ETV Bharat / city

"మాకు జ్ఞానోదయమైంది.. ఎస్సెల్పీని ఉపసంహరించుకుంటాం"

author img

By

Published : Jul 23, 2021, 5:38 AM IST

రాజధాని భూముల కొనుగోళ్ల విషయానికి సంబంధించి హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసే ఉద్దేశంలో ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అనుమతినిస్తూ.. ఎస్సెల్పీ పిటిషన్​ను ధర్మాసనం కొట్టివేసింది.

govt on capital lands
govt on capital lands

"మాకు ఇప్పుడు జ్ఞానోదయమైంది. (వియ్‌ ఆర్‌ వైజర్‌ నౌ). హైకోర్టుకు వెళ్లేందుకు అనుమతించాలని ప్త్రార్థిస్తున్నాం. హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసే ఉద్దేశంలో ఉన్నాం’’ అని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపు న్యాయవాది మహఫూజ్‌ నజ్కీ విన్నవించారు. రాజధాని భూముల కొనుగోళ్ల కేసుల విషయంలో మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తదితరులపై సిట్‌ విచారణను నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గతేడాది సెప్టెంబరు 15న స్టే ఇచ్చింది.

దమ్మాలపాటి శ్రీనివాస్‌ తదితరులపై ఎఫ్‌ఐఆర్‌, విచారణ అంశాలను ప్రచురించకూడదంటూ హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌ జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు గ్యాగ్‌ ఆర్డర్‌పై గతేడాది నవంబరు 25న స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు ఎఫ్‌ఐఆర్‌ నమోదు, విచారణ అంశాలపై స్పందించలేదు. నాటి నుంచి పలుమార్లు సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణలు కొనసాగాయి. గురువారం విచారణ ప్రారంభం కాగానే రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది మహఫూజ్‌ నజ్కీ ‘‘రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్సెల్పీ ఉప సంహరణకు అనుమతి ఇవ్వండి’’ అని కోరారు. స్పందించిన జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ మీరు కౌంటర్‌ దాఖలు చేశారా అని ప్రశ్నించారు. మేం హైకోర్టు ఎదుట కౌంటర్‌ దాఖలు చేస్తామని, అందుకే ఉప సంహరణకు అనుమతి కోరుతున్నామని నజ్కీ తెలిపారు. హైకోర్టు ఎదుట కౌంటర్‌ దాఖలు చేస్తామనడమేనా జ్ఞానోదయం (వైజర్‌) అని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ ప్రశ్నించారు. మూడు వారాల్లో కేసు విచారణ ముగించేలా హైకోర్టును ఆదేశించాలని దమ్మాలపాటి తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. ‘‘పిటిషనర్‌ విజ్ఞప్తి మేరకు ఎస్సెల్పీ ఉప సంహరణకు అనుమతిస్తూ ఇక్కడి పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. సవరించిన పిటిషన్‌ను హైకోర్టు పరిగణనలోకి తీసుకొని నాలుగు వారాల్లో కేసు విచారణను పూర్తి చేయాలి’’ అని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ తీర్పునిచ్చారు. ఈ సమయంలో ప్రతివాదుల తరపు న్యాయవాది సుఘోష్‌ సుబ్రహ్మణ్యం స్పందిస్తూ కౌంటర్‌ త్వరగా దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.. ఎందుకు చేయరు.. చేస్తారు.. ఆరేడు నెలల తర్వాత వారికి జ్ఞానోదయమైంది అంటూ జస్టిస్‌ వినీత్‌ శరణ్‌ చమత్కరించారు.

ఇదీ చదవండి: మాన్సాస్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.