ETV Bharat / state

Sreesailam: శ్రీశైలానికి 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద.. నేడు గేట్లు ఎత్తనున్న అధికారులు

author img

By

Published : Jul 28, 2021, 6:46 AM IST

Updated : Jul 28, 2021, 6:52 AM IST

ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద చేరుతోంది. గురువారం ఉదయానికల్లా పూర్తి స్థాయికి నీటి మట్టం చేరే అవకాశం ఉంది. కానీ.. వరద ఉద్ధృతి కొనసాగుతున్న కారణంగా.. ముందు జాగ్రత్తగా ఇవాళే గేట్లు ఎత్తి.. దిగువకు నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు.

sreesailam project
sreesailam project

శ్రీశైలానికి భారీ వరద కొనసాగుతుండటంతో బుధవారం సాయంత్రం గేట్లు తెరుచుకోనున్నాయి. ఇవాళ సాయంత్రం జలాశయం గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 4,66,864 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 62,605 క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లోగా నమోదవుతోంది. గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు.. ప్రస్తుతం 879.30 అడుగుల మేర నీళ్లున్నాయి. గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలకు ప్రస్తుతం 184.27 టీఎంసీలు ప్రాజెక్టులో చేరాయి. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.

2007 తర్వాత...

2007 తర్వాత మళ్లీ జులైలో శ్రీశైలం నిండి నీటిని విడుదల చేసే పరిస్థితి రావడం ఇదే తొలిసారి. మిగిలిన సంవత్సరాల్లో ప్రత్యేకించి ఆలమట్టి నిర్మాణం తర్వాత ఆగస్టు లేదా సెప్టెంబరులోనే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. అటు ఆలమట్టి, ఇటు తుంగభద్రల నుంచి భారీ నీటి విడుదలతో మంగళవారం సాయంత్రం 6 గంటలకు 4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. తుంగభద్ర కూడా నిండటంతో గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. గత ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా కృష్ణా, గోదావరిలోని అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకోనున్నాయి. మరో వారం రోజులు శ్రీశైలంలోకి ఇదే ప్రవాహం కొనసాగితే నాగార్జునసాగర్‌ కూడా నిండే అవకాశం ఉంది.

ఆలమట్టి నుంచి ప్రవాహం...

ఆలమట్టిలోకి 3.92 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా, మూడు లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. ముందుజాగ్రత్తగా నీటినిల్వను తగ్గించారు. 129 టీఎంసీల సామర్థ్యం ఉండగా, 82 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచారు. దిగువన ఉన్న నారాయణపూర్‌ నుంచి 3.05 లక్షల క్యూసెక్కుల నీటిని జూరాలకు వదిలారు. జూరాల జలాశయంలోకి మంగళవారం సాయంత్రం 7 గంటలకు 3.28 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 3.12 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి పునఃప్రారంభమైంది.100.86 టీఎంసీల సామర్థ్యం గల తుంగభద్ర(కర్ణాటక)లో 96.31 టీఎంసీలు ఉంది. లక్షా 12 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 80 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. సుంకేసుల జలాశయానికి 1.07 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 22 గేట్లను ఎత్తి 1.06 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలానికి పెరిగిన వరద

శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి 172.66 టీఎంసీల నిల్వ ఉంది. అటు జూరాల, ఇటు తుంగభద్ర నుంచి వచ్చే నీటితో శ్రీశైలానికి వరద మరింత పెరిగింది. సోమవారం సాయంత్రం 6 నుంచి మంగళవారం సాయంత్రం 6 వరకు 24 గంటల్లో 26 టీఎంసీలు వచ్చింది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుదుత్పత్తి ద్వారా 35 వేల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. గురువారం ఉదయానికి పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోనున్నా.. ముందుజాగ్రత్తగా బుధవారం సాయంత్రం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయనున్నట్లు శ్రీశైలం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ మురళీనాథ్‌రెడ్డి తెలిపారు.

కాగా, ప్రాజెక్టు కుడి వైపు నుంచి విద్యుదుత్పత్తిని ప్రారంభించిన ఏపీ 30 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతోంది. 312 టీఎంసీల సామర్థ్యం గల సాగర్‌లో 188 టీఎంసీలు ఉంది. 35 వేల క్యూసెక్కులు వస్తుండగా, వెయ్యి క్యూసెక్కులు కాలువలకు వదులుతున్నారు. దిగువన పులిచింతలలో పూర్తిస్థాయి నీటినిల్వ ఉంది. 5600 క్యూసెక్కులు రాగా, ఈ నీటిని విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు వదులుతున్నారు.

తగ్గిన గోదావరి ఉద్ధృతి

గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. శ్రీరాంసాగర్‌ నుంచి ఎల్లంపల్లి వరకు నామమాత్రంగానే ఉంది. శ్రీరాంసాగర్‌లోకి 8581 క్యూసెక్కులు రాగా 8వేల క్యూసెక్కులు వదిలారు. ఎల్లంపల్లికి వచ్చిన 26 వేల క్యూసెక్కులను బయటకు వదిలారు. సింగూరు, నిజాంసాగర్‌, మధ్యమానేరు.. ఇలా అన్ని ప్రాజెక్టుల్లోకి కొంత వరద ఉంది.

ఇదీ చదవండి:

arrest: అర్ధరాత్రి హైడ్రామా.. దేవినేని ఉమా అరెస్ట్‌

Last Updated : Jul 28, 2021, 6:52 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.