాను తర్వాత పొగాకు బోర్డు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. చాలాచోట్ల పంట తొలగించి మళ్లీ వేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. అయితే పరిహారం, సహకారం విషయంలో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులకు లేఖలు రాయడంతోనే సరిపెట్టారు. పొగాకు సాగుదారుల సంక్షేమ నిధి నుంచి రూ.10వేలు వడ్డీ లేని రుణం ఇవ్వాలని ఎపెక్స్ కమిటీ నిర్ణయించింది.

"ప్రధాన మంత్రి ఫసల్​ బీమా యోజన పథకంలో పొగాకు పంట లేదు. అందులో పొగాకును చేర్చటానికి ప్రయత్నాలు చేస్తున్నాము. కొన్ని ప్రైవేటు సంస్థలతో కలిసి చర్చించాము. వారు సానుకూలంగా స్పందించారు." -అద్దంకి శ్రీధర్ బాబు, పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

గత సీజన్‌లో పొగాకు పంటకు మెరుగైన ధరలు వచ్చాయి. కర్ణాటకలో పంట ఉత్పత్తి తగ్గడం వల్ల భారీగా ధరలు పలికాయి. గత ఫలితాలతో ఈసారి విస్తారంగా సాగు చేశారు. వాతావరణం అనుకూలించటంతో తోటలు ఏపుగా పెరిగాయి. పంట దిగుబడి వచ్చి.. మంచి ఆదాయం వస్తుందని రైతులంతా ఆశించగా తుపాను దెబ్బకొట్టింది. తీవ్రంగా నష్టపోయిన తమను ఆదుకునే విషయంలో బోర్డు చొరవ చూపడం లేదని రైతులు వాపోతున్నారు. పొగాకు బోర్డు ఉదారంగా ఆదుకోకుంటే ఇకపై పంట పండించే పరిస్థితి ఉండదని రైతులు చెబుతున్నారు.

"పంట నష్టపోవటం వల్ల మేము ఆయోమయ పరిస్థితిలో ఉన్నాము. ప్రభుత్వం కలుగజేసుకుని మమ్మల్ని ఆదుకుంటే బాగుంటుంది. 25వేల రూపాయలు నగదును అందించి.. లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తే మమ్నల్ని ఆదుకున్నవారు అవుతారు." -వేజెండ్ల సింగయ్య, పొగాకు రైతు

"పొగాకు ద్వారా వస్తున్న ఆదాయం నుంచే రైతులను ఆదుకోవటానికి సహాయం చేయమని అడుగుతున్నాము. అంతే తప్ప ప్రత్యేకంగా ఏమీ అడగటం లేదు." -పరిటాల కోటేశ్వరరావు, పొగాకు రైతు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.