ETV Bharat / state

ACB : పాత కేసులపై ఏసీబీ దృష్టి.. రీ ఓపెన్ దిశగా రవిశంకర్ అయ్యర్ కు బాధ్యతలు!

author img

By

Published : Apr 25, 2023, 9:23 PM IST

ఏసీబీ
ఏసీబీ

Anti Corruption Bureau: పాత కేసులలో దర్యాప్తులో ఏసీబీ వేగం పెంచిదని సమాచారం. అంతేకాకుండా గత నాలుగు సంవత్సరాలుగా అవినితీ నిరోధక శాఖ పెద్దగా కేసులేమీ నమోదు చేయలేదు. ఇటీవల ఓ సమీక్షలో స్వయంగా ముఖ్యమంత్రే ఈ శాఖకు చివాట్లు పెట్టారని తెలుస్తోంది.

Andhra Pradesh Anti Corruption Bureau : అవినీతి నిరోధక శాఖ పనికి రాకుండా పోయిందంటూ ఉన్నత స్థాయి సమీక్షలో వచ్చిన విమర్శలపై ఆ శాఖలో చలనం మొదలైనట్లు కనిపిస్తోంది. పాత కేసులన్నీ తిరగతోడేందుకు ఏసీబీ అధికారులు సమాయత్తం అవుతున్నారని సమాచారం. ఏసీబీ గడిచిన నాలుగేళ్లుగా అడ్రస్​ లేకుండా పోయింది. చెప్పుకోదగ్గ స్థాయిలో కేసులేమీ నమోదు చేయలేదు. అదీకాకుండా పాత కేసుల విచారణ కూడా అంతంత మాత్రంగానే నిర్వహించగా.. మళ్లీ వాటిపై దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు ఏసీబీ డీజీ నియామకంపైనా సందిగ్ధత అలాగే కొనసాగుతోంది.

దుమ్ము దులిపేందుకు సిద్ధమైన ఏసీబీ : ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో అవినీతి నిరోధక శాఖ పనితీరుపై.. ప్రస్తావన రావటంతో ఏసీబీలో చలనం మొదలైనట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి అధికారుల చిట్టాలను బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఏళ్ల తరబడి పెండింగ్​లో ఉన్న కేసుల దుమ్ము దులపాలని ఏసీబీ నిర్ణయించింది. అవినీతి ఆరోపణలు రుజువైనా ఇంకా శిక్ష ఖరారు కాని కేసుల వివరాలను వెలికి తీస్తున్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ, రవాణా, పోలీసు శాఖల్లోనే.. అధికంగా కేసులు నమోదు అయ్యాయి. లంచం, ఆదాయాన్ని మించి ఆస్తులు వంటి కేసులు గరిష్ఠంగా ఈ శాఖల్లోనే నమోదయ్యాయి.

అవినీతి కేసుల నిగ్గుతేల్చే పనిలో : అవినీతి ఆరోపణలు రుజువైనప్పటికీ, ప్రాసిక్యూట్ కాని కేసులు పెద్ద మొత్తంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. రవాణా వంటి కీలక శాఖలలో ప్రాసిక్యూట్ కాని పెద్ద కేసులు ఉన్నట్టు స్పష్టమవుతోంది. కోర్టు స్టేల పేరుతో ఏళ్ల తరబడి ప్రాసిక్యూషన్ నిలిచిపోవటంతో.. ఆయా కేసులు ఎటూ కదలని పరిస్థితులు నెలకొన్నాయి. స్టేలు తొలగించి భారీ అవినీతి కేసుల నిగ్గుతేల్చే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైనట్లు సమాచారం. చాలా కేసుల్లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేసుల విచారణ ముందుకు సాగని పరిస్థితి నెలకొన్నట్టు సంబంధిత అధికారులు భావిస్తున్నట్లుగా సమాచారం.

ఏసీబీ బాధ్యతలు ఎవరికి : ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహించిన సమయంలో ముఖ్యమంత్రి జగన్ అవినీతి నిరోధక శాఖపై తీవ్రమై వ్యాఖ్యలే చేశారని.. ఒక రకంగా ఏసీబీ పనికి రాకుండా పోయిందంటూ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఏసీబీకి కొత్త అధిపతిని నియమించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్​ ఎన్​ ఫోర్స్​మెంట్ శాఖ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ అయ్యర్​కు.. ఏసీబీని అప్పగించాలంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు. రవిశంకర్ అయ్యర్ కు విజిలెన్సుతో పాటు ఎస్ఈబీ బాధ్యతలు కూడా ప్రభుత్వం అప్పగించింది. ఏసీబీ కూడా అప్పగిస్తే మూడు కీలకమైన పోస్టులు ఒకరికే అప్పగించినట్టు అవుతుందన్నది ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై ఇంకా తర్జన భర్జన కొనసాగుతూనే ఉంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.