రాష్ట్రంలో అద్భుతం జరగనుంది.. ఆ బాధ్యత విపక్షాలందరిదీ : పవన్

author img

By

Published : May 8, 2022, 2:38 PM IST

Updated : May 8, 2022, 7:30 PM IST

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమతో ఎవరెవరు కలిసి వస్తారో ఇప్పటికీ తెలియదన్నారు. ఇవాళ్టికీ తమకు భాజపాతోనే పొత్తు ఉందన్న పవన్..రాష్ట్రాన్ని రక్షించాలంటే వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసి చర్చించాలని చెప్పారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆకాంక్షించారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ప్రయత్నాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. నంద్యాల జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. పాణ్యం మండలం కొనిదేడు గ్రామానికి చెందిన సుబ్బారాయుడు కుటుంబానికి పవన్‌ భరోసా ఇచ్చారు. కౌలు రైతు భార్య భూలక్ష్మికి లక్ష రూపాయల చెక్కు అందజేశారు.

రాష్ట్రాన్ని రక్షించాలంటే వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలి

అనంతరం కాసేపు మీడియాతో మాట్లాడిన పవన్.. రాష్ట్రాన్ని రక్షించాలంటే వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రానికి మరోసారి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని.., పొత్తుల గురించే ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసి చర్చించాలని అన్నారు. ఇవాళ్టికీ తమకు భాజపాతోనే పొత్తు ఉందని.., ఏపీ పరిస్థితిని తమ మిత్రపక్షం భాజపా నాయకత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. పొత్తుకోసం తెదేపా ఆహ్వానిస్తే వెళ్తారా అన్న ప్రశ్నకు.. రాష్ట్ర భవిష్యత్, ప్రజల సంక్షేమం, అభివృద్ధికోసం బలమైన ఆలోచనా విధానంతో ముందుకెళ్తామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

వైకాపా నుంచి రాష్ట్రాన్ని రక్షించాలంటే.. అది జరగాల్సిందే

"రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి. ప్రత్యామ్నాయ ప్రభుత్వ ప్రయత్నాన్ని బలంగా తీసుకెళ్తాం. ఎవరెవరు కలిసి వస్తారో నాకు ఇప్పటికీ తెలియదు. ప్రత్యామ్నాయం అనేది బలమైన శక్తిగా ఉండాలి. రాష్ట్రాన్ని రక్షించాలంటే వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే రాష్ట్రానికి మరోసారి తీవ్ర నష్టం. వైకాపా ప్రభుత్వ విధానాల వల్లే వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని చెప్పా.ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. పొత్తుల గురించే ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసి చర్చించాలి. ఇవాళ్టికీ మాకు భాజపాతోనే పొత్తు ఉంది. ఏపీ పరిస్థితిని మా మిత్రపక్షం భాజపా నాయకత్వ దృష్టికి తీసుకెళ్తా. రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు, ఎవరికీ రక్షణ లేదు. సరైన సమయంలో వ్యూహాలు, రోడ్‌మ్యాప్‌ల గురించి చెబుతాం." - పవన్‌ కల్యాణ్‌, జనసేన అధినేత

ఆ తర్వాత నిర్వహించిన నంద్యాల జిల్లా శిరువెళ్లలో నిర్వహించిన రచ్చబండలో.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. కౌలురైతుల కుటుంబాలను ఆదుకుంటామని, కౌలురైతుల కుటుంబాలను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. ఇవాళ 131 మంది కౌలురైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశామని వెల్లడించారు. వైకాపా నేతలు సాయం చెయ్యరు.. తమను చెయ్యనివ్వరని మండిపడ్డారు. జనసేన మాట్లాడేవరకు ప్రభుత్వంలో చలనం రాలేదని ఎద్దేవా చేశారు. రైతులను ఇబ్బంది పెట్టే దళారులు మనకు వద్దని ప్రజలకు సూచించారు. రైతులకు సాయం చేసే దళారీ వ్యవస్థ కావాలన్నారు. 3 వేల మంది కౌలురైతులకు బీమా పథకం వర్తింపజేయాలని పవన్ డిమాండ్ చేశారు.

"సామాజిక అసమానతలు పోవాలని రాజకీయాల్లోకి వచ్చా. వైకాపాకు రేపు 15 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు. నన్ను ఆర్థికంగా దెబ్బ తీసినా లెక్క చేయను. వ్యక్తిగత దాడులు చేసినా భరించేందుకు నేను సిద్ధం. చదువుకున్న యువతకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నా. జాబ్ క్యాలెండర్‌ విడుదల చేసి ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయరు ?. వృద్ధాప్య పింఛను పథకాన్ని ఆనాడు సంజీవయ్య తెచ్చారు. పింఛను పథకానికి దామోదరం సంజీవయ్య తన పేరు పెట్టుకోలేదు." -పవన్‌, జనసేన అధినేత

బాధ్యతగా స్వీకరిస్తా: రాజకీయాల్లో పౌరుషాలు ఉండవని.. వ్యూహాలే ఉంటాయని పవన్ అన్నారు. మేం సింగిల్‌గా రావాలని అడిగేందుకు మీరు ఎవరని ప్రశ్నించారు. తనకు పదవులు అక్కర్లేదని.. డబ్బుపై వ్యామోహం లేదుని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తానేప్పుడూ ప్రజల క్షేమం గురించే ఆలోచిస్తానని.., ప్రజల కన్నీరు తుడవని ప్రభుత్వం ఎందుకని నిలదీశారు. రాష్ట్ర విభజన దెబ్బలు ఇంకా తగులుతూనే ఉన్నాయన్న పవన్.. ప్రజలు రేపు అధికారం ఇచ్చినా బాధ్యతగా స్వీకరిస్తానని చెప్పారు.

"నాపై కేసులు లేవు కనుకే దిల్లీలో ధైర్యంగా మాట్లాడగలిగా. మీ తరఫున పోరాడేందుకు నన్ను ఆశీర్వదించండి. ఇంత మెజారిటీ ఇచ్చినా ప్రజలను చిత్రహింసలు పెడుతున్నారు. ఇతరుల జెండాలు, అజెండాలు నేను మోయను. వైకాపా ప్రభుత్వ వైఫల్యంపై భాజపా పెద్దలకు చెబుతా. మైనార్టీలకు జనసేన అండగా ఉంటుంది. చిన్న చిన్న పనులకు కూడా వైకాపా నేతలకు లంచం ఇవ్వాల్సి వస్తోంది. సిద్ధేశ్వరం-అలుగు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తాం. ఐదేళ్ల సమయం ఇవ్వండి.. రాయలసీమను రతనాలసీమ చేస్తాం. సమాజంలో మార్పు కోసం యువత ఆలోచించాలి. మద్యపాన నిషేధం అన్నారు.. అమలు చేయలేదు. జాబ్ క్యాలెండర్‌ అన్నారు.. ఇప్పటివరకూ లేదు. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇవ్వలేదు." - పవన్, జనసేన అధినేత

ఇవీ చదవండి:

Last Updated :May 8, 2022, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.