ETV Bharat / state

R5 Zone: ముదురుతున్న ఆర్​ 5 జోన్​ వివాదం.. ఉద్యమ తీవ్రత పెంచుతామన్న రైతు ఐకాస

author img

By

Published : Apr 23, 2023, 6:00 AM IST

Etv Bharat
Etv Bharat

Amaravati Farmers : ఆర్​ 5 జోన్​ వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోంది. రాజధాని అమరావతిలో స్థానికులకు కాకుండా స్థానికేతరులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీంతో రాజధాని రైతులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో దీనిపై ఉద్యమిస్తామని రైతు ఐకాస ప్రభుత్వాన్నిహెచ్చరించింది.

ముదురుతున్న ఆర్​ 5 జోన్​ వివాదం

R5 Zone Agitation : ఆర్​ 5 జోన్ వివాదం మరింత ముదిరింది. రాజధానిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు కేటాయించే అంశంలో.. వైసీపీ సర్కార్ మొండిగా ముందుకెళ్తోంది. జోన్ అంశంపై హైకోర్టు నుంచి ఇంకా తీర్పు రాకపోయినా సీఆర్​డీఏ అధికారులు దుందుడుకుగా పనులు చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వ అనుసరీస్తున్నా తీరు ఖండిస్తూ రాజధాని గ్రామాల్లో అన్నదాతలు నిరసనలు చేపట్టారు. ఆర్​5 జోన్‌కు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను తీవ్రతరం చేస్తూ 'ప్రజాచైతన్య యాత్ర'లు చేపట్టాలని రాజధాని రైతు ఐకాస నిర్ణయించింది.

అమరావతిలో ఇతర ప్రాంతాల వారికి ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం కింద స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే మొదటి వారానికల్లా పనులు ప్రారంభించేలా చూడాలని ముఖ్యమంత్రి గడువు నిర్దేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు నామినేషన్‌ పద్ధతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు ప్రారంభించారు. శుక్రవారం నుంచి ముళ్ల కంపలను తొలగించి, భూములను చదును చేస్తున్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఐనవోలు సహా వివిధ గ్రామాల్లో రైతులు నిరసనలకు దిగారు.

నిడమర్రులో పనులను అడ్డుకున్న వారిని అరెస్టు చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పేదలకు ఇళ్ల స్థలాల ముసుగులో అమరావతిని నాశనం చేసే కుట్ర జరుగుతోందని.. రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు పరిధిలో ఉన్న అంశంపై సీఆర్​డీఏ చర్యలు కోర్టు ధిక్కరణేనని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా తీర్పు రాకముందే పనులు చేపట్టేంత తొందరేంటని నిలదీశారు. అన్నదాతలకు, పేదలకు మధ్య ప్రభుత్వం చిచ్చు పెట్టేందుకు యత్నిస్తోందని ధ్వజమెత్తారు.

"కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మీరేమైనా చేయండి. అప్పటి వరకు మీరు ఆగండి సార్​ అని అడిగాము. అడగటానికి మీరేవరంటూ పోలీసులు మాపై దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా మా ఫోన్లు తీసుకుని పగల గొట్టి.. మమ్మల్ని అరెస్టు చేసి స్టేషన్​కు తీసుకెళ్లారు." -రైతు

ఆర్​ 5 జోన్ అంశంపై వెలగపూడిలో రాజధాని రైతు ఐకాస సమావేశమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 24 లేదా 25 నుంచి ప్రజాచైతన్య యాత్రలు చేపట్టాలని నేతలు పిలుపునిచ్చారు. జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్న ప్రదేశాల్లో నిరసనలు కొనసాగించాలని నిర్ణయించారు. ఉద్యమాన్ని దశల వారీగా తీవ్రం చేస్తామని స్పష్టం చేశారు.

"ఇళ్ల లేఅవుట్ల కోసం చెట్లను తొలగించి.. చేస్తున్న ఏర్పాట్లను ఖండిస్తున్నాం. దీనిపై తప్పకుండా మా నిరసన తెలియజేస్తాం. 24వ తేదీన సోమవారం రోజున ప్రజాచైతన్య పాదయాత్ర నిర్వహిస్తాం."-పువ్వాడ సుధాకర్, ఐకాస నేత


ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.