ETV Bharat / state

Water issue: ఆ పనులే రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీస్తోంది: షెకావత్‌

author img

By

Published : Jul 23, 2021, 7:15 AM IST

Water Energy Minister Gajendrasingh Shekhawat answered on telugu states water war at loksabha
కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించే దురదృష్టకర సంస్కృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోందని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ విచారం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి బోర్డులు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు వాటి పరిధిని నోటిఫై చేశామని.. జ్యూరిస్‌డిక్షన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత బోర్డు శక్తి మరింత పెరుగుతుందని ఆయన లోక్​సభలో తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించే దురదృష్టకర సంస్కృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోందని కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ విచారం వ్యక్తం చేశారు. ఆ పనులే రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయని వ్యాఖ్యానించారు. గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ప్రస్తావించినప్పుడు కేంద్ర మంత్రి ఈ మేరకు స్పందించారు. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం అనధికారికంగా శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి నీరు వాడుకొందని, దీనిపై కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుందా అని అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు.

మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సమాధానమిస్తూ ‘రాయలసీమ రైతుల సమస్యలపై సభ్యుడి ప్రశ్నతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఈ అంశంలో ఏపీ విభజన చట్టం ప్రకారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) నియంత్రణ సంస్థగా పనిచేస్తోంది. సాగు, తాగు అవసరాల కోసం నీటిని విడుదల చేసేటప్పుడు మాత్రమే విద్యుత్తు ఉత్పత్తి చేయాలని కేఆర్‌ఎంబీ 9వ సమావేశంలో నిర్ణయించారు. ఏపీ ముఖ్యమంత్రి నాతోపాటు, కేఆర్‌ఎంబీకి లేఖ రాశారు. నేను దానికి జవాబిచ్చాను. మేం పదేపదే కేఆర్‌ఎంబీ ద్వారానూ, నేరుగా జెన్‌కోకూ లేఖలు రాసి విద్యుత్తు ఉత్పత్తి వెంటనే ఆపేయాలని ఆదేశించాం. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు ప్లాంట్లు పూర్తి స్థాయిలో నడవాల్సి ఉన్నందున విద్యుదుత్పత్తిని ఆపలేమని తెలంగాణ జెన్‌కో ప్రత్యుత్తరమిచ్చింది. అయితే వాటిని నిలిపేయాల్సిందేనని మేం మరోసారి తెలంగాణకు లేఖ రాశాం’ అని చెప్పారు.

‘పాలమూరు’ ఎత్తిపోతలపై..

సీడబ్ల్యూసీ, కేఆర్‌ఎంబీ, పర్యావరణ అనుమతులు లేకుండా తాగునీటి ముసుగులో భారీ ఎత్తిపోతల పథకం పాలమూరు- రంగారెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోందని, దాన్ని నిలిపేయడానికి కేంద్రం ఏమైనా కఠిన చర్యలు తీసుకుంటుందా? అని అవినాష్‌రెడ్డి మరోసారి ప్రశ్నించారు. మంత్రి సమాధానమిస్తూ ‘అంతర్రాష్ట్ర బేసిన్లు, ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టాల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం రెండు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదులపై నిర్మించే ప్రాజెక్టుల రక్షణ కోసం కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు చేశారు. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు వాటి పరిధిని నోటిఫై చేశాం. జ్యూరిస్‌డిక్షన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాత బోర్డు శక్తి మరింత పెరుగుతుంది. అందువల్ల రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులను కచ్చితంగా నిలువరించగలుగుతాం’ అని పేర్కొన్నారు.

ఇదీ చూడండి.

"మాకు జ్ఞానోదయమైంది.. ఎస్సెల్పీని ఉపసంహరించుకుంటాం"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.